ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయనే సామెత చందాన…చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ కూటమిగా ఏర్పడబోతున్నారు. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా పవన్‌కల్యాణ్ చెప్పడం విశేషం. పిల్లనివ్వడంతో పాటు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాయకుడిగా చంద్రబాబుపై చెరపలేని మచ్చ ఏర్పడింది. సీఎం కుర్చీ కోసం తనను అల్లుడు వెన్నుపోటు పొడవడం గురించి స్వయంగా నందమూరి తారకరామారావే ఘాటుగా విమర్శించారు.
ఇప్పుడా వెన్నుపోటు నాయకుడికి మరో నాయకుడు జత కలిశారు. ఆయనే జనసేనాని పవన్‌కల్యాణ్. వెన్నుపోటు నాయకులంతా కూటమి కడుతున్నారనే ప్రచారం జరగడానికి కారణం ఇదే. దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్లను ఈ సందర్భంగా ప్రస్తావించుకోక తప్పదు. చంద్రబాబుతో జత కడతానన్న పవన్ మాటలపై ఆర్జీవో ట్వీట్లలో ఏముందంటే…
“ఆ రోజు ఎన్టీఆర్‌ని చంద్రబాబునాయుడు వెన్నుపోటు పొడిచిన దానికన్నా దారుణంగా ఈ రోజు పవన్‌కల్యాణ్ తన జనసైనికులని, తన ఫ్యాన్స్‌ని వెన్నుపోటు పొడిచి చంపేసాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి. తన సొంత ఫ్యాన్స్ నే కాకుండా, తన కాపుల్ని, చివరికి తనని తానే వెన్నుపోటు పొడిచేసుకున్నాడు”
తనను తాను కూడా వెన్నుపోటు పొడుచుకున్నాడని పవన్‌పై ఆర్జీవీ ఘాటైన ట్వీట్లు చేయడం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. గత పదేళ్లుగా పవన్‌కల్యాణ్‌ను అభిమానులు మోస్తున్నారు. రాజకీయ పోరాటానికి స్వస్తి చెప్పి, పొత్తుల కోసం అర్రులు చాచడం పవన్‌కే చెల్లింది. రాజకీయంగా బలపడడానికి పవన్ ఈ పదేళ్లలో చేసిందేమిటి? అనే ప్రశ్నిస్తే… ఏమీ లేదనే సమాధానం వస్తుంది. అలాంటప్పుడు తనకు 30, 40 సీట్లు ఆశించడంలో అర్థం వుందా? అన్ని సీట్లు వచ్చి వుంటే సీఎం కుర్చీని డిమాండ్ చేసే అవకాశం వుందని ఏ మాత్రం సిగ్గు పడకుండా పవన్ చెప్పారు.
ఆర్జీవీ ట్వీట్లతో జనసేన బిత్తరపోతోంది. కౌంటర్ ఇవ్వడానికి కూడా వాళ్ల దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే ఆర్జీవీ ట్వీట్లలో నిజం ఉంది కాబట్టి. ఇలాంటి వాళ్లంతా రాజకీయాల్లోకి వచ్చి, చివరికి నమ్మినోళ్లను వెన్నుపోటు పొడిచి, రాజకీయ పబ్బం గడుపుకు నేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెన్నుపోటు గూటి పక్షులుగా చంద్రబాబు, పవన్‌లను లోకం గుర్తిస్తోంది. అందుకే వాళ్లిద్దరూ ఒకే గూటికి చేరుతున్నారని పౌర సమాజం విమర్శించడం.