జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రోడ్డుషోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరుకు రోడ్లపై సభలు పెట్టడం వల్ల కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ప్రభుత్వం బహిరంగ సభలు, రహదారులపై రోడ్ షోలను కట్టడి చేసేలా ఈ ఏడాది జనవరి 2న జీవో నంబర్ 1ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
రహదారులపై బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల గొంతు నొక్కడం కోసం ప్రభుత్వం జీవో1 తీసుకొచ్చిందని పేర్కొంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదే జీవోను సవాలు చేస్తూ తెలుగుదేశం నాయకులు కూడా హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు.
కాగా జీవో నంబర్ 1 ప్రకారం.. రాష్ట్ర రహదారులు, పంచాయతీ, మున్సిపాలిటీ రోడ్లపై సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు ఇరుగ్గా ఉంటాయి. ఈ సభలు, సమావేశాల కోసం అందరూ ఒకేచోటికి రావడం వల్ల తొక్కిసలాటలు జరిగి.. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. జీవో నంబర్ 1 ప్రకారం ఖాళీ స్థలాల్లో పబ్లిక్ మీటింగులు పెట్టుకోవచ్చు. వాహనాల పార్కింగ్, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా విశాలమైన ప్రాంతాల్లో సభలకు అనుమతులు ఇస్తామంటోంది ప్రభుత్వం.