జనసేనాని పవన్‌కల్యాణ్ అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన పేరుతో రాజకీయానికి తెరలేపారు. కనీసం షెడ్యూల్ ప్రకారం దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించలేదు. ఇదేమని ప్రశ్నిస్తే… పవన్ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పరిశీలన కుదర్లేదని చెబుతున్నారు. కాసేపటి క్రితం పవన్‌కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాలకు జగన్ ప్రభుత్వం కారణమని అనడం లేదన్నారు.
అయితే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పు పడుతున్నామన్నారు. జగన్ సర్కార్ ముందే అప్రమత్తమై ధాన్యాన్ని కొనుగోలు చేసి వుంటే ఇప్పుడీ ఇబ్బందులు వచ్చేవి కావన్నారు. పంటల పరిశీలన, ధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయశాఖ మంత్రి నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆయన విమర్శించారు.
పవన్‌కల్యాణ్‌పై వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. కనీసం పంటలు పండించడంపై పవన్‌కు అవగాహన ఉందా? అని నిలదీశారు. పవన్‌కు పది పంటల్ని చూపిస్తే కనీసం ఐదింటిని గుర్తించలేరని వెటకరించారు. పంటల సాగుపై కూడా ఆయనకు అవగాహన లేదని కాకాణి విమర్శించారు. రైతులకు ఆనవాయితీగా వచ్చే ఇన్‌ఫుట్ సబ్సిడీకి చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టిందన్నారు. తామేదో వస్తున్నామంటే ఏపీ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నంటూ చంద్రబాబు, పవన్ అనడాన్ని ఆయన తప్పు పట్టారు.
తమ ప్రభుత్వం రొటీన్‌గానే ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. చంద్రబాబు, పవన్‌లకు ఏమీ తెలియకుండానే మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో సీడ్, ధాన్యం బకాయిలు కలిపి రూ.5 వేల కోట్లు పెండింగ్‌లో వుందని విమర్శించారు.