సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ కలిసి జీవిస్తున్న సంగతి తెలిసిందే. దాన్నే ఇంగ్లిష్ లో లివ్-ఇన్ రిలేషన్ షిప్ అంటారు. అయితే వీళ్లు కేవలం సహజీవనంలోనే ఉన్నారా? గుంభనంగా పెళ్లి కూడా చేసుకున్నారా? చాలామందికి కలిగిన సందేహం ఇది. ఇప్పుడీ ప్రశ్నకు తనదైన స్టయిల్ లో సమాధానం ఇచ్చాడు నరేష్.
“ప్రస్తుతం వైవాహిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. ఇన్ని ఫ్యామిలీ కోర్టులు వచ్చాయంటే దానర్థం ఇదే. కానీ మళ్లీ పెళ్లి అనే సినిమా వివాహ వ్యవస్థను గౌరవిస్తూ చేశాం. ఏ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లి అనేది రెండు మనసుల కలయిక. 2 మనసులు కలిస్తే పెళ్లి అయిపోయినట్టే.”
ఇలా తామిద్దరం దాదాపు పెళ్లి చేసుకున్నట్టే అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు నరేష్. పక్కనే ఉన్న పవిత్ర అవునన్నట్టు తలఊపడం కొసమెరుపు.
నరేష్ నిజజీవితంలో ఈమధ్య కాలంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ వివాదానికి సినిమాలో ఎలా ముగింపు ఇచ్చారనేది మూవీ చూసి తెలుసుకోవాలంటున్నాడు నరేష్. సినిమాలో తన అనుభవాలు, పవిత్ర అనుభవాలతో పాటు.. దర్శకుడి స్క్రీన్ ప్లే మేజిక్ కూడా కనిపిస్తుందంటున్నారు.
మళ్లీ పెళ్లి సినిమాను పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చెబుతున్న నరేష్, ఇందులో యూత్-మాస్ కు నచ్చే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయంటున్నాడు. ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రచారం చేశామనే విషయాన్ని ఖండించిన నరేష్.. ఓ కొత్త పాయింట్ ను చెప్పే క్రమంలో, తమ నిజజీవితాలు రిఫ్లెక్స్ అవుతున్నాయన్నారు.