పాన్ ఇండియా పార్టీ కావలెను..

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర వెళ్లొచ్చారు. సింగిల్ డే రెండు సెటిల్మెంట్లు చేసుకొచ్చారు. పెద్ద పెద్దోళ్లని కలుస్తున్నారు, వారందరితో థర్డ్ ఫ్రంట్ అంటున్నారు. అంతా బాగానే ఉంది. మరి కేసీఆర్ సంగతేంటి.. తెలంగాణలో ఉన్న…

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర వెళ్లొచ్చారు. సింగిల్ డే రెండు సెటిల్మెంట్లు చేసుకొచ్చారు. పెద్ద పెద్దోళ్లని కలుస్తున్నారు, వారందరితో థర్డ్ ఫ్రంట్ అంటున్నారు. అంతా బాగానే ఉంది. మరి కేసీఆర్ సంగతేంటి.. తెలంగాణలో ఉన్న లోక్ సభ స్థానాలు 17. అందులో ఒకటి ఎంఐఎంకి రాసిచ్చేశారు. మిగతా వాటిల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్ములాడుకుంటే.. నికరంగా టీఆర్ఎస్ కి ఎన్నొస్తాయి. పోనీ 16 గంపగుత్తగా “సారు, కారు, పదహారు” అంటూ కేసీఆర్ జేబులో పడితే.. వాటితో ఆయన ప్రధాని కాగలరా..?

40 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు సాధించగల మమతా బెనర్జీకి అంతకు మించి పెద్ద పదవి ఇవ్వాల్సి ఉంటుంది కదా. మరి స్టాలిన్ ని ఏం చేస్తారు, కేజ్రీవాల్.. గోవాలో, పంజాబ్ లో పాతుకుపోతే ఆయన్ని ఎలా బతిమిలాడుకుంటారు. ఇవన్నీ అయ్యే పనులేనా. అయినా కేసీఆర్ ధైర్యం చేశారు కాబట్టి, ఆయన లెక్కలేవో ఆయనకుంటాయి. వీటి కోసమైనా అర్జంట్ గా ఆయన పాన్ ఇండియా పార్టీ పెట్టాల్సిందే.

ఆనాడే చెప్పారు..

జాతీయ పార్టీ పెడతానని ఆనాడే చెప్పారు కేసీఆర్. మరి ఆ పార్టీ పేరేంటి.. ఎలా ఉంటుంది, అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తారా లేదా అనేదానిపై కాస్త చర్చ నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోకుండా ఉంటే.. అసలు తెలుగోడి సత్తా ఏంటో కచ్చితంగా ఢిల్లీ స్థాయిలో తెలిసేదని కేసీఆర్ ఇప్పుడు బాధపడి ఉంటారేమో. 

అయిందేదో అయిపోయింది, అన్నీ అనుకూలిస్తే జగన్ కూడా కేసీఆర్ కి మద్దతివ్వొచ్చు, కానీ ఎన్నికలకు ముందు ఆ గుంపులో కలిసిపోయేంత పిచ్చి పని జగన్ చేస్తారని ఎవరూ అనుకోవట్లేదు. సో.. కేవలం ఎన్నికల ముందు బీజేపీపై కత్తులునూరే వారితోనే కలుస్తున్నారు కేసీఆర్.

ఎన్నికల ముందయితేనే..

కేసీఆర్ ఏం చేసినా, ఎంత చేసినా ఎన్నికలకు ముందు ఆయనకు వర్కవుట్ అవుతుంది. ఎన్నికలకు ముందుగా శిబిరం ఏర్పాటు చేసి, దానికి ఆయన కన్వీనర్ గానో లేక ప్రధాని అభ్యర్థిగానో ప్రచారం చేసుకుంటేనే ఎన్నికల తర్వాత ఆయన మాట చెల్లుబాటవుతుంది. లేకపోతే తెలంగాణలో వచ్చే లోక్ సభ సీట్లతో కేసీఆర్ ప్రధాని కావడం అసాధ్యం. అందుకే ముందుగా ఉమ్మడి అజెండా కోసం పోరాడుతున్నారు కేసీఆర్. తనతో కలసి వచ్చేవారిని ముందుగా దువ్వుతున్నారు, తనపేరే తెరపైకి రావాలంటున్నారు.

కేజ్రీవాల్ Vs మమతా.. ఇలా పిట్టపోరు పిట్టపోరు తనకి కలసి వస్తుందని ఆశిస్తున్నారు కేసీఆర్. మరోవైపు మహారాష్ట్రతో ఉమ్మడి సరిహద్దు అంతుంది, ఇంతుంది అంటూ వారిని మంచి చేసుకుంటున్నారు. దక్షిణాది పెత్తనం ఏంటో చూపిద్దామంటూ స్టాలిన్ కి మస్కా కొట్టారు. ఎలాగూ కాంగ్రెస్ కి, రాహుల్ గాంధీకి అనుకూలంగా మాట్లాడి అక్కడ కూడా కర్చీఫ్ వేశారు. చివరి నిముషంలో కాంగ్రెస్ సాయం అవసరమైతే.. దాన్ని సాధించగల ఏకైక వ్యక్తిగా కేసీఆర్ కి పేరుంది.

ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకునే కేసీఆర్, మోదీపై యుద్ధం ప్రకటించారు. కానీ ముందుగానే టీమ్ ఏర్పాటు కావాలి, ఆ టీమ్ కి కేసీఆర్ కెప్టెన్ కావాలి. పాన్ ఇండియా పార్టీ పెట్టకపోయినా, పాన్ ఇండియా పొలిటీషియన్ గా కేసీఆర్ ఎదిగితేనే అది సాధ్యమవుతుంది.