జ‌గ‌న్ పొగ‌.. టీడీపీ స్వార్థ శ‌క్తుల‌కు సెగ‌!

తెలుగుదేశం పార్టీకి విప‌త్క‌ర ప‌రిస్థితి కాదు. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌ర‌చూ ఒక మాట చెబుతూ ఉంటారు. సంక్షోభంలోనే త‌ను అవ‌కాశాల‌ను వెదుక్కొంటానంటూ చంద్ర‌బాబు ఒక మాట‌ను త‌ర‌చూ వాడుతూ ఉంటారు.…

తెలుగుదేశం పార్టీకి విప‌త్క‌ర ప‌రిస్థితి కాదు. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌ర‌చూ ఒక మాట చెబుతూ ఉంటారు. సంక్షోభంలోనే త‌ను అవ‌కాశాల‌ను వెదుక్కొంటానంటూ చంద్ర‌బాబు ఒక మాట‌ను త‌ర‌చూ వాడుతూ ఉంటారు. ప్ర‌త్యేకించి పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడు ఇలాంటి ఉప‌న్యాసాల‌ను ఇస్తూ ఉంటారు. మ‌రి చంద్ర‌బాబు వెదుక్కొనే అవ‌కాశాలు ఏమిటి? అంటే.. పొత్తులు. అవి చీక‌టివో, ప‌గ‌టి పొత్తులో.. ఏవో ఒక‌టి. 

ఎవ‌రిని ప‌ట్టుకుంటే ప‌ని జ‌రుగుతుంది, ఎవ‌రిని ప‌ట్టుకుంటే అధికారం అందుతుంది? అనే లెక్క‌లు వేసుకుని చంద్ర‌బాబు నాయుడు త‌న వ్యూహాలేవో ర‌చిస్తూ ఉంటారు. 2004 నుంచి తెలుగుదేశం పార్టీ మ‌నుగ‌డ‌ను గ‌మ‌నిస్తే.. ఈ ఇర‌వై యేళ్ల‌లో టీడీపీ అధికారంలో ఉన్న‌ది కేవ‌లం ఐదేళ్లు మాత్ర‌మే. అధికారంలో ఉన్నా, లేక‌పోయినా.. గ‌తంలో టీడీపీ మ‌నుషుల ప‌నుల‌న్నీ సాఫీగానే జ‌రిగాయి. 

ప్ర‌త్యేకించి టీడీపీని వెనుకుండి న‌డిపించే వారూ, టీడీపీని అతిగా ఓన్ చేసుకున్న సామాజిక‌వ‌ర్గం, టీడీపీకి జాకీలు వేసే ప‌చ్చ మీడియా. ప్ర‌ధానంగా వీరి స్వార్థ‌మే ప‌ర‌మావ‌ధి టీడీపీ ప్ర‌స్థానంలో. ఈ స్వార్థం మేర‌కు స‌క‌ల ప‌నులూ య‌థేచ్ఛ‌గా జ‌రిగాయి. పార్టీ అధికారంలో ఉన్నా, లేక‌పోయినా.. ఈ క‌త్తికి ఎదురులేక‌పోయింది!

అప్ప‌ట్లో అలా!

తెలుగుదేశం పార్టీ 2004లో అధికారం కోల్పోయినా అనుకూల మీడియా అండ కొన‌సాగింది. అన్న అడుగేస్తే మాస్ .. అన్న‌ట్టుగా టీడీపీ అనుకూల మీడియా చంద్ర‌బాబును ఒక జాతీయ పార్టీ అధినేత అన్న‌ట్టుగా చిత్రీక‌రిస్తూ వ‌చ్చింది. నాడు ఉమ్మ‌డి ఏపీలో 294 సీట్ల‌కు గానూ టీడీపీ ఖాతాలో ఉన్న‌ది 40 చిల్ల‌ర సీట్లే అయినా, చంద్ర‌బాబును జాతీయ నేత అన్న‌ట్టుగా చిత్రీక‌రించారు. చంద్ర‌బాబు అప్ప‌ట్లో త‌ర‌చూ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లే వారు. అంతేగాక‌, ఏపీలో త‌నేం చేసినా దానికి కాంగ్రెసేయ‌త జాతీయ నేత‌ల‌ను ర‌ప్పించే వారు. బీజేపీ వాళ్ల‌ను, స‌మాజ్ వాదీ, ఆర్ఎల్డీ, ఎల్జేపీ వంటి పార్టీల అధినేత‌ల‌ను పేక ముక్క‌ల్లా వాడుకునే వారు. చంద్ర‌బాబు ఏ దీక్ష‌లో, ధ‌ర్నాలో చేప‌డితే వారి స్పంద‌న‌లు వ‌చ్చేవి! ఇదంతా పైకి జ‌రిగే వ్య‌వ‌హారం.

ఇక లోలోప‌ల వ్య‌వ‌హారాల్లో కూడా టీడీపీ అధినేత‌కు తిరుగుండేంది కాదు. కాంగ్రెస్ పార్టీలోని సొంత సామాజిక‌వ‌ర్గం వారు చంద్ర‌బాబు కార్యాల‌ను చ‌క్క‌బెట్ట‌డానికి వెనుకాడే వారు. అప్ప‌ట్లో చంద్ర‌బాబు మాటెత్తితే సోనియాను తిట్టేవారు. త‌న విమ‌ర్శ‌ల రేంజ్ జాతీయ స్థాయికి అన్న‌ట్టుగా చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు సోనియా, మ‌న్మోహ‌న్ లాంటి వారిని ల‌క్ష్యంగా చేసుకునేవారు. మ‌న్మోహ‌న్ ను దొడ్డిదారిన ప్ర‌ధాని అయ్యారనే వారు. సోనియాను దెయ్య‌మ‌ని, రాక్ష‌సి అంటూ ఏదేదో మాట్లాడే వారు.

ఒక‌వైపు కాంగ్రెస్ హైకమాండ్ ను, నాటి ప్ర‌ధాన మంత్రిని అలా విమ‌ర్శిస్తున్నా, సొంత సామాజిక‌వ‌ర్గం ఎంపీల ద్వారా మాత్రం త‌న కార్యాల‌కు చంద్ర‌బాబు నాయుడు లాబీయింగుల‌ను ఎంచ‌క్కా వాడుకున్నారు. కాంగ్రెస్ లోని క‌మ్మ సామాజిక‌వ‌ర్గ ఎమ్మెల్యేల‌తో చంద్ర‌బాబు బంధం 2009 వ‌ర‌కూ బ‌య‌ట‌ప‌డ‌లేదు. అప్ప‌టి వ‌ర‌కూ అంత‌ర్గ‌తంగా సాగిన వ్య‌వ‌హారాలు వైఎస్ మ‌ర‌ణానంత‌రం మాత్ర‌మే వెలుగులోకి వ‌చ్చాయి. పైకి చంద్ర‌బాబును విమ‌ర్శించినా, లోలోప‌ల తామెంత క్లోజో ఆ త‌ర్వాతి కాలంలో కాంగ్రెస్ ఎంపీలు లోకానికి చాటి చెప్పారు. 

విభ‌జ‌న‌తో ఏపీలో కాంగ్రెస్ ను ఖ‌తం చేసిన త‌ర్వాత వీళ్లంతా జాయింటుగా టీడీపీలోకి చేరిపోయారు. అంత వ‌ర‌కూ కాంగ్రెస్ లో కూర్చుని వైఎస్ భ‌జ‌న చేస్తూ, వైఎస్ మ‌నుషులుగా చ‌లామ‌ణి అయిన వారు, ఆయ‌న మ‌ర‌ణానంత‌రం చంద్ర‌బాబుకు అతి స‌న్నిహితుల‌య్యారు. సామాజివ‌క‌వ‌ర్గం బంధంతో.. ద‌శాబ్దాల పాటు కాంగ్రెస్ లో కొన‌సాగిన వారు కూడా చంద్ర‌బాబుతో చ‌ట్టాప‌ట్టాలేసుకున్నారు. ఇలాంటి వారు తాము కాంగ్రెస్ లో ఉన్న‌ప్పుడు కూడా చంద్ర‌బాబుతో సామాజిక‌వ‌ర్గ నేప‌థ్యంతో స‌న్నిహిత్యాన్ని కొన‌సాగించారు. అలా ప్ర‌తిప‌క్షంలో ఉన్నా, అధికారంలో ఉన్న పార్టీలోని ఏజెంట్ల ద్వారా చంద్ర‌బాబు కార్యాల‌న్నీ తీరాయి. ఒక‌వైపు కాంగ్రెస్ తో పోరాటం అంటూ క‌ల‌రింగ్ ఇస్తూ, అంత‌ర్గ‌తంగా మాత్రం ఇలాంటి వ్య‌వ‌హారాలు చేయ‌డం చంద్ర‌బాబుకే సాధ్య‌మైంది!

కిర‌ణ్ హ‌యాంలో అంతా తానై!

కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాకా.. ఆ ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టిందే చంద్ర‌బాబు అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి ఉంటే, కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వం అప్పుడే కుప్ప‌కూలేది. అయితే అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా, కిర‌ణ్ స‌ర్కారు మ‌నుగ‌డ‌ను కొన‌సాగించి, ఆ పై జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న‌కు కూడా చంద్ర‌బాబు నాయుడే కార‌ణ‌మ‌య్యారు. 

కిర‌ణ్ స‌ర్కారు ప‌డిపోయి ఉంటే, రాష్ట్ర విభ‌జ‌న‌కు కూడా కాంగ్రెస్ హై క‌మాండ్ రెడీ అయ్యేది కాదు. వీలైన‌న్ని రోజులు కిర‌ణ్ తో బండి లాగించి, రాజ‌కీయ స్వార్థం కోసం తెలంగాణ‌లో అయినా ఉనికిని నిలుపుకోవాల‌ని కాంగ్రెస్ రాష్ట్ర విభ‌జ‌న‌కు పాల్ప‌డింది. కిర‌ణ్ స‌ర్కారుపై జ‌గ‌న్ పార్టీ పెట్టిన అవిశ్వాసానికి టీడీపీ మ‌ద్ద‌తు ప‌లికి ఉంటే, ఆ త‌ర్వాతి రాజ‌కీయం అంతా వేరేగా ఉండేది. ఎన్నిక‌లు వ‌స్తే జ‌గ‌న్ అధికారాన్ని సంపాదించుకుంటాడ‌నే లెక్క‌ల‌తో మాత్ర‌మే చంద్ర‌బాబు నాయుడు అప్పుడు కిర‌ణ్ ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌బ‌డ్డారు.

ఈ విశ్వాసంతో పూర్తిగా చంద్ర‌బాబు చెప్పుచేత‌ల్లోకి వెళ్లింది కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వం. అప్పుడు కూడా అనునిత్యం చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ ను తిట్టేవారు. సోనియాను ఇష్టానుసారం మాట్లాడేవారు. అయితే చంద్ర‌బాబు, కిర‌ణ్ కుమార్ రెడ్డిల చీక‌టి పొత్తు మాత్రం ఎంచ‌క్కా కొన‌సాగింది. కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని గైడ్ చేయ‌డంలో తెలుగుదేశం అనుకూల మీడియానే కీల‌క పాత్ర పోషించింది. కిర‌ణ్ కుమార్ రెడ్డి వ్య‌వ‌హారాల‌ను టీడీపీ అనుకూల మీడియాధినేత‌లు ప‌ర్య‌వేక్షించారు. క‌నీసం సొంత నియోజ‌క‌వ‌ర్గంపై కూడా ప‌ట్టులేని కిర‌ణ్ కుమార్ రెడ్డిని, వీరుడు, శూరుడుగా అభివ‌ర్ణిస్తూ త‌మ ప‌నుల‌న్నీ చ‌క్క బెట్టుకున్నారు. జ‌గ‌న్ ను త‌క్కువ చేసి చూపి, కిర‌ణ్ ను ఎక్కువ‌గా చూపిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం క‌ళ్ల‌కు కూడా గంత‌లు క‌ట్టారు!

కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని టీడీపీ పైకి విమ‌ర్శించేది. అయితే నాడు అనేక వ్య‌వ‌హారాలో టీడీపీ అనుకూల వ్య‌క్తుల వాటాలు కూడా ఉన్నాయ‌నే వార్త‌లూ వ‌చ్చాయి. రోశ‌య్య హ‌యాంలో మొద‌లైన ఒక భూ వ్య‌వ‌హారంలో తోక ప‌త్రిక య‌జమాని కిర‌ణ్ కుమార్ రెడ్డి హ‌యాం నాటికి వాటాల‌ను సెటిల్ చేసుకున్నాడ‌నే వార్త‌లూ వ‌చ్చాయి. అలా పేరుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే ఉన్నా, కాంగ్రెస్ పార్టీ వ్య‌తిరేక‌తే పునాదిగా ఏర్ప‌డిన టీడీపీలోని స్వార్థ శ‌క్తుల వ్య‌వ‌హారాల‌న్నీ అలా చ‌క్క‌బెట్టుకున్నాయి.

వైఎస్ ఉన్న‌న్నాళ్లూ నిత్యం కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోయాడం, సొంత సామాజిక‌వ‌ర్గ ఎంపీల‌తో ప‌నులు చ‌క్క‌బెట్టుకోవ‌డం, రోశ‌య్య కిర‌ణ్ ల హ‌యాంలో జ‌గ‌న్ ను బూచిగా చూపి కాంగ్రెస్ హ్యాండిల్ ను టీడీపీ అనుకూల మీడియా ఆఫీసుల నుంచి న‌డిపించారు. అధికారంలో ఉంటే చాలు, ప‌ద‌విలో ఉంటే చాల‌న్న‌ట్టుగా నాటి కాంగ్రెస్ నేత‌లు చంద్ర‌బాబు ఆడ‌మ‌న్న‌ట్టుగా ఆడారు. ఆ త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయారు. చంద్ర‌బాబుతో సాన్నిహిత్యం అంటే, అది ఎవ‌రికైనా రాజ‌కీయంగా అంతిమ మెట్టు అని కాంగ్రెస్ పార్టీ  ప‌రిస్థితిని చూస్తే స్ప‌ష్టం అవుతుంది.

చీక‌టి రాజ‌కీయాల్లో తిరుగులేదు!

వాళ్లూ, వీళ్లూ అక్క‌ర్లేదు. త‌నే స్వ‌యంగా చీక‌టి రాజ‌కీయాల‌ను చేయ‌డంలో చంద్ర‌బాబుకు తిరుగులేదు. ఈ విష‌యం పార్ల‌మెంట్ సాక్షిగా కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. పార్ల‌మెంట్ లో తెలుగుదేశం పార్టీ వాళ్లు గ‌లాభా చేస్తుంటే, తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడే త‌న‌తో వ‌చ్చి స‌మావేశం అయ్యాడంటూ నాటి కేంద్ర మంత్రి, కాంగ్రెస్ కీల‌క నేత చిదంబ‌రం ప్ర‌క‌టించ‌డం చంద్ర‌బాబు తీరును పూర్తిగా బ‌య‌ట‌పెట్టింది. 

చీక‌టి రాజ‌కీయాల్లో చంద్రబాబు ప్రావీణ్యాన్ని ఒక రేంజ్ లో ర‌క్తిక‌ట్టించిన వ్య‌వ‌హారం అది. ఒక‌వైపు కాంగ్రెస్ విధానాల‌ను విమ‌ర్శిస్తూ, కాంగ్రెస్  పై దుమ్మెత్తి పోస్తూ, ఏపీతో కాంగ్రెస్ ఆడుకుంటోందంటూ విరుచుకుపడుతూ, కాంగ్రెస్ రాజ‌కీయాల‌ను విమ‌ర్శించ‌డానికి గంట‌ల కొద్దీ ప్రెస్ మీట్ల‌ను పెడుతూ, రాజ‌కీయంగా అత్యంత ఉద్రిక్త స్థితిలో కూడా చిదంబ‌రంతో చీక‌టి బంధాన్ని నెరిపిన ప్రావీణ్యం చంద్ర‌బాబుది! కిర‌ణ్ తో అయినా, నాటి కాంగ్రెస్ జాతీయ నేత‌ల‌తో అయినా చంద్ర‌బాబు అలాంటి చీక‌టి బంధాల‌ను నెరిపారు.

ఆ త‌ర్వాత వారికి తిరుగులేని త‌న నైజాన్ని చ‌వి చూపిస్తూ, చంద్ర‌బాబు నాయుడు మోడీ పంచ‌న చేరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆ పార్టీపై పైకి పోరాడుతున్న‌ట్టుగా మాట‌లు చెబుతూ, చీక‌ట్లో మాత్రం వారితో చిందులేస్తూ, ఆ పై కాంగ్రెస్ క‌థ అయిపోతున్న ద‌శ‌లో.. బీజేపీతో భాయీభాయీ అన్నారు చంద్ర‌బాబు. చంద్ర‌బాబు ఆట‌లో పావులైన కాంగ్రెస్ నేత‌లు.. ఆ త‌ర్వాత అస‌లు క‌థ‌ను అర్థం చేసుకున్నారు. అయినా చంద్ర‌బాబు తీరు మాత్రం మార‌లేదు. 2019 ఎన్నిక‌ల నాటికి మ‌ళ్లీ కాంగ్రెస్ తో డైరెక్టుగా చేతులు క‌లిపి, మ‌రో క‌థ‌ను న‌డిపించారు. అదీ చీక‌టి రాజ‌కీయాలు, అవ‌స‌రార్థ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు ప్రావీణ్యం.

క‌థ మారిపోయింది, ఉక్కిరిబిక్కిరి!

ఏపీలో జాతీయ పార్టీల ఉనికి ఉన్నంత వ‌ర‌కూ చంద్ర‌బాబు ఆట‌ల‌కు తిరుగులేక‌పోయింది. ఒక‌వైపు ఆ పార్టీల‌తో పోరాడుతున్న‌ట్టుగా క‌ల‌రింగ్ ఇస్తూ, మ‌రోవైపు ఆ పార్టీలోని త‌న వారితో వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టుకుంటూ వ‌చ్చారు. 

అయితే ఏపీలో కాంగ్రెస్ క‌థ కంచికి చేర‌డం, తెలంగాణ‌లో కేసీఆర్ చంద్ర‌బాబును అస‌హ్యించుకుంటూ ఉండ‌టం, అంత‌కు మించి ఏపీలో జ‌గ‌న్ రూపంలో మ‌రో ప్రాంతీయ రాజ‌కీయ శ‌క్తి బ‌లోపేతం కావ‌డం .. ద‌శాబ్దాలుగా తాము నెరిపిన చీక‌టి రాజ‌కీయాల‌కు చెక్ ప‌డ‌టంతో ప‌చ్చ బ్యాచ్ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంది. అల‌వాటుగా ఉన్న ఆ  రాజకీయాలకు ఇప్పుడు స్కోప్ లేక‌పోవ‌డ‌మే ప‌చ్చ బ్యాచ్ కు పొగ బెడుతున్న‌ట్టుగా అవుతోంది.

కేసీఆర్ ద‌గ్గ‌ర ద‌క్క‌ని అవ‌కాశం!

హ‌రికృష్ణ పార్థివ దేహాన్ని చూడ‌టానికి తాము వెళితే, అక్క‌డ చంద్ర‌బాబు నాయుడు పొత్తుల ప్ర‌స్తావ‌న తీసుకు వ‌చ్చారంటూ టీఆర్ఎస్ నేత కేటీఆర్ బ‌య‌ట‌పెట్ట‌డంతోనే టీడీపీని ఆ పార్టీ పూర్తిగా దూరంగా పెట్ట‌డం ప్రారంభం అయ్యింది. కేసీఆర్ తో పొత్తు ద్వారా హైద‌రాబాద్ లో త‌మ ఉనికిని అయినా నిలుపుకోవాల‌ని చంద్ర‌బాబు నాయుడు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. దీని కోసం ఎంత వ‌ర‌కూ త‌గ్గ‌డానికి అయినా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు. 

అయితే కేసీఆర్ మాత్రం చంద్ర‌బాబును డ‌ర్టీయెస్ట్ పొలిటీషియ‌న్ అంటూ అస‌హ్యించుకుంటూనే వ‌చ్చారు. దీంతో చేసేది లేక కాంగ్రెస్ పార్టీతో చేతులు క‌లిపి చంద్ర‌బాబు కేసీఆర్ కు చెక్ పెట్టాల‌నే ప్ర‌య‌త్నాల‌నూ చేశారు. అందితే త‌ల‌, అంద‌క‌పోతే కాళ్లు అనే ఫిలాస‌ఫీని చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ‌లో అమ‌ల్లో పెట్టారు. అయితే ఈ రెండు ప్ర‌య‌త్నాల‌కూ భంగ‌పాటే ఎదురైంది. 

చంద్ర‌బాబుతో స్నేహం క‌న్నా, చంద్ర‌బాబును అస‌హ్యించుకుంటేనే త‌న‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నం అన్న లెక్క‌ల‌తో టీడీపీ బ్యాచ్ ను పూర్తిగా ప‌క్క‌న పెట్టారు కేసీఆర్. తెలంగాణ‌లోని క‌మ్మ సామాజిక‌వ‌ర్గం కూడా చంద్ర‌బాబుపై అశ‌ల‌న్నీ వ‌దిలేసి కేసీఆర్ తో సాన్నిహిత్యానికే ప్రాముఖ్య‌త‌ను ఇచ్చింది. అంతిమంగా తెలంగాణ‌లో టీడీపీ జెండా ప‌ట్టే వారు లేకుండా పోయారు. హైద‌రాబాద్ లో చంద్ర‌బాబు లాబీ చ‌క్రం పూర్తిగా స్ట్ర‌క్ అయ్యింది. ఇప్పుడు హైద‌రాబాద్ పై చంద్ర‌బాబుకు కూడా ఎలాంటి ఆశ‌ల్లేవు. ఆయ‌న లాబీ, వ‌ర్గం హైద‌రాబాద్ లో క‌కావిక‌లం అయ్యింది. 2019 ఎన్నిక‌ల నాటితోనే హైద‌రాబాద్ లో తెలుగుదేశం అనే మాట‌కు త‌లుపులు మూసుకుపోవ‌డం మొద‌లైంది.

ఏపీలో వైఎస్ న‌మ‌య‌ని అంటున్నారు!

వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి ని చంద్ర‌బాబు నాయుడు పొగుడుతున్నారిప్పుడు! వైఎస్ జ‌గ‌న్ క‌న్నా వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి చాలా న‌య‌మంటూ చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించ‌డం త‌న ప‌ర్స‌న‌ల్ ఫీలింగ్స్ ను పంచుకుంటున్న‌ట్టుగానే ఉంది! వైఎస్ త‌న‌కు స్నేహితుడ‌ని, స‌న్నిహితుడ‌ని ఇప్పుడు చెప్పుకుంటున్నారు చంద్ర‌బాబు. ఇన్నేళ్లూ వైఎస్ పై అపార‌మైన ద్వేషాన్ని ప్ర‌క‌టిస్తూ.. ఇప్పుడు వైఎస్ పేరు చెప్పుకుంటే ఎక్క‌డైనా ఊర‌ట ల‌భిస్తుందేమో అని ఆశను బ‌య‌ట‌పెట్టుకుంటున్నారు. 

అక్క‌డ వైఎస్ హ‌యాంలో, కాంగ్రెస్ లోని లూప్ హోల్స్ ను ఉప‌యోగించుకుంటూ త‌ను వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టుకున్న వైనం కూడా చంద్ర‌బాబుకు గుర్తుకు వ‌స్తూ ఉండ‌వ‌చ్చు. అది జాతీయ పార్టీ కాబ‌ట్టి.. ఎవ‌రేం చేస్తున్నారు, ఎవ‌రి చీక‌టి రాజ‌కీయాలేవో, ఎవ‌రు త‌న, ఎవ‌రు మ‌న‌.. అనే అంశాలు కూడా క్లారిటీ ఉండేవి కావు. అయితే వైఎస్ లా జ‌గ‌న్ కాస్తో కూస్తో కూడా ఉదార‌వాది కాదు. ఎందుకంటే వైఎస్ ఎదిగి వ‌చ్చిన తీరుకూ, జ‌గ‌న్ అనుభ‌వించిన ప‌ద‌హారు నెల‌ల జైలు జీవితానికీ చాలా తేడా ఉంది. అన్ని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌నూ ఎదుర్కొనే జ‌గ‌న్ ప్ర‌జ‌ల నుంచి విజేత అయ్యాడు.  

కాబ‌ట్టి వైఎస్ చూపిన ఉదార‌వాదం జ‌గ‌న్ ద‌గ్గ‌ర నుంచి ఉండాల‌ని ప్ర‌త్య‌ర్థులు కూడా ఆశించ‌రాదు. జ‌గ‌న్ పై తెలుగుదేశం పార్టీ, క‌మ్మ సామాజిక‌వ‌ర్గ మీడియా, చంద్ర‌బాబు చీక‌టి మ‌నుషులు.. ఎలా వ్య‌వ‌హ‌రించారో 2019 నాటి ముందు ప‌రిణామాల‌న్నీ సాక్ష్యం. మ‌రి తాము అలా వ్య‌వ‌హ‌రించి, జ‌గ‌న్ నుంచి మాత్రం చాలా ఎక్సెప్ష‌న్ ఆశిస్తున్నారు తెలుగుదేశం వాళ్లు. జ‌గ‌న్ ఏ మాత్రం ఏమారుపాటుగా ఉన్నా ఈ పాటికి జ‌గ‌న్ పార్టీని, ప్ర‌భుత్వాన్ని కుక్క‌లు చింపిన విస్త‌రిగా చేసేది చంద్ర‌బాబు గ్యాంగ్. టీఆర్ఎస్ పైనా ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేసే హైద‌రాబాద్ నుంచి పరార్ కావాల్సి వ‌చ్చింది. 

చంద్ర‌బాబు కుయుక్తుల‌న్నింటినీ ఎదుర్కొని వ‌చ్చిన జ‌గ‌న్ మాత్రం టీడీపీని కూక‌టి వేళ్ల‌తో పెక‌లించే ప‌నిలో బిజీగా ఉన్నారు. అన్ని న‌ట్ల‌నూ టైట్ చేశారు. జ‌గ‌న్ పెడుతున్న పొగ‌కు ప‌చ్చ బ్యాచ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. చివ‌ర‌గా త‌మ‌కు ప‌ట్టున్న వ్య‌వ‌స్థ‌ను ఉప‌యోగించుకుని అన్ని అస్త్రాల‌నూ ప్ర‌యోగిస్తోంది. పార్టీ నేత‌లకు జైలు జీవితం నుంచి కాస్త మిన‌హాయింపును తెచ్చుకుంటూ ఉంది. మ‌రి ఇదెన్నాళ్లు? అనేది కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే! రాబోయే రోజుల్లో ఈ మిన‌హాయింపులూ ఉంటాయ‌నుకోవ‌డానికి వీల్లేదు. ఇప్ప‌టికే చంద్ర‌బాబు అస్త్ర‌శ‌స్త్రాల‌న్నీ న‌శించిపోయాయి. ఇక మిగిలి ఉన్న వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేయ‌డం కూడా సుదీర్ఘ‌కాలం జ‌రిగే ప‌ని కాద‌ని చెప్ప‌వ‌చ్చు.

చంద్ర‌బాబుపై వారిలోనూ పోతున్న న‌మ్మ‌కం!

ఇన్నేళ్లూ ఏదోలా చీక‌టి రాజ‌కీయాలు చేస్తూ చంద్ర‌బాబు నాయుడు సొంత పార్టీ అధికారంలో ఉన్నా, లేక‌పోయినా త‌న మ‌నుషుల‌, సామాజిక వ‌ర్గ స్వార్థాల‌న్నింటినీ సాక‌రం చేసి పెట్టారు. అయితే వ‌య‌సు మీద ప‌డుతూ ఉండ‌టం, చంద్ర‌బాబు వార‌సుడు స‌మ‌ర్థ‌త శూన్యం కావ‌డం, చంద్ర‌బాబుపై స్థూలంగా ప్ర‌జ‌ల న‌మ్మ‌క‌మే పోవ‌డం, చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకుంటే తమ శ‌క్తి హీనం కావ‌డం త‌ప్ప ఉప‌యోగం ఉండ‌ద‌ని ఇత‌ర పార్టీలు కూడా గ్ర‌హించ‌డం.. ఈ పరిణామాల‌న్నీ చంద్ర‌బాబుని న‌మ్ముకున్న బ్యాచ్ లో కూడా అప‌న‌మ్మ‌కాన్ని పెంచుతున్నాయి. 

ఈయ‌న‌ను న‌మ్ముకుంటే ఇంతే సంగ‌తుల‌నే త‌త్వం వారికీ బోధ‌ప‌డుతూ ఉంది. ఇప్పుడు చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న రాజ‌కీయ వ్యూహం, ఆయ‌న మాట్లాడుతున్న మాట‌లూ.. అన్నీ కూడా వెనుక ఉన్న స్వార్థ శ‌క్తుల ర‌చ‌నే. ఆ శ‌క్తుల్లో కూడా ఫ్ర‌స్ట్రేష‌న్ ప‌తాక స్థాయికి చేరింది. ఈ ఫ్ర‌స్ట్రేష‌న్లో ఏం రాస్తున్నామో, ఏం చేస్తున్నామో కూడా వారే అర్థం చేసుకోనేంత రీతిలో ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

ఒక‌వైపు అలుముకుంటున్న పొగ‌, మ‌రోవైపు మూసుకుపోతున్న అన్ని త‌లపులూ.. ఇలాంటి ఉక్కిరిబిక్కిరి స్థితిలో స‌త‌మ‌తం అవుతున్నాయి చంద్ర‌బాబు వెనుక ఉన్న స్వార్థ శ‌క్తుల‌న్నీ!