జగన్ కేబినెట్‌లో ఒకే ఒక్కడు… మేకపాటి గౌతమ్‌రెడ్డి. ఒక మనిషి ఎలాంటి వాడో, ఆయన మరణం తర్వాత సమాజం తలచుకోవడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని అంటారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంపై రాజకీయాలకు అతీతంగా వెల్లువెత్తుతున్న స్పందనలు చూస్తే… ఆయన రాజకీయ ఎంత బాగా సాగిందో అంచనా వేసుకోవచ్చు. మేకపాటి గౌతమ్‌రెడ్డి ఎంతో సౌమ్యుడు. జగన్ కేబినెట్‌లో తన పని తప్ప, మిగిలిన వివాదాల్లోకి వెళ్లని ఏకైక నాయకుడు ఎవరంటే మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరే మార్మోగుతోంది.
సాధారణంగా చనిపోయిన వాళ్లపై అందరూ అంతిమ సంస్కారంతో రెండు మంచి మాటలు చెబుతుంటారు. కానీ గౌతమ్‌రెడ్డి విషయంలో మాత్రం సహజ స్పందనలుగానే పరిగణించాలి. ఎందుకంటే ఆత్మకూరు నుంచి రెండోసారి వైసీపీ తరపున గెలుపొంది, జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న గౌతమ్‌రెడ్డిలో ఎక్కడా గర్వం, ప్రత్యర్థులపై చులకన భావం ప్రదర్శించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన అజాత శత్రువు.
ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్ మనసు చూరగొనేందుకు చాలా మంది అధికార పార్టీ నేతల్లా ప్రత్యర్థులపై నోరు పారేసుకోలేదు. అసెంబ్లీలోనూ, బయట హూందాగా నడుచుకున్నారు. అందరితోనూ మర్యాదగా నడుచుకున్నారు. అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
మాటల పొదుపు, మనుషుల విలువ తెలిసిన నాయకుడు గౌతమ్‌రెడ్డి అని సమాజం ఆయన్ను పొగుడుతోంది. వివాదాలకు వెళ్లకపోవడమే తన పని విధానమని ఆయన ఆచరించి చూపారు. రాజకీయాలకు వన్నె తెచ్చిన యువ నాయకుడిగా ఇటు ప్రతిపక్షాలు, అటు పాలక పక్షం నేతలు కొనియాడుతున్నారు.
గౌతమ్ ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. విద్యాధికుడైన ఆయన ప్రజా జీవితంలో హుందాగా వ్యవహరించారని జనసేనాని పవన్‌కల్యాణ్ సంతాప ప్రకటనలో తెలిపారు. అలాగే జగన్ కేబినెట్‌లో చదువు, సంస్కారం, విజ్ఞత కలిగిన అరుదైన మంత్రిగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభివర్ణించారు. మండలిలో గౌతమ్ పెద్దరికం, హూందాతనానికి ఆయన అభిమానిగా మారానని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అలాంటి నాయకుడు చనిపోవడం రాజకీయాలకు, ఏపీ సమాజానికి నష్టమని ఆయన వాపోయారు.
రాజకీయాల్లో విమర్శల పరిధి దాటి, తిట్ల పురాణానికి దిగజారిన నేటి వ్యవస్థలో గౌతమ్‌రెడ్డి లాంటి వివాద రహితుడు, సంస్కారవంతుడు లేకపోవడం ఎంత లోటో, వివిధ పార్టీల నాయకుల సంతాప ప్రకటనలే తెలియజేస్తున్నాయి. ఇలా రాజకీయాలకు అతీతంగా అందరి మనసులను చూరగొన్న గౌతమ్‌రెడ్డి జీవితం ధన్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.