‘మీడియం’ మెరుపులు: టాలీవుడ్ కు ఇవే కావాలి!

లాభాలు రావాలంటే స్టార్ హీరోను పెట్టి భారీ బడ్జెట్ సినిమా తీస్తే చాలనుకుంటారు చాలామంది మేకర్స్. ఇది నిజమే. కొన్నాళ్ల పాటు ఇది వర్కవుట్ అయింది కూడా. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, టాలీవుడ్…

లాభాలు రావాలంటే స్టార్ హీరోను పెట్టి భారీ బడ్జెట్ సినిమా తీస్తే చాలనుకుంటారు చాలామంది మేకర్స్. ఇది నిజమే. కొన్నాళ్ల పాటు ఇది వర్కవుట్ అయింది కూడా. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి మారింది. హీరో కంటే కంటెంట్ చూస్తున్నారు జనం. అందుకే భారీ అంచనాలతో వస్తున్న బడా సినిమాలు కొన్ని ఓవైపు ఫ్లాప్ అవుతుంటే, ఎలాంటి అంచనాల్లేకుండా వస్తున్న మీడియం రేంజ్ సినిమాలు కొన్ని సూపర్ సక్సెస్ అవుతున్నాయి.

మొన్నటికిమొన్న విరూపాక్ష సినిమా వచ్చింది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా మీడియం రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కింది. ఇంకా చెప్పాలంటే ఆ నిర్మాత అంత ఖర్చుపెట్టే రకం కూడా కాదు. అయినప్పటికీ కంటెంట్ క్లిక్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. రేపోమాపో వంద కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ఈ సినిమా చేరాలా ఉంది. ఈ సినిమాకు పెట్టిన ఖర్చు అటుఇటుగా రూ.25 కోట్లు.

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా కూడా పెద్ద హిట్టయింది. కల్యాణ్ రామ్ కెరీర్ లో అది బిగ్ బడ్జెట్ మూవీ అవ్వొచ్చు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే అది మీడియం రేంజ్ బడ్జెట్ సినిమానే. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది. దాదాపు 35 కోట్ల రూపాయల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా 65 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు (గ్రాస్) సాధించింది. దాదాపు నాన్-థియేట్రికల్ రూపంలోనే పెట్టిన పెట్టుబడి వచ్చేసింది.

ఇక కార్తికేయ-2 సినిమాది చరిత్ర అనే చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్లో హిట్టయింది ఈ మూవీ. ఇది కూడా మీడియం రేంజ్ సినిమానే కానీ అంతకంటే కాస్త ఎక్కువే ఖర్చుపెట్టారు. కానీ పెట్టిన పెట్టుబడికి మూడింతలు సంపాదించింది కార్తికేయ-2. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు.. టాలీవుడ్ కు ఓ ఊపు తీసుకొచ్చింది.

ఇలా చెప్పుకుంటూపోతే సీతారామం, ఫిదా సినిమాలు కూడా మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కింది ఫిదా సినిమా. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ హీరోహీరోయిన్లుగా వచ్చింది సీతారామం మూవీ. ఇవి కూడా బాక్సాఫీస్ బరిలో కళ్లుచెదిరే వసూళ్లు రాబట్టాయి.

ఓవరాల్ గా చూసుకుంటే, భారీ బడ్జెట్ సినిమాల కంటే, మీడియం రేంజ్ బడ్జెట్ లో కంటెంట్ ను నమ్ముకొని తెరకెక్కిన సినిమాలే ఎక్కువగా క్లిక్ అవుతున్నాయి. టాలీవుడ్ కు కావాల్సింది కూడా ఇదే. ఇండస్ట్రీ స్లంప్ లోకి జారకుండా కాపాడేవి ఇవే.