సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా భీమ్లా నాయక్. కానీ పరిస్థితులు సహకరించలేదు. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 అంటూ వుండిపోయారు. టికెట్ రేట్లు వస్తాయి, కరోనా నిబంధనలు మారతాయి. అప్పుడే విడుదల చేద్దాం అని ఫిక్స్ అయి కూర్చున్నారు. కొత్త జీవో వచ్చేవరకు వుందాం అనే ఆలోచనతో మిక్సింగ్ చేయించకుండా, కాపీ తీయకుండా వుండిపోయారు.
25న వేరే సినిమాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ కూడా భీమ్లా నిర్మాత నుంచి వెళ్లిపోయింది. ఆడవాళ్లు, గని సినిమాల ప్రకటనలు వచ్చాయి. కానీ వున్నట్లుండి అదే రోజు రాత్రి భీమ్లా ప్రకటన వచ్చింది. ఇక అక్కడి నుంచి ఉరకలు పరుగులు మొదలయ్యాయి. ఆ ఉరుకులు పరుగులు ఎంత వరకు వెళ్లాయి అంటే అసలు అమెరికాలో ప్రీమియర్లు పడతాయా అనేంతగా. ఆఖరికి మంగళవారం ఉదయానికి అమెరికాకు కంటెంట్ పంపగలిగారు.
ఈ మధ్యలోనే ట్రయిలర్ కట్. దాని మిక్సింగ్ అంతా. కిందా మీదా అయ్యారు. ఏదో అయింది అనిపించారు. కానీ అసలు ఎందుకు ఇంత హడావుడి అయింది. ఏప్రిల్ 1 ఆల్టర్ నేటివ్ డేట్ అనుకున్నవాళ్లు అర్ఙెంట్ గా మనసు ఎందుకు మార్చుకున్నారు. విశ్వసనీయవర్గాల బోగట్టా ప్రకారం భీమ్లా ను ముందుగా విడుదల చేయమని ఇండస్ట్రీ వర్గాల నుంచి గట్టి వత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది.
భీమ్లా విడుదలయ్యే వరకు ఆంధ్రలో కొత్త రేట్లు రావు అని ఇండస్ట్రీ జనాలు నమ్ముతున్నారు. అన్ని సినిమాలు మార్చి నుంచి మే వరకు బారులు తీరి వున్నాయి. ఇప్పుడు భీమ్లా విడుదల కాకపోతే, కొత్త రేట్లు రాకపోతే అన్నీ ఇబ్బందుల్లో పడతాయి.
అందువల్ల ఏమయితే అయింది. రిస్క్ చేయమని భీమ్లా మీద వత్తిడి పెంచారని, అదే సమయంలో బయ్యర్ల నుంచి కూడా ఏప్రిల్ 1 కాదు, ఫిబ్రవరి 25నే కావాలనే డిమాండ్ ఎక్కువగా వచ్చింది. ఈలోగా 21న కొత్త జీవో వస్తుందన్న టాక్ మొదలైంది.
అన్నీ చూసి ఇక ఏమైతే అయిందని ఫిబ్రవరి 25కు ఫిక్స్ అయిపోయారు. అప్పటికప్పుడు రఫ్ కాపీ ఇచ్చి సెన్సార్ చేయించారు. ఆర్ఎఫ్సీ లో అప్పటిప్పుడు పాట చిత్రీకరించి, ఆన్ లైన్ డిఐ చేయించారు. ఇలా అంత ప్రశాంతంగా ఫినిష్ చేసిన సినిమాకు చివరిలో విడుదల సమయంలో తొడతొక్కిడి చేసుకున్నారు.
అది కాస్తా ట్రయిలర్ మిక్సింగ్ మీద, సౌండ్ మీద పడి నెగిటివ్ కొట్టింది. సినిమా మిక్సింగ్ మీద దృష్టి పెట్టి ట్రయిలర్ ను హడావుడిగా చేయడంతో వచ్చిన సమస్య అది.