ఎన్నికల్లో ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలకే సర్వాధికారాలు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఢిల్లీ ప్రభుత్వానికి బదులు లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలుంటాయని 2019లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేమని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పు వెలువరించింది. దీంతో గత కొన్నేళ్లుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సర్కార్, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య సాగుతున్న పోరుకు ఫుల్‌స్టాప్ పడినట్టైంది.
ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ వికృత క్రీడకు తెరలేపింది. ఢిల్లీ పాలనా వ్యవహారాల్లో ఎల్‌జీ తరచూ తలదూరుస్తూ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా నిర్ణయాలు తీసుకునేవారు. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. ఈ వ్యవహారం చివరికి సుప్రీంకోర్టుకు చేరింది.
ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవన్న గత తీర్పును తప్పు పట్టింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారి అని, నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అధికారుల నియామకం మొదలుకుని ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ఎలాంటి అధికారులు వుంటాయో, అదే మాదిరిగానే ఢిల్లీ సర్కార్‌కు వుంటాయని స్పష్టం చేసింది.
కేవలం శాంతిభద్రతలు, భూ సంబంధిత వ్యవహారాలపై మాత్రమే కేంద్రానికి అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. తాజా తీర్పుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ప్రజలకు సంపూర్ణ న్యాయం చేసేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారాలను విస్తరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.