మరోసారి రోడ్డెక్కిన లైగర్ బాధితులు

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా దేశవ్యాప్తంగా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను భారీ రేట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఆరిపోయారు. అలా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు తమకు…

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా దేశవ్యాప్తంగా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను భారీ రేట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఆరిపోయారు. అలా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు తమకు కొంత పరిహారం చెల్లించాలంటూ ఇప్పటికే నిర్మాతలు పూరి జగన్నాధ్, చార్మిపై ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో వాళ్లకు పూరి జగన్నాధ్ హామీ కూడా ఇచ్చాడు. కానీ ఈ మేటర్ ఇంకా తేలలేదు.

తాజాగా లైగర్ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఫిలింఛాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. పూరి జగన్నాధ్ తమకు 9 కోట్ల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాము 80 మంది డిస్ట్రిబ్యూటర్లం ఉన్నామని, తమకు 9 కోట్లు ఇవ్వాలని చెబుతున్నారు. ఇప్పటివరకు తమకు విజయ్ దేవరకొండ నుంచి కానీ, పూరి జగన్నాధ్-చార్మి నుంచి కానీ వ్యక్తిగతంగా ఎలాంటి హామీ రాలేదని చెబుతున్నారు.

ఫిలింఛాంబర్ ఈ వివాదంపై కల్పించుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు లైగర్ బాధితులు. విజయ్ దేవరకొండ, పూరి, చార్మిపై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్షల్లేవని, థియేటర్ల కరెంట్ బిల్లులు కూడా కట్టలేని స్థితిలో ఉన్న తమను ఆదుకోవాలని అంటున్నారు.

ఈ వివాదానికి సంబంధించి కొన్ని నెలల కిందట పూరి జగన్నాధ్ ఆడియో క్లిప్ ఒకటి రిలీజైంది. ఆ క్లిప్ లో భరోసా ఇచ్చినట్టు తామందరికీ న్యాయం చేయాలని కోరుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు-ఎగ్జిబిటర్లు. వీళ్లకు అనుబంధంగా థియేటర్లు లీజుకు తీసుకొని లైగర్ సినిమా రిలీజ్ చేసి నష్టపోయిన మరో 95 మంది లీజుదారులు కూడా ఉన్నారు.

తమను ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటున్నారు వీళ్లంతా ఇప్పటికైనా ఫిలింఛాంబర్ పెద్దలు ఈ విషయంలో కల్పించుకొని.. పూరి-చార్మి ద్వారా తమకు డబ్బులిప్పించే ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. బయ్యర్ వరంగల్ శ్రీను ప్రస్తుతం ఎక్కడున్నాడో తమకు తెలియదని, అతడు ఆఫీస్ కూడా క్లోజ్ చేసి కనిపించకుండాపోయాడని వాపోతున్నారు డిస్ట్రిబ్యూటర్లు.