యూపీ ఎన్నికల ప్రచారం ఆరంభంలో సమాజ్ వాదీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం రౌడీయిజానికి మళ్లీ అడ్డా అవుతుందంటూ గట్టిగా ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు టోన్ మార్చింది. వరసగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లు సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ లను జాయింటుగా చేసి..ఉగ్రవాదానికి ఆ పార్టీలు అండగా నిలుస్తున్నాయని అంటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ..ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు సైకిళ్లను వాడుతున్నారని, అదెందుకో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. సమాజ్ వాదీ పార్టీకి యూపీలో ఉన్న గుర్తు సైకిల్. ఆ గుర్తుకు ఓటు వేయవద్దనే సెన్స్ లో ప్రధానమంత్రి ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు సైకిళ్లను వాడుతున్నారని అన్నట్టున్నారు.
ఒక యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఎస్పీ,కాంగ్రెస్ లు కలిసి యూపీని ఉగ్రవాదమయం చేశారని, ఉగ్రవాదులకు ఆ పార్టీలు షీల్డ్ లుగా ఉపయోగపడుతున్నాయని వ్యాఖ్యానించారు. యూపీ ఎన్నికల ప్రచార పర్వంలో బీజేపీలో ప్రధానంగా కనిపిస్తున్న మార్పు ఇది.
ఎస్పీ ని రౌడీ పార్టీగా అభివర్ణించి ఇన్నాళ్లూ ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం జరిగింది బీజేపీ వైపు నుంచి. తాము అధికారంలోకి వచ్చాకా యూపీలో రౌడీమూకల పని పట్టామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎస్పీ గనుక మళ్లీ అధికారాన్ని అందుకుంటే అంతే సంగతులని హెచ్చరించారు.
అయితే ఇప్పుడు రౌడీయిజం గురించి కాకుండా.. ఉగ్రవాదం అంశాన్ని బీజేపీ ఎత్తుకోవడం గమనార్హం. కాంగ్రెస్, సమాజ్ వాదీలు ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్నాయంటూ సంచలన ఆరోపణలే చేస్తోంది కమలదళం. స్వయంగా బీజేపీ పెద్ద నేతలే ఈ మాటలు మాట్లాడుతున్నారు.
మరి కేంద్రంలో బీజేపీ ఎనిమిదేళ్ల నుంచి అధికారంలో ఉంది. యూపీలో ఐదేళ్లనుంచి పవర్ లో ఉంది. ఇన్నాళ్లలో దుష్ట, దుర్మార్గ కాంగ్రెస్, సమాజ్ వాదీల ఉగ్రవాద మూలాలను ఎందుకు బయటపెట్టలేదబ్బా! ఆ పార్టీలు అంతగా ఉగ్రవాదానికి కొమ్ము కాస్తూ ఉంటే.. ఆ పార్టీల అధినేతలను ఎందుకు చట్టం ముందు నిలబెట్టలేకపోయారో! డైరెక్టుగా ఉగ్రవాదంతోనే లింకులు అంటున్నారు కాబట్టి.. ఇన్నాళ్లైనా వారిని కట్టిపడేసి, ఉగ్రవాద లింకులను బయటకు లాగలేదే! దీనికేమంటారో!