టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పులో కాలేశారు. దీంతో ఆయన్ను నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు. చరిత్ర తనకు తప్ప మరెవరికీ తెలియదనే భావనో లేక తాను చెప్పిందే చరిత్ర అనే నమ్మకమో తెలియదు కానీ, తాజాగా చంద్రబాబు మాత్రం సోషల్ మీడియాకు చిక్కారు. బాబు మైండ్ తేడా కొడుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు , సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వారికి ఆయన నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పొట్టి శ్రీరాములు నాంది పలికారన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసి పొట్టి శ్రీరాముల ఆత్మ క్షోభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాముల స్ఫూర్తితోనే విభజన తర్వాత రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేశామన్నారు.
పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలను అర్పించారు. ఆయన త్యాగ ఫలితంగానే మద్రాసు లేకుండా ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు డిసెంబర్ 19న లోక్సభలో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు.
ఈ సందర్భంగా నూతన రాష్ట్ర ఏర్పాటుకు వాంఛూ కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది.
ఇది వాస్తవం. ఇప్పుడు జగన్ సర్కార్ కనీసం కర్నూలును న్యాయ రాజధానిగానైనా ప్రకటించి రాయలసీమ ప్రాంత ఆకాంక్షలను గౌరవించింది. చంద్రబాబు ఎంతో గొప్పగా చెబుతున్న పొట్టి శ్రీరాములు చనిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిన విషయం మరిచిపోయినట్టున్నారు.
ఆ తర్వాత తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్గా అవతరించే క్రమంలో ఒక్క రాయలసీమే కాదు, ఆంధ్ర రాష్ట్రం కర్నూలును రాజధానిగా పోగొట్టు కావాల్సి వచ్చింది. హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన విషయం బాబుకు తెలియదా?
కర్నూలును న్యాయ రాజధానిగా చేసిన జగన్ సర్కార్ పనికి పొట్టి శ్రీరాములు ఆత్మ క్షోభిస్తుందా? లేక అన్ని ప్రాంతాల ప్రయోజనాలను, ఆకాంక్షలను, అభివృద్ధిని తుంగలో తొక్కి కేవలం 29 గ్రామాల కోసం ఏర్పాటు చేసిన అమరావతి రాజధానిని చూశా? అనే విషయం చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు.
పొట్టి శ్రీరాముల స్ఫూర్తితోనే విభజన తర్వాత రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేశామంటున్న చంద్రబాబు …ఆ మహనీయుడు జన్మించిన జిల్లాకు పొట్టి శ్రీరాములు అని పేరు పెట్టిన ఘనత ఎవరిదో చెబితే బాగుంటుంది.
2008 మే 22న నెల్లూరు జిల్లా పేరును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మారుస్తూ నాటి వైఎస్సార్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరజీవి త్యాగాన్ని స్మరించుకోవడం, గౌరవించుకోవడం అంటే శాశ్వతంగా ఆయన పేరును ప్రజల్లో నిలిచి పోయేలా చేయడం మాత్రం.
ఆ పని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేశారు. వాస్తవాలు ఇవైతే, ఇప్పుడు మాత్రం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని చిలుక పలుకలు పలకడం బాబుకే చెల్లిందని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రధానంగా కర్నూలు రాజధానిగా నాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన పరిస్థితులను గుర్తు చేస్తూ చంద్రబాబును సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం గమనార్హం.