బాబు అధికారంలోకి వ‌స్తే…త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై సీఎం వైఎస్ జ‌గ‌న్ మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ముద్దుగా ద‌త్త పుత్రుడ‌ని జ‌గ‌న్ పిలిచే సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరును ఎప్పుడూ జ‌గ‌న్ ప్ర‌స్తావించ‌రు. బహుశా త‌న పేరు ప్ర‌స్తావించ‌డానికి కూడా…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై సీఎం వైఎస్ జ‌గ‌న్ మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ముద్దుగా ద‌త్త పుత్రుడ‌ని జ‌గ‌న్ పిలిచే సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరును ఎప్పుడూ జ‌గ‌న్ ప్ర‌స్తావించ‌రు. బహుశా త‌న పేరు ప్ర‌స్తావించ‌డానికి కూడా సీఎం ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డాన్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ జీర్ణించుకోలేకుండా ఉండొచ్చు. ఈ నేప‌థ్యంలో కావ‌లిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే పేద‌ల‌కు ఎలాంటి ప్ర‌మాదం పొంచి వుందో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌నదైన శైలిలో హెచ్చ‌రించారు.

రైత‌న్న‌ల క‌ష్టాలు ప్ర‌త్య‌క్షంగా చూసిన‌ట్టు చెప్పారు. రైతుల‌కు అండ‌గా ఉంటాన‌న్నారు. ఇప్ప‌టికే గిరిజ‌నుల‌కు ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాలు పంపిణీ చేసిన‌ట్టు సీఎం చెప్పారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా భూస‌ర్వేలు నిర్వ‌హిస్తున్న‌ట్టు సీఎం తెలిపారు. ఈ నెల 20న 2 వేల గ్రామాల్లో భూహ‌క్కు ప‌త్రాలు పంపిణీ చేస్తామన్నారు. రైతు వ్య‌తిరేకి చంద్ర‌బాబు అని అన్నారు. చంద్ర‌బాబు పాల‌న‌లో రైతాంగాన్ని గాలికి వ‌దిలేశార‌ని విమ‌ర్శించారు.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు, ఆయ‌న ద‌త్త పుత్రుడు రైతు బాంధ‌వుల వేషం వేశార‌ని దెప్పి పొడిచారు. వీళ్లిద్ద‌రికి తోడుగా రావ‌ణ సైన్యం ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5 నిలిచాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. గ‌తంలో తాను అధికారంలోకి వ‌స్తే రైతుల‌కు సంబంధించి రూ.87,612 కోట్లు మాఫీ చేస్తాన‌ని చెప్పి, ఆ త‌ర్వాత మాట‌కు క‌ట్టుబ‌డ‌కుండా మోస‌గించార‌ని మండిప‌డ్డారు. 

అంతేకాకుండా, బ్యాంకుల్లో పెట్టిన బంగారు ఇంటికి ర‌ప్పిస్తాన‌ని న‌మ్మ‌బ‌లికి, ఆ విష‌యంలోనూ వంచించార‌న్నారు. రైతుల్ని మోస‌గించిన పెద్ద మ‌నిషి చంద్ర‌బాబునాయుడిని ఒక్క మాట కూడా ప్ర‌శ్నించ‌ర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాగే ప్ర‌శ్నిస్తామ‌ని చెప్పిన వారు ప్ర‌శ్నించ‌డ‌మే మానేశార‌ని ప‌రోక్షంగా ప‌వ‌న్‌ను దెప్పి పొడిచారు.  

చంద్ర‌బాబు స్క్రిప్ట్ ప్ర‌కారం డైలాగ్‌లు చెబుతున్న ప్యాకేజీ స్టార్ ఒక వైపు, బాబు, అలాగే దత్త పుత్రుడి డ్రామాలు ర‌క్తి క‌ట్టించాల‌ని ఎల్లో మీడియా తానా తందానా అంటోంద‌ని వ్యంగ్యంగా అన్నారు. ప్రతి పేదవాడికి తోడుగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోంద‌న్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయ‌ని జ‌గ‌న్ హెచ్చ‌రించారు.