ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఈ సినిమాతో అతడు బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఇంతకుముందు అతడు నటించిన కొన్ని సినిమాల హిందీ వెర్షన్లు యూట్యూబ్ లో హిట్టయ్యాయి. దీంతో ఛత్రపతి సినిమాతో నేరుగా హిందీ ఆడియన్స్ ను పలకరిస్తున్నాడు ఈ హీరో.
బెల్లంకొండ క్లిక్ అవుతాడా అవ్వడా అనే కోణంలోనే అందరూ చూస్తున్నారు. కానీ ఇదే సినిమాపై దర్శకుడు వీవీ వినాయక్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమా బాలీవుడ్ లో హిట్టయితే, అతడి ప్లాన్స్ అతడికి ఉన్నాయి మరి.
ఛత్రపతి సినిమా హిందీలో హిట్టయితే, హిట్ రీమేక్ డైరక్టర్ గా వినాయక్ కు ఇమేజ్ వస్తుంది. ఇలాంటి ఇమేజ్ ఉన్న డైరక్టర్లకు బాలీవుడ్ లో ఎంత గిరాకీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డేవిడ్ ధావన్ నుంచి ప్రభుదేవా వరకు చాలామందికి బాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ ఇదే.
సో.. ఛత్రపతి హిట్టయితే వినాయక్ కు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడం గ్యారెంటీ. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ నుంచి చాలామంది కుర్రహీరోలు అతడితో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు.
ఇన్నాళ్లూ సరైన కథల్లేక దర్శకత్వానికి దూరమైన వినాయక్ కు, ఇకపై ఆ సమస్య కూడా ఉండదు. మంచి రీమేక్ ప్రాజెక్టు పట్టుకొని, దానికి తమదైన మాస్-యాక్షన్ టచ్ ఇస్తే చాలు, పనైపోతుంది. అందుకే ఛత్రపతి సక్సెస్ పై వినాయక్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు.