తెలంగాణ నుంచి ప్రకాశ్‌రాజ్‌ను రాజ్యసభకు పంపుతారనే ప్రచారంపై విలక్షణ నటుడు స్పందించారు. మంచి పనిని చెడగొట్టేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేస్తానంటూ తెలంగాణ కేసీఆర్ ముందుకొచ్చారు.
ఇందులో భాగంగా ఇటీవల ఆయన మహారాష్ట్ర వెళ్లి… సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శరద్‌పవార్‌లతో చర్చించారు. ఇరు రాష్ట్రాల సీఎంల చర్చల్లో అనూహ్యంగా విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ప్రకాశ్ రాజ్‌కు రాజ్యసభ ఇచ్చి, బీజేపీకి వ్యతిరేకంగా బలమైన గళాన్ని వినిపించేలా చేయొచ్చని కేసీఆర్ ఎత్తుగడగా పలువురు అంటున్నారు.
త్వరలో తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ సభ్యులు ఖాళీ కానున్నాయి. వీటి భర్తీకి నోటిఫికేషన్ రానుంది. ఇందులో భాగంగా ఒక సీటును ప్రకాశ్‌రాజ్‌కు ఇచ్చే అవకాశాలున్నాయనే చర్చకు తెరలేచింది. ప్రధానంగా మోదీ సర్కార్ పాలనా విధానాలను ప్రకాశ్ రాజ్ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన కూడా లేకపోలేదు.
ఎందుకంటే ఆయనకు కొన్ని హిందుత్వ సంస్థల నుంచి హెచ్చరికలు కూడా వెళ్లాయి. వాటిని ప్రకాశ్‌రాజ్ లెక్క చేయకుండా ముందుకెళుతున్నారు. బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న కేసీఆర్‌తో ప్రకాశ్‌రాజ్ జత కట్టడం చర్చనీయాంశమైంది.
ఇదిలా వుండగా తనకు తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు ఇస్తారనే విషయం గురించి తెలియదని ఆయన అన్నారు. బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటులో భాగంగా జరుగుతున్న మంచిని అడ్డుకునేందుకు ఇలాంటి ప్రచారాలను తెరపైకి తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటి గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని ఆయన కొట్టిపడేశారు.