టీడీపీకి ఆఖరు ఎన్నికలేనా… ?

ఏపీలో రాజకీయాలు చూస్తూంటే ప్రతీ ఎన్నికా ఒక విశేషంగానే చెప్పాలేమో. నిజానికి 2019 ఎన్నికలను కూడా చాలా కీలకంగా అంతా చూశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మెజారిటీని సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చింది.…

ఏపీలో రాజకీయాలు చూస్తూంటే ప్రతీ ఎన్నికా ఒక విశేషంగానే చెప్పాలేమో. నిజానికి 2019 ఎన్నికలను కూడా చాలా కీలకంగా అంతా చూశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మెజారిటీని సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు 2014లో వైసీపీ ఓటమి పాలు కావడంతోనే ఆ పార్టీ పని అయిపోయిందని టీడీపీ నేతలు చాలా ఎక్కువగానే  చెప్పారు.

కానీ మొత్తానికి అయిదేళ్ళూ తిరగకుండానే వైసీపీ బ్రహ్మాండమైన మెజారిటీతో పవర్ ని పట్టడం జరిగింది. ఇక ఇపుడు అందరి చూపూ 2024 మీదకు మళ్ళుతోంది. ఈ ఎన్నికలు సాధారణమైనవే కానీ ఏపీకి సంబంధించి రాజకీయంగా కీలకమైనవి అని అంటున్నారు. అలా ఎందుకు అంటే ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు అన్నది చారిత్రాత్మకమైన అవసరం. టీడీపీ గెలవకపోతే ఏం జరుగుతుంది అంటే ఎవరికి తోచిన విధంగా వారు దానికి భాష్యాలు చెప్పుకోవచ్చు.

టీడీపీ ఇప్పటికే నాలుగు దశాబ్దాలుగా ఉన్న పార్టీ. ఇక చంద్రబాబు వయసు, భావి వారసత్వం మీద డౌట్లు ఇవన్నీ ఆలోచించి అనే వారి మాట ఏంటి అంటే ఆ పార్టీకి చివరి ఎన్నికలు ఇవేనని. ఈ ఎన్నికలే టీడీపీకి లాస్ట్ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గట్టిగానే చెబుతున్నారు. ఆ తరువాత ఆ పార్టీ కనుమరుగు అవడం తధ్యమని కూడా అంటున్నారు.

ఇక ఉత్తరాంధ్రా టూర్ చేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే తెలుగుదేశానికి సవాల్ కూడా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ సొంతంగా పోటీ చేయాలని, ఏ పొత్తులు పెట్టుకోకుండా రావాలని కూడా కోరారు. తమ పార్టీ ఎపుడూ సింగిల్ గానే రంగంలో ఉంటుందని, 2024లో కూడా జగనే సీఎం అవుతారు అని జోస్యం చెప్పారు.

ఇక తమ పార్టీ మీద మాట్లాడుతున్న టీడీపీ మాజీలు ముందు సొంత పార్టీ గురించి ఆలోచించుకోవాలని కూడా ఆయన సూచించారు. టీడీపీలో నాయకత్వ సమస్య ఉందని ఆయన అన్నారు. మొత్తానికి చూస్తే టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు అని వైసీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరి తమ్ముళ్ళు దీని మీద ఎలా స్పందిస్తారో కదా.