తన కేబినెట్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్ వెళ్లారు. తన కుమారుడి మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన జగన్ దంపతులను చూడగానే మేకపాటి గౌతమ్‌రెడ్డి తల్లి కన్నీరుమున్నీరయ్యారు. గౌతమ్ తల్లిదండ్రులను జగన్, భార్య శ్రీకీర్తి, కుమార్తెలను జగన్ భార్య వైఎస్ భారతి ఓదార్చారు.
గౌతమ్ మరణవార్త విన్న జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే గౌతమ్‌తో జగన్‌కు స్నేహ సంబంధాలున్నాయి. జగన్ ప్రోద్బలంతోనే గౌతమ్ రాజకీయాల్లోకి వెళ్లారు. నిజానికి గౌతమ్‌కు రాజకీయాలంటే పెద్దగా ఇష్టం లేదని సమాచారం.
పారిశ్రామికవేత్తగా గౌతమ్ శక్తిసామర్థ్యాలు తెలిసిన జగన్… తన కేబినెట్‌లో చోటు కల్పించారు. పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా గౌతమ్‌పై పెద్ద బాధ్యతే పెట్టారు. జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు గౌతమ్ ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో విధి మరోలా తలచింది. ఇవాళ గుండెపోటుతో అనంతలోకాలకు వెళ్లిపోయారు.
గౌతమ్ పార్థివదేహానికి నివాళులర్పించేందుకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ దంపతులు హైదరాబాద్‌కు వెళ్లారు. సీఎంను చూడగానే గౌతమ్‌రెడ్డి తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కొడుకును తలచుకుంటూ విలపించారు. జగన్ దంపతులు ఓదార్చారు. =ఇదిలా వుండగా గౌతమ్ మృతిపై జగన్ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
గౌతమ్‌రెడ్డి తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నాయకుడని పేర్కొన్నారు. తన యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధను కలిగించిదని జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారమైన హృదయంతో గౌతమ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని జగన్ తెలిపారు.