ఇటీవలి కాలం వరకూ తెలంగాణ సీఎస్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, నేటి నుంచి కొత్త బాధ్యతల్లో కనిపించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేశ్‌కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఆరో అంతస్తులో అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య నూతన బాధ్యతలు స్వీకరించడం విశేషం.
తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సోమేశ్‌కుమార్ కోర్టు ఆదేశాలతో ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. ఏపీ విభజన సమయంలో ఆయన్ను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వేశారు. అయితే కేడర్ అలాట్‌మెంట్‌పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. క్యాట్‌కు వెళ్లి తెలంగాణలో సీఎస్‌గా కొనసాగుతూ వచ్చారు. అయితే క్యాట్ ఆర్డర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేయడంతో ఆయన ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేశారు. సీఎం జగన్‌కు కలుసుకున్నారు. అనంతరం సెలవుపై వెళ్లారు. తెలంగాణలో సీఎస్‌గా పని చేసి, ఏపీలో దిగువ స్థాయిలో పని చేయడానికి ఆయన మనసు అంగీకరించలేదు. దీంతో వీఆర్ తీసుకున్నారు.
కేసీఆర్ తనకు ప్రధాన సలహాదారుగా నియమించుకుని ఆయన సేవలకు తగిన గుర్తింపు ఇచ్చారు. కొత్త బాధ్యతల్ని తీసుకున్న సోమేశ్‌కుమార్‌కు పలువురు అధికారులు శుభాకాంక్షలు చెప్పారు.