అన్నిటికీ మౌనంగా ఉంటే ప్రతిపక్షాలకు అలుసైపోవడం గ్యారెంటీ. రఘురామ విషయంలో జగన్ నోరు మెదపలేదు, ఆనం విషయంలో బయటపడలేదు, పోనీ ఇటీవల నందిగం సురేష్ మనుషులు పోలీస్ స్టేషన్లో రచ్చ చేశారంటే దానిపై కూడా పార్టీ నుంచి స్పందన లేదు.
తాజాగా ఓ ఎంపీటీసీ భర్త, ఇంకొందరు వైసీపీ నాయకులు పోలీస్ కానిస్టేబుల్ బైక్ పై మద్యం బాటిల్, బిర్యానీ పెట్టి హంగామా చేస్తే ఇక్కడా పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒకరిపై వేటు వేయడం మొదలు పెడితే మిగతావాళ్లు సెట్ రైట్ అవుతారు, అన్నిటికీ మౌనంగా ఉంటే ప్రతిపక్షాలకు అలుసైపోతారు.
తప్పులు చేయకుండా ఎవరూ ఉండరు, కానీ వారిని సరైన టైమ్ లో కంట్రోల్ లో పెడితేనే మిగతావారికి బుద్ధొస్తుంది, అది లేకపోతే, ఎల్లో మీడియా ప్రచారాల్ని జనం నమ్మే ప్రమాదం ఉంది. చేతులు కాలక ముందే చేతల్లోకి దిగడం బెటర్. ప్రస్తుతం ఏపీలో అక్కడక్కడా ఇలాంటి మితిమీరిన సంఘటనలు బయటపడుతున్నాయి.
గతంలో లాగా వాటిని పట్టించుకోవట్లేదు జగన్. నిజంగానే పట్టించుకోవట్లేదా అంటే ఆయన లెక్కలు ఆయనకుంటాయి. ఆయన ఏదైనా చివరివరకూ భరిస్తారు. చివర్లో ఆ దెబ్బ ఎలా ఉంటుందో.. ఇటీవల చాలామంది రుచి చూశారు. ఆయన భరిస్తారు సరే, ప్రజలు భరించగలరా, ప్రతిపక్షాలు, వారి అనుకూల మీడియా ముందు ప్రజల్లో వ్యతిరేక ముద్ర పడితే ఎలా అనేది కాస్త ఆలోచించాలి.
జిల్లాల్లో అక్కడక్కడ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్.. స్వయానా అధికార పార్టీ ఎంపీకి చెందిన కాంట్రాక్టర్ ని ఫోన్లో బెదిరించారని, హైదరాబాద్ లో కేసులు కూడా నమోదయ్యాయి. అక్కడ కూడా జగన్ ఏం చర్యలు తీసుకున్నారనేది ఎవరికీ తెలియదు.
పోనీ నాలుగు గోడల మధ్య చెడామడా తప్పుచేసిన వారిని తిట్టినా.. వారు బయటకొచ్చి ఏం జరగలేదన్నట్టు ఫోజు కొడతారు. దీంతో మిగతా వారు కూడా లైట్ తీసుకుంటున్నారు. తప్పు చేస్తే అందరికీ తెలిసేలా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటేనే మిగతావాళ్ల క్రమశిక్షణ అలవడుతుంది.
ప్రస్తుతానికి అక్కడక్కడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. అధికార పార్టీ పట్టీ పట్టనట్టు ఉందని తెలుస్తోంది. జగన్ ఏమీ అనట్లేదు కదా, పార్టీ పరంగా ఎవరూ పద్ధతి నేర్పడం లేదు కదా అని వారు మరింత రెచ్చిపోతే అసలుకే మోసం వస్తుంది.
సొంత మీడియాతో తప్పులన్నీ ఒప్పులన్నట్టు కవర్ చేసుకోవచ్చు కానీ, దానికి ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కావాల్సింది కవరింగ్ కాదు, కరెక్షన్. అది ఎంత త్వరగా మొదలైతే అంత మంచిది. ఈ విషయంలో జగన్ తన మౌనాన్ని వీడాల్సిందే.