వాస్తవానికి ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహార శైలి వైసీపీకి ఇబ్బందిగా మారాలి. కానీ నెల్లూరు జిల్లాలో ఆనం టీడీపీలో గుబులు పుట్టిస్తున్నారు. ఆనం టీడీపీలోకి రావడం గ్యారెంటీ అనేది లోకల్ టాక్, నూటికి 99శాతం అది నిజమయ్యే అవకాశముంది. అదే సమయంలో టీడీపీ సీనియర్లు ఆనం రాకతో కీడు శంకిస్తున్నారు.
నెల్లూరు మాజీ మంత్రి సోమిరెడ్డి ఇప్పటికే స్థానికంగా బాగా దెబ్బతిన్నారు. ఏదో జిల్లాకు పెద్ద దిక్కుగా ఫోజు కొడుతున్నారంతే. మాజీ మంత్రి నారాయణలా డబ్బులు ఖర్చు పెట్టలేరు, ఆనంలాగా ఆయనకు జనాల్లో పరపతి లేదు. అదే ఉంటే.. ప్రత్యక్ష ఎన్నికల్లోనే గెలిచేవారు, పరోక్షంగా ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి పొందేవారు కాదు. అలాంటి సోమిరెడ్డి, ఆనం వస్తే తన అడ్రస్ గల్లంతవుతుందని తెగ ఇదైపోతున్నారు.
ఆనం టీడీపీ ఖాయమేనా..?
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆనం రామనారాయణ రెడ్డి, ఆ తర్వాత అధికారంలో ఉన్న టీడీపీలో చేరారు. సరిగ్గా ఎన్నికల ముందు జనం నాడి తెలిసిపోయింది కాబట్టి వైసీపీలోకి వచ్చారు. వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి ఆశించారు.
ఫస్ట్ ఫేజ్ లో రాలేదు, సెకండ్ ఫేజ్ లో కూడా కష్టమని తేలిపోయింది. దీంతో ఇప్పుడు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. జిల్లాల విభజన తప్పుడు నిర్ణయం అని అంటున్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యే అయిఉండి కూడా నిరాహార దీక్షలకు దిగారు. అంటే జగన్ అపాయింట్ మెంట్ ఆయనకి దొరకలేదు, దొరకదు అని అర్థమైపోయింది.
సో.. వైసీపీలో ఇక ఆనం పప్పులు ఉడకవు, వచ్చే దఫా టికెట్ కూడా అనుమానమే. అందుకే ఆయన టీడీలో చేరాలనుకుంటున్నారట. తనతోపాటు, తన కుమార్తెకి కూడా టీడీపీలో టికెట్ ఇస్తారనే హామీ తీసుకునే ఆనం చివరి నిముషంలో కండువా మార్చేస్తారట. జిల్లాల విభజన పూర్తయితే నెల్లూరులో కేవలం 7 నియోజకవర్గాలే ఉంటాయి. అందులో 2 ఆనం చేతిలో పెడితే.. మిగతా ఐదులో సామాజిక లెక్కలేసుకుంటే.. సోమిరెడ్డికి అసలు ఖాళీ ఉంటుందా లేదా అనేది అనుమానమే.
వారసుడ్ని దింపాలనే ఉత్సాహంలో ఉన్న సోమిరెడ్డికి ఇది నిజంగా పెద్ద షాకే. అందుకే ఆయన ఆనం రాకూడదని కోరుకుంటున్నారు. కానీ అత్యంత అవకాశవాది అయిన చంద్రబాబు ఆనంలాంటి వారికి పిలిచి మరీ టికెట్ ఇస్తారు. వైసీపీ నుంచి ఓ ఎమ్మెల్యేను చేర్చుకున్నామనే క్రెడిట్ బాబుకి కావాలి. అలాంటప్పుడు ఆనంకి సీటు గ్యారెంటీ. సోమిరెడ్డికి పొగ తప్పదు.
జనం ఒప్పుకుంటారా..?
ఆనం కుటుంబానికి నెల్లూరులో మంచి పేరుంది. నెల్లూరు సిటీలో అయినా ఆ చివర ఉన్న ఆత్మకూరులో అయినా, ఈ చివర ఉన్న వెంకటగిరి అయినా, మరో చివర్లో ఉన్న పాత నియోజకవర్గం రాపూరులో అయినా.. ఇలా ఒకే జిల్లాలో నాలుగు వేర్వేరు చోట్ల గెలిచిన చరిత్ర ఆనం కుటుంబానికి ఉంది. పార్టీ పరపతితో పాటు సొంత ఫాలోయింగ్ కూడా దీనికి కారణం. అలాంటి వ్యక్తి ఇలా ఎన్నికలనాటికి కొత్త పార్టీని చూసుకుంటే జనం యాక్సెప్ట్ చేస్తారా..? లేదా..? అనేది డౌట్.
అయితే ఆనం లెక్కలు ఆయనకున్నాయి. రెండు సీట్లు తీసుకుంటే కనీసం ఒక్కచోట అయినా గెలుస్తామనే ధీమా ఆయనది. ఈ లెక్కలు బాగానే ఉన్నా.. స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు మాత్రం ఆనం పెత్తనాన్ని భరించలేరని తెలుస్తోంది. ముఖ్యంగా సోమిరెడ్డి హడలిపోతున్నారు.