హరిహర వీరమల్లు సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం ముందుగా అనుకున్న పేరు అర్జున్ రాంపాల్. అయితే ఆఖరి నిమిషంలో ఆయన స్థానంలో బాబీడియోల్ వచ్చి చేరాడు. వీరమల్లు నుంచి అర్జున్ రాంపాల్ తప్పుకోవడానికి ఇటు యూనిట్ నుంచి, అటు రాంపాల్ నుంచి కూడా కారణాలున్నాయి.
అలా పవన్ కల్యాణ్ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇవ్వాల్సిన అర్జున్ రాంపాల్, ఇప్పుడు బాలయ్య సినిమాతో వస్తున్నాడు. అనీల్ రావిపూడి, బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ పాత్ర కోసం అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి ఈ బాలీవుడ్ నటుడు సెట్స్ పైకి కూడా వచ్చేశాడు.
ఇంతకీ ఏం జరిగింది..?
ఫ్లూట్, జింక ముందు ఊదు, సింహం ముందు కాదు.. అనే బాలయ్య డైలాగ్ ను చెబుతూ అర్జున్ రాంపాల్ ఎంట్రీని ఘనంగా ప్రకటించారు మేకర్స్. ఇతడి రాకతో, ఇప్పుడు మరోసారి హరిహర వీరమల్లు సినిమా హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా షూటింగ్ చాలా లేట్ అవుతూ ఉండడంతో, స్వయంగా అర్జున్ రాంపాల్ తప్పుకున్నాడంటూ కథనాలు వచ్చాయి. మరికొందరు మాత్రం క్రిష్ మనసు మార్చుకున్నాడని, అర్జున్ రాంపాల్ స్థానంలో బాబి డియోల్ ను తీసుకున్నాడని అంటున్నారు.
మొత్తానికి కారణాలు ఏమైనా, పవన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సిన అర్జున్ రాంపాల్, ఆ అవకాశాన్ని కోల్పోయాడు. ఇప్పుడు బాలయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
మొన్న డినో.. ఇప్పుడు అర్జున్..
తెలుగు సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ రావడంతో.. టాలీవుడ్ లోకి బాలీవుడ్ స్టార్ నటీనటుల రాక ఇంకాస్త పెరిగింది. ఆల్రెడీ సల్మాన్ ఖాన్, గాడ్ ఫాదర్ చేశాడు. మొన్నొచ్చిన ఏజెంట్ సినిమాలో డినో మారియో విలన్ గా నటించాడు. ఇప్పుడు బాలయ్య సినిమాతో అర్జున్ రాంపాల్ ఎంట్రీ ఇస్తున్నాడు.