పేద‌ల సొంతింటి క‌ల‌…జ‌గ‌న్ సాకారం!

మ‌నిష‌న్న త‌ర్వాత కూడు, గూడు, గుడ్డ ప్రాథ‌మిక అవ‌స‌రాలు. ఇప్ప‌టికీ క‌నీసం సొంతింటికి నోచుకోని పేద‌లున్నారు. అలాంటి పేద‌ల సొంతి ఇంటి క‌ల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సాకారం చేస్తున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి…

మ‌నిష‌న్న త‌ర్వాత కూడు, గూడు, గుడ్డ ప్రాథ‌మిక అవ‌స‌రాలు. ఇప్ప‌టికీ క‌నీసం సొంతింటికి నోచుకోని పేద‌లున్నారు. అలాంటి పేద‌ల సొంతి ఇంటి క‌ల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సాకారం చేస్తున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల పేద‌లు క‌నీసం క‌ల‌లో కూడా ఊహించ‌ని ఖ‌రీదైన ఇంటి స్థ‌లం ద‌క్కించుకోవ‌డం, అక్క‌డ నివాసాన్ని ఏర్ప‌ర‌చుకోవ‌డం కేవ‌లం సీఎం జ‌గ‌న్ సంక‌ల్పంతో నెర‌వేర‌నున్నాయి.

ఇప్ప‌టికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 49 వేల మంది పేద‌ల‌కు 1,134 ఎక‌రాల్లో ఇంటి ప‌ట్టాలను ఈ నెల 18న ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం శ‌ర‌వేగంగా ప‌నులు చేస్తోంది. ఇప్ప‌టికే దీనిపై కొంద‌రు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. హైకోర్టులో పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు వ‌ద్ద‌ని వేసిన పిటిష‌న్‌పై వ్య‌తిరేక తీర్పు రావ‌డంతో ఆశ‌ల‌న్నీ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంపై పెట్టుకున్నారు. ఇదిలా వుండ‌గా రాజ‌ధాని ప్రాంతంలో ఇంటి స్థ‌లాలు ఇవ్వ‌ద్ద‌నే ప్ర‌తిప‌క్షాల వాద‌న‌ను ప‌ట్టించుకోకుండా ప్ర‌భుత్వం మ‌రో 268 ఎక‌రాల‌ను కేటాయిస్తూ తాజాగా పుర‌పాల‌క‌శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ వై.శ్రీ‌లక్ష్మి జీవో జారీ చేశారు.

ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్‌కు 168 ఎక‌రాలు, గుంటూరు క‌లెక్ట‌ర్‌కు 100 ఎక‌రాలు కేటాయించ‌డం విశేషం. రాజధానిలోని బోరుపాలెంలో 2 ఎకరాలు, పిచుకల పాలెంలో వేర్వేరు బ్లాక్‌ల్లో 20 ఎకరాలు, 81 ఎకరాలు, అనంతవరంలో 64 ఎకరాలు, నెక్కల్లులో 100 ఎకరాలను పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు కేటాయించే నిమిత్తం ప్రభుత్వం కేటాయించింది. సీఆర్డీఏ కమిషనర్ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.  

రాజధానిలోని ఎస్‌-3 జోన్‌లో ఉన్న గ్రామాల్లో 268 ఎక‌రాలు కేటాయించారు. అయితే పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇస్తుండ‌డాన్ని కొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. పేద‌లు నివాసాల‌ను ఏర్పాటు చేసుకుంటే త‌మ భూముల‌కు రేట్లు రావ‌ని, సంప‌న్న‌వ‌ర్గాలు అక్క‌డికి రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌వ‌నే వాద‌న‌ను తెర‌పైకి తేవ‌డం గ‌మ‌నార్హం. అయితే ప్ర‌భుత్వం మాత్రం ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తూ మొద‌ట పేద‌ల‌కు నివాసాలు ఏర్ప‌ర‌చ‌డానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఆ త‌ర్వాత ఎవ‌రైనా అని ప్ర‌భుత్వ వాద‌న‌. దీన్ని చివ‌రికి వామ‌ప‌క్ష పార్టీలు కూడా స్వాగ‌తించ‌క‌పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. 

ఖ‌రీదైన చోట త‌మ‌కు ఇళ్ల స్థ‌లాలు ఇవ్వ‌డం, సొంతింటి క‌ల‌ను సాకారం చేయ‌డం ఒక్క వైఎస్ జ‌గ‌న్‌కే సాధ్య‌మ‌ని పేద‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ సాయాన్ని జ‌న్మ‌లో మ‌రిచిపోలేమ‌ని వారు అంటున్నారు.