పసుపు కుంకుమల సొమ్ము ఆ ఖాతాలోనిదా.. ?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2019 ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు పంపిణీ చేపట్టారు. మొత్తానికి మొత్తం నారీలోకం ఓట్లు తమకు పడిపోతాయని తమ్ముళ్ళు చాలా ఆశపడ్డారు. అయితే పసుపు కుంకుమ…

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2019 ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు పంపిణీ చేపట్టారు. మొత్తానికి మొత్తం నారీలోకం ఓట్లు తమకు పడిపోతాయని తమ్ముళ్ళు చాలా ఆశపడ్డారు. అయితే పసుపు కుంకుమ సొమ్ములు ఎంత ఇచ్చినా ఓట్లు మాత్రం వైసీపీకే పడ్డాయి. అలా వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.

ఇదిలా ఉంటే పసుపు కుంకుమ నిధుల కోసం వివిధ ప్రభుత్వ ఖాతాల్లో నుంచి సొమ్ము మళ్ళించారని ఆనాడే ఆరోపణలు వచ్చాయి. అందులో పెద్ద మొత్తంగా అంటే 130 కోట్ల రూపాయలను ఆంధ్రా యూనివర్శిటీ నిధుల నుంచి తీసుకున్నారని వైసీపీ విద్యార్ధి విభాగం నాయకుడు కాంతారావు తాజాగా ఆరోపించారు.

ఆ విధంగా ఏయూలో అభివృద్ధి లేకుండా చేసిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు. అంతే కాదు నాడు చంద్రబాబు సర్కార్ ఆర్భాటంగా నిర్వహించిన జ్ఞానవాణి కోసం కూడా ఏయూ నుంచి పది కోట్లు లాగేశారని ఆరోపించారు. ఇపుడు ఏయూ మీద ప్రేమ ఉన్నట్లుగా టీడీపీ నేతలు గుండెలు బాదుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఏయూని అభివృద్ధి చేస్తున్నదే వైసీపీ సర్కార్ అని ఆయన స్పష్టం చేశారు.

మరో వైపు చూస్తే గీతం యూనివర్శిటీని పోటీగా దించి ఏయూని దాని ప్రతిష్టను బాగా తగ్గించాలని చూసిన ఘనత కూడా టీడీపీ పాలకులదే అని ఆయన నిందిస్తున్నారు. ఏయూ ఇపుడు సవ్య దిశలో సాగుతోందని, పేదలకు ఇక్కడ నాణ్యమైన విద్య అందుతోందని, ఎన్నో కొత్త కార్యక్రమాలకు పాలకులు శ్రీకారం చుడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

మొత్తానికి పసుపు కుంకుమ మొత్తాల్లో ఏయూ నుంచి లాగేసిన సొమ్ము కూడా ఉందని ఈ విధ్యార్ధి నేత కొత్త పాయింటే బయట పెట్టారు. మరి విద్యా సంస్థలకు కేటాయించిన నిధులను పక్కకు మళ్ళించడం మంచిదో కాదో టీడీపీ తమ్ముళ్ళు ఇపుడైనా నోరు తెరచి నిజాలు చెబుతారా. చూడాలి.