ఇటీవలే గుండెపోటుతో మరణించిన కన్నడ పవర్ స్టార్ పునీత్ కుమార్, 50 యేళ్ల వయసులో గుండెపోటుతో హఠాన్మరణం పాలైన మేకపాటి గౌతమ్ రెడ్డి ల మధ్యన ఒక పోలిక ఉంది. ఫిట్ గా కనిపిస్తూనే.. తీవ్రమైన గుండెపోటుతో మరణించిన ప్రముఖులు వీరు.
పునీత్ కుమార్ ఫిట్ నెస్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. కండలు తిరిగిన దేహం, ఒంటిని స్ప్రింగ్ లా వంచుతూ అతడు చేసిన డ్యాన్సులు ఆయన ఫిట్ నెస్ కు గొప్ప సాక్ష్యాలు. మరి అలాంటి పునీత్ చిన్న వయసులోనే గుండెపోటుకు గురయ్యారు. ప్రాణాలు కోల్పోయారు.
మేకపాటి గౌతమ్ కూడా దృఢంగా కనిపించేవారు. ఆయన మరణం సందర్భంగా టీవీల్లో ప్రసారం అవుతున్న వీడియోల్లో ఆయన జిమ్ చేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాటిని బట్టి చూస్తే గౌతమ్ కూడా ఫిట్ గా కనిపిస్తారు.
వ్యాయామం కచ్చితంగా శరీరానికి మంచే చేస్తుంది. మరి ఫిట్ గా కనిపించే వారు కూడా ఇలా హఠాన్మరణాల పాలవుతూ ఉండటం, ఈ అంశంపై చర్చకు కారణం అవుతూ ఉంది. ఈ అంశంపై వైద్యులు ఏం చెప్పారనే అంశం గురించి పరిశీలిస్తే..ఎక్స్ ట్రీమ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రావొచ్చని అంటున్నారు.
అయితే ఇది ప్రధానంగా అథ్లెట్లు వంటి వారికి వచ్చే సమస్య. సుదీర్ఘ మారథన్ లూ, శరీరం విపరీతంగా శ్రమకు గురయ్యేలా ప్రాక్టీస్ చేసే వారికి ఇలాంటి సమస్యలు రావొచ్చంటున్నారు.
కొందరి విషయంలో అనువంశిక కారణాలు ఉండవచ్చు. లేదా గుర్తించబడని జబ్బుల ప్రభావం ఇలా ఉండవచ్చు అని కూడా పేర్కొంటున్నారు. ఏదేమైనా 40 దాటిన వారు జిమ్ లకూ గట్రా వెళ్తున్నా, ఈసీజీ, థ్రెడ్ మిల్ టెస్ట్ వంటివి చేయించుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.