జ‌గ‌న్‌, సీఎంఓ మ‌ధ్య‌ ఓ వైతరిణి !

మన పురాణాల్లో 'వైతరిణి' నది అని ఒక ప్రస్తావన ఉంది. గరుడ పురాణంలో అయితే దాని వర్ణన కూడా ఉంది. జీవులు – అటు స్వర్గానికో, నరకానికో డైరెక్ట్ గా చేరుకోరు.  ప్రతి జీవి…

మన పురాణాల్లో 'వైతరిణి' నది అని ఒక ప్రస్తావన ఉంది. గరుడ పురాణంలో అయితే దాని వర్ణన కూడా ఉంది. జీవులు – అటు స్వర్గానికో, నరకానికో డైరెక్ట్ గా చేరుకోరు.  ప్రతి జీవి ఈ నది దాటిన తర్వాతే, తమ కర్మ ఫలాలను బట్టి నరకానికో, స్వర్గానికో చేరుకుంటది. 

ఈ వైతరిణి వర్ణన వింటూంటేనే మనకు భయం వేస్తుంటది. భయంకరమైన విష సర్పాలు, రక రకాల విష జంతువులు, చీము, నెత్తురు మొదలైన వాటితో ఇది నిండి ఉంటుంది. జీవుడు…ఇది దాటిన తర్వాతే- యమ దర్శనమో….ఇంద్ర దర్శనమో అయ్యేది.

అలాగే, ఎన్నుకున్న ప్రజలకు  ఎన్నికైన ముఖ్యమంత్రికి – మధ్యలో 'సీఎంఓ కార్యాలయం' అని ఒకటి ఉంటుంది. ముఖ్యమంత్రి దృష్టికి చేరాల్సిన‌ విన్నపాలు, విజ్ఞప్తులు, కష్టాలు, సుఖాలు, సలహాలు, సంతోషాలు, దుఃఖాలు- అన్నీ కూడా ఈ 'సీఎంఓ కార్యాలయం' గుండా ప్రయాణించాల్సిందే. ఆ అవన్నీ 'దానినిస‌ దాటుకుని, తాము ఎన్నుకున్న ముఖ్యమంత్రిని చేరే లోపు  పుణ్యకాలం కాస్తా అయిపోతుంది. అసలు చేరకపోవచ్చు.

ప్రభుత్వంలో పనిచేసే మంత్రులు, అధికారులు, శాఖాధిపతులు, కలెక్ట‌ర్లు, ఎస్పీలు…. వగైరాల విన్నపాలు, నిర్ణయాలు, ఆలోచనలు అన్నీ 'ఇక్కడే' ఆగిపోతుంటాయి. ముఖ్యమంత్రి దృష్టికి ఏవి చేరాలో…. ఏవి చేరకూడదో ఈ కార్యాలయమే నిర్ణయిస్తుంది. ఆయన ఏది వినాలో…ఏది వినగూడదో ఇదే డిసైడ్ చేస్తుంది.

ముఖ్యమంత్రి ఏమో….ప్రజలు ఏరి, కోరి ఎన్నుకున్న పాలకుడు. ఈ కార్యాలయమేమో- ప్రజలకు 1%కూడా జవాబుదారీ కాని పెత్తందారీల నిలయం. ముఖ్యమంత్రి – ఐదేళ్లకోసారి ప్రజల తీర్పు కోరాల్సిన‌ పాలకుడు. ఈ కార్యాలయానికి ఈ బాదరబందీ ఏమీ లేదు. 

ముఖ్యమంత్రి- రాష్ట్ర ప్రజలకు బాధ్యుడు. ఈ కార్యాలయం ప్రజలకు జవాబుదారీ కాదు. ఈ కార్యాలయం – ప్రభుత్వ యంత్రాంగానికి ఏమి ఆదేశాలు ఇస్తుందో ముఖ్యమంత్రి దృష్టికి 100% వచ్చే అవకాశం ఉన్నట్టు కనపడదు. అలాగే,  పాలనలో ఇది ముఖ్యమంత్రికి ఏ రకమైన సహాయకారిగా ఉందో ప్రజలకు తెలిసే అవకాశం లేదు.

ఈ కార్యాలయం ఏర్పాటు లోని ముఖ్యోద్దేశం- అటు ప్రభుత్వ యంత్రాంగానికి, ఇటు ముఖ్యమంత్రికి మధ్యలో సంధానకర్త గా ఉండడం. కానీ, ఈ కార్యాలయమే అసలైన పవర్ సెంటర్ గా తయారైన ఉదంతాలు కోకొల్లలు.  

వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో- అస్సాం క్యాడర్ కు చెందిన ఎంజీవీకే. భానును తెచ్చి తన కార్యాలయంలో పెట్టుకున్నారు. ఆయన- శాఖాధిపతులతో చెడుగుడి ఆడుకున్నారు. విపరీతమైన అహంభావం, ఆభిజాత్యంతో వ్యవహించడం సహించలేక, కొందరు ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసుల‌కు పారిపోయారు.

ప్రస్తుత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర గారు కేంద్ర ఎరువులు, రసాయనాల జాయింట్ సెక్రటరీ గా కేంద్రానికి వెళ్ళినప్పుడు కూడా- హైదరాబాద్ సచివాలయంలోని అధికారులలో ఇదే భావం వ్యక్తమైంది. వైఎస్ గారి మరణానంతరం, భాను గారు గప్‌చిప్‌గా అస్సాం వెళ్లిపోయారు.

చంద్రబాబు హయాంలో సతీష్ చంద్రగారు సీఎంఓ అధిపతిగా ఉన్నారు. నెలల తరబడి ఆయన ఫైల్స్ ను క్లియర్ చేసేవారు కాదని అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నెత్తీ నోరు కొట్టుకునే వారు. మళ్లీ అందరితో ఆయన హ్యాపీగా…భుజాల మీద చేతులు వేసి మరీ మాట్లాడేవారు. ఫైల్ మాత్రం క్లియర్ చేసేవారు కాదని మంత్రులు గోల పెట్టేవారు.

ప్రభుత్వ యంత్రాంగానికి అత్యున్నత అధికారి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం  దడుచుకునే స్థాయికి చేరిన 'సీఎంఓ' ను సంస్కరించే విషయం  ముఖ్యమంత్రి జగన్ గారు పరిశీలించాలి. ఎందుకంటే, తనను ఎన్నుకున్న ప్రజల ఆశలు, ఆకాంక్షలు అధికారులకు తెలియవు. అవి..మంచో, చెడో… ముఖ్యమంత్రికి చేరాల్సిన అవసరం ఉంది. ఆయన వాటిమీద స్పందించాల్సిన అవసరం ఉంది.

ఆ స్పందనను అమలు చేసే ప్రభుత్వ యంత్రాంగ సమన్వయం బాధ్యతను ఈ సీఎం. కార్యాలయ అధికారులు చూడాలి. 

అసందర్భం కాకపోతే- నాదో మనవి.

ఒకరో, ఇద్దరో మంత్రులను సీఎంఓ. కార్యాలయ అధిపతులుగా నియమించాలి. ఆ కార్యాలయంలోని అధికారులు ఆ మంత్రులకు జవ్వాబుదారీగా ఉండాలి. ఆ మంత్రులు ముఖ్యమంత్రికి జవ్వాబుదారీగా ఉండాలి.

దీనివల్ల, ముఖ్యమంత్రి దృష్టికి చేరాల్సిన అంశాలను ప్రజలు ఈ మంత్రులను కలిసి చెప్పుకునే వీలు ఉంటుంది. అధికార యంత్రాంగంలో ఎంతో కొంత జావాబుదారీ తనం తొంగి చూడడానికి అవకాశం ఉంటుందని ఓ చిన్న ఆశ.

ముఖ్యమంత్రికి నెగటివ్ పబ్లిసిటీ రావడానికి ఇది కూడా ఒక కారణం.

భోగాది వేంకట రాయుడు,
సీనియ‌ర్ జర్నలిస్ట్