బిహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు వరసగా శిక్షలు ఖరారు అవుతున్నాయి. దాణా స్కామ్ లో లాలూ ప్రసాద్ యాదవ్ దశాబ్దాలుగా విచారణను ఎదుర్కొంటూ వస్తున్నారు. 90లలో హాట్ టాపిక్ గా నిలిచిన ఈ కేసులో గత కొన్నేళ్ల నుంచి తీర్పులు వస్తున్నాయి. వాటిల్లో భాగంగా ఇప్పటికే లాలూ ప్రసాద్ జైలుకు వెళ్లారు. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన హాస్పిటల్ లో ఉంటున్నారు.
ఈ దాణా స్కామ్ కు సంబంధించి మొత్తం అరవైకి పైగా కేసులు నమోదయ్యాయి. వాటిల్లో ఆరు కేసుల్లో లాలూను నిందితుడిగా పేర్కొంది సీబీఐ. వాటిల్లో ఇప్పటి వరకూ మొత్తం ఐదు కేసుల్లో తీర్పులు వచ్చాయి. మొదటి నాలుగు కేసులూ కలిపి లాలూకు 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇప్పుడు ఐదో కేసులో ఐదేళ్ల జైలు శిక్షను వేసింది న్యాయస్థానం. దీంతో పాటు అరవై లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది.
ఇంకో కేసులో లాలూకు శిక్ష ఖరారు కావాల్సి ఉంది. బహుశా అన్ని కేసుల జైలు శిక్ష కూడా ఒకేసారి అమలయ్యే అవకాశాలుంటాయి కాబోలు.
ఈ అంశంపై బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆచితూచి స్పందించారు. లాలూపై తాము కేసులు పెట్టలేదన్నారు. ఇప్పుడు లాలూతో సన్నిహితులుగా ఉన్న వారే ఆయనపై కేసులు నమోదు చేశారన్నారు.
తద్వారా లాలూ తప్పు చేశారు, శిక్షను అనుభవిస్తున్నారనే వాదనను వినిపించకుండా తప్పించుకున్నారు నితీష్. అయితే లాలూకు శిక్ష ఖరారు చేస్తున్నది ప్రధానంగా జార్ఖండ్ హైకోర్టే. ఈ అంశంపై లాలూ అప్పీల్ కు వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం లాలూ వయసు 73 సంవత్సరాలు.