ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో సమావేశం సందర్భంగా వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశం గురించి ప్రస్తావించారు.
న్యాయరాజధానిగా కర్నూలును ఎంచుకున్న నేపథ్యంలో.. ఏపీ హై కోర్టును కర్నూలుకు తరలించేందుకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర హోం శాఖా మంత్రిని ఏపీ సీఎం కోరడం గమనార్హం.
మూడు రాజధానుల అంశం లో శాసనసభ తీర్మానం చేసిందని, ఆ మేరకు హైకోర్టును తరలించడానికి కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వాలని ఏపీ సీఎం కేంద్ర హోం శాఖా మంత్రిని కోరడం కీలక పరిణామంగా చెప్పవచ్చు. జగన్ ప్రతిపాదించిన ఈ మూడు రాజధానుల అంశానికి కేంద్రం ఎంత మేరకు సపోర్ట్ గా ఉందనే అంశం పై కూడా ఇక క్లారిటీ రావొచ్చు.
ప్రస్తుతం ఈ అంశంపై కొంతమంది కోర్టుకు ఎక్కారు. అందుకు సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో కోర్టులో విచారణలో తమ వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన లాయర్లు పిటిషన్లు వేశారు. అయితే వారి పిటిషన్లను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. విచారణ అయితే కొనసాగుతూ ఉంది.
అభివృద్ధి వికేంద్రీకరణకు అనుగుణంగా రాజధాని వికేంద్రీరణ కూడా జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు హై కోర్టులో వాదిస్తున్నారు. రాజధాని అంటే ప్రజల సంపదనంతా తీసుకెళ్లి ఒకే చోట పెట్టడం కాదని, ఆ నిర్వచనాలతో గత ప్రభుత్వం అమరావతిని ప్రతిపాదించిందనే వాదన వినిపిస్తూ ఉన్నారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కూడా గత ప్రభుత్వం తుంగలో తొక్కిన వైనాలను ప్రస్తావించారు. రాజధానిగా అమరావతి అనే ఎంపిక పూర్తిగా రాజకీయమయం అయ్యిందనే అంశాన్ని ప్రస్తావించారు.
ఇప్పుడు కూడా అమరావతికి ఏ అన్యాయం జరగడం లేదని, వికేంద్రరణ మాత్రమే జరుగుతోందనే అంశాన్ని ప్రస్తావించారు. కేవలం రియలెస్టేట్ ప్రయోజనాలను నమ్ముకున్న వాళ్లే కోర్టును ఆశ్రయించారనే అంశాన్ని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు.
ఈ కేసులో తుది తీర్పుకు కూడా సమయం ఆసన్నం అవుతూ ఉంది. అయితే తాజాగా ఒక న్యాయమూర్తి బదిలీ నేపథ్యంలో.. ఈ విచారణ ఏం జరుగుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాల మధ్యనే హై కోర్టును కర్నూలుకు తరలించడానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రస్తావించడం గమనార్హం.