‘‘గులేబకావళి కథ’’(1962) సినిమా మన తెలుగు జానపద కథల్లో ఒకటి అనుకుంటాం. కాదు, పర్షియాలో బాగా ప్రచారంలో వున్న ఓ జానపద గాథ గుల్-ఎ-బకావలి ఆధారంగా తీసినది. గుల్ అంటే పువ్వు. బకావలి అన్నది ఓ స్త్రీ పేరు. ఆమె వద్దనున్న ఓ పుష్పం సకల రోగాలను కుదర్చగలదు. రాజకుమారుడైన హీరో తన తండ్రి అంధత్వాన్ని పోగొట్టడానికి ఆమెను మెప్పించి ఆ పుష్పం సంపాదించడం కథాంశం. ఆ కథ ఆధారంగా 1939లో గుల్-ఎ-బకావలి అనే పేరుతో పంజాబీ సినిమా వచ్చింది, గులాం హైదర్ సంగీతంతో! దానికి ఓ ఏడాది ముందుగా తెలుగులో, పేరమౌంట్ ఫిలింస్ అనేవారు కాళ్లకూరి సదాశివరావుగారి దర్శకత్వంలో బొంబాయిలో తీశారు. ఆ తర్వాత 1955లో దర్శకనిర్మాత టిఆర్ రామన్న ఎమ్జీయార్ కథానాయకుడిగా తమిళంలో 'గులేబకావలి' అనే పేర తీశారు. దానికి కొద్ది మార్పులు చేసి ఎన్టీయార్ తన సొంతబ్యానర్పై ఏడేళ్ల తర్వాత 'గులేబకావళి కథ' అని తీశారు. ఎన్టీయార్ చేయించిన మార్పుల గురించి గురించి యీ వ్యాసం.
తమిళ సినిమా ఒరిజినల్ కథలో మాదిరిగా ముస్లిం వాతావరణంలోని జానపద సినిమాగా నడిస్తే, తెలుగు సినిమా హిందూ వాతావరణంలో మాయలూ, మంత్రాలతో, దేవుళ్లను కూడా కలుపుకుంటూ నడుస్తుంది. తమిళ సినిమాలో హీరో తండ్రి ఓ రాజుగారు. తల్లి పట్టమహిషి. కథాప్రారంభం నాటికి ఆ విషయం అతనికి తెలియదు. తల్లితో ఒక అడవిలో వుంటున్నాడు. రాజ్యంలో ఉత్సవాలు జరిగే వేళ తల్లి గతవైభవం తలుచుకుని బాధపడుతూంటే అది విని నిలదీశాడు. ఆమె కథంతా చెప్పింది. రాజుగారికి ఆమె మొదటిభార్య. పిల్లలు పుట్టలేదు. ఆమె కోరికపై రాజుగారు యింకొకామెను పెళ్లాడి ముగ్గురు పిల్లల్ని కన్నాడు. ఆ తర్వాత యీమె గర్భం దాల్చి కొడుకుని కన్నది.
పట్టమహిషి కొడుకు కాబట్టి యితనికి పట్టం కట్టేస్తారని భయపడి చిన్నరాణి కుట్ర పన్నింది. ఈ అబ్బాయిని రాజు గారు చూస్తే ఆయనకు అంగవైకల్యం కలుగుతుందని జ్యోతిష్కుల చేత చెప్పించింది. రాజు అది నమ్మి తల్లీ కొడుకులను అడవులకు పంపేశాడు. ఇదంతా విని హీరో ఆవేశపడ్డాడు. వెళ్లి తండ్రిని నిలదీస్తానన్నాడు. తల్లి వద్దని వారించింది. తల్లి ఆనతి లేదని హీరో రాజధానికి వెళ్లలేదు కానీ రాజే వేటకోసం అడవికి వచ్చాడు. పులిని వేటాడుతూ కిందపడ్డాడు. ఆ పడడంలో ఓ పొద ఆకులు తగిలి అతని దృష్టి పోయింది. సమయానికి వచ్చి అతన్ని రక్షించిన హీరోయే దానికి కారణం అన్నారు అనుచరులు. రాజు కూడా అదే అన్నాడు. ఎవడి ముఖమైతే చూడకూడదనుకున్నానో వాడే వచ్చి నా కళ్లు పోగొట్టాడని తిట్టాడు, శిక్ష వేయబోయాడు. నీ ప్రాణం కాపాడినందుకు నాకు దక్కినది ఇదా? నిన్ను చూడడం వలన నేను జైలుకి వెళ్లవలసి వస్తోందే అని హీరో వాదించాడు.
ఇక్కడి వరకు తెలుగులో చేసిన మార్పులు చూద్దాం. ఓ విలన్ రాజనాలను తయారుచేశారు. చిన్నరాణి తమ్ముడతను. సింహాసనంపై కాంక్షతో మేనల్లుళ్లను చవటలుగా పెంచాడు. పార్వతీదేవి అనుగ్రహంతో పెద్దరాణికి కొడుకు పుట్టగానే అతన్ని చూస్తే కళ్లు పోతాయని జ్యోతిష్కులచేత అబద్ధం చెప్పించాడు. ఆ బిడ్డను అడవుల్లో వదిలిపెట్టి రావడానికి రాజును ఒప్పించాడు. రాణి కోటలోనే వుండిపోయింది. విలన్ వద్ద లంచం తీసుకుని సైనికులు పిల్లవాణ్ని చంపబోయారు కానీ పార్వతీదేవి సిఫార్సుపై శివుడు వచ్చి రక్షించాడు. ఓ గొల్ల దంపతులకు ఆ బిడ్డ దొరికితే వాళ్లు పెంచుకున్నారు. తమిళంలో రాజు కళ్లు పోవడం కాకతాళీయం. కాని తెలుగులో విలన్ కావాలని పోగొట్టాడు. అడవికి వెళ్లే ముందు రోజు రాజు తాగే మద్యంలో ఏదో మందు కలిపాడు. తమిళంలో లాగ హీరో, రాజు ప్రాణాలు కాపాడలేదు. అతని వేటను అడ్డుకున్నాడు. అంతలో మందు ప్రభావం వలన రాజు కళ్లు పోయాయి. ఇతనెవరో తెలియకపోయినా విలన్ ఇతనే కారకుడన్నాడు. తర్వాత అనుమానం వచ్చి సైనికులను నిలదీస్తే వాళ్లు బిడ్డను చంపలేదని ఒప్పుకున్నారు.
తమిళ సినిమాలో రాజు హీరోని బంధించడంతో, కొడుకు బందీ అయ్యాడని తెలిసి పెద్ద రాణి అడవిలోంచి ఆస్థానంలోకి వచ్చింది. ఇంతలో రాజవైద్యులు వచ్చి కళ్లు మళ్లీ రావాలంటే గులేబకావళి పుష్పాన్ని తీసుకురావాలని చెప్పారు. తాము తెస్తామంటూ హీరో సవతి సోదరులు ముగ్గురూ బయలుదేరారు. హీరో తనూ వెళ్లి తెస్తానన్నాడు. అయితే నువ్వు వచ్చేవరకూ నీ తల్లిని బందీ చేస్తానంటూ రాజు అతన్ని వెళ్లనిచ్చాడు. తెలుగులో యిలా వుండదు. పెంపుడు తలిదండ్రుల సంభాషణ చాటుగా విన్న హీరోకి తన జన్మరహస్యం తెలుస్తుంది. కోటకు వెళ్లి తల్లిని కలుస్తాడు. అప్పుడే గులేబకావళి పుష్పం తేవలసిన సంగతి చాటుగా వింటాడు. దాని గురించి సవతిసోదరులు బయలుదేరుతున్నారని తెలుసుకుని తల్లి ఆశీర్వచనంతో తనూ బయలుదేరతాడు. అంటే తమిళంలో సవతిసోదరులకు హీరో ఎవరో తెలుసు, తెలుగులో అయితే తెలియదు. తర్వాత దారిలో కలిసినపుడు అతను ఎవడో పనివాడనుకుని మూటలు మోయమంటారు. వీళ్ల మొదటి హాల్ట్ యుక్తిమతి అనే ఓ అందాల జిత్తులమారి వూళ్లో!
యుక్తిమతి ఒక అందమైన ధనికురాలు. తెలుగులో పాత్రధారిణి జమున. తనతో జూదం ఆడి గెలిచినవాణ్ని పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. ఓడిపోతే మాత్రం ఆస్తి లాక్కుని తనకు బానిసగా పడి వుండాలని షరతు. అయితే జూదం ఆడేటప్పుడు మోసం చేస్తుంది. ఓ పెంపుడు పిల్లిని కూచోబెట్టి దాని నెత్తిమీద దీపం పెడుతుంది. ఆట ఓడిపోతున్నపుడు ఒక బొమ్మ ఎలుకకు కీ యిచ్చి ముందుకు తోస్తుంది. దాన్ని చూసి పిల్లి కదులుతుంది. చీకటి ఏర్పడుతుంది. ఆ చీకట్లో ఈమె ఆట మార్చేసి అవతలివాణ్ని ఓడిపోయావంటుంది. జమున పరిచారికను ప్రేమించిన హీరో అనుచరుడు బాలకృష్ణ పాచికలలో పేచీ వుందని చెప్పాడు. ముగ్గురూ అన్నలూ వెళ్లి జూదం ఆడుతుండగా హీరో దొంగచాటుగా చూసి మోసం కనుక్కున్నాడు. మర్నాడు ఓ ముసలి ముస్లిం వేషంలో వెళ్లి పందెం వేశాడు. ఆట జరిగేవేళ మోసాన్ని పట్టుకున్నాడు. జమున ఓడిపోయింది. పందెం ప్రకారం పెళ్లి చేసుకోవలసి వచ్చింది.
తమిళంలో యింత సింపుల్‌గా తేలిపోదు. అక్కడ జమున కారెక్టర్ వేసినది టిఆర్ రాజకుమారి. ఆమె ఆటా, పాటా చాలా చూపిస్తారు. ఆమెకు యీ జిత్తులు నేర్పిన వ్యక్తి తంగవేలు. అతన్ని హీరో, అతని అనుచరులు కలిసి బుట్టలో పెట్టారు. హీరోకు దారిలో చంద్రబాబు తగిలాడు. నాటుమందులు అమ్ముతూ జనాల్ని ఏమార్చే రకం అతను. హీరో మాట విని అతనికి అనుచరుడయ్యాడు. తోడుగా తన ప్రేయసి ఇవి సరోజను కూడా తెచ్చుకున్నాడు. ఇవి సరోజను చూపించి తంగవేలును ముగ్గులోకి లాగారు. ఆమె తండ్రిగా చంద్రబాబు, అన్నగా హీరో వేషం కట్టారు. ఇవి సరోజ మోహంలో పడి తంగవేలు తన ట్రిక్కు చెప్పేశాడు. హీరో ముసలివేషంలో వచ్చాడు. తంగవేలు హుక్కాతో దీపం ఆర్పేసి పాచికలు మార్చేస్తుంటే పట్టుకున్నాడు. హీరోయిన్ ఆటకట్టయింది. ఇంత ముసలివాడిని చేసుకోవలసి వస్తోందని రాజకుమారి ఏడుస్తూంటే చంపి పారేయమని తంగవేలు సలహా చెప్పాడు. ముసలి అయినా, కురూపి అయినా భర్త భర్తే అని వాదించిన ఆమె శీలాన్ని హీరో మెచ్చాడు. అసలు స్వరూపంలో బయటపడ్డాడు.
తమిళ సినిమాలో హీరో ఒకడే కానీ హీరోయిన్లు ముగ్గురు. మొదటి హీరోయిన్ అయిన రాజకుమారి తన కథ చెప్తుంది. ఈమె నిజానికి రాకుమార్తె. అక్క పేరు బకావలిరాణి. తండ్రి చనిపోయాక ఆమె చట్టాలు యిష్టం వచ్చినట్టు మార్చేసి యీమెను, మరో చెల్లెల్ని బయటకు తరిమేసింది. ఈమె యిక్కడకు వచ్చి యిలా బతుకుతోంది. హీరో వెతుకుతున్న పుష్పం అక్క వద్దనే వుందని చెప్పింది. హీరోతో పాటు తనూ వస్తానంది. వీళ్లు ముగ్గురూ వెళుతుంటే అడవి మనుష్యులు పట్టుకున్నారు. వాళ్ల రాజు దగ్గర హీరోయిన్ చెల్లెలుంది. మొదట అక్కను గుర్తుపట్టనట్టు నటించినా తర్వాత విడిగా వచ్చి తన గాథ చెప్పుకుంది. మత్తుమందు కలిపి సైనికులను నిద్రపుచ్చి అందరూ కలిసి తప్పించుకుని వచ్చేశారు. ఈమె కూడా హీరోని పెళ్లాడి సెకండ్ హీరోయిన్ అయింది. హీరోయిన్లు యిద్దరినీ ఓ వూళ్లో వుంచి హీరో, కమెడియన్ బకావలి రాజ్యానికి వెళ్లారు. సరే, యీ భాగంలో తెలుగు కథలో మార్పులేమిటో చూద్దాం.
హీరో జమున బాధ్యతను బాలకృష్ణకు అప్పగించి హీరో గమ్యం తెలియకుండా బయలుదేరాడు. రాత్రి ఓ చోట పడుక్కుంటే వింత అనుభవాలు కలిగాయి. అస్తిపంజరంతో యుద్ధం చేశాడు. వీరత్వం చూపించి శివుణ్ని ప్రత్యక్షం చేయించుకున్నాడు, ఆత్మత్యాగంతో మెప్పించాడు. శివుడు గులేబకావళి యక్షలోకంలో వుందని చెప్పి ఒక మణి నిచ్చాడు. అది నెత్తిమీద పెట్టుకుంటే ఆ లోకం వెళ్లవచ్చు, అదృశ్యరూపంలో మెలగవచ్చు. కానీ యిది మళ్లీ యిక్కడికి చేరేవరకే పనిచేస్తుంది. యక్షరాజు కూతురి పేరు బకావళి. ఆమె ఓ వ్రతం చేస్తోంది. ప్రతీ పున్నమినాడు గులేబకావళి పుష్పం చెరువులో వికసిస్తుంది. దాన్ని దేవతకు అర్పిస్తారు. మళ్లీ పున్నమినాటికి అది వికసించగానే దాన్ని పూజకు అర్పించే లోపున దాన్ని కాజేయాలని హీరో ప్లాను. ఈ లోపున యక్షరాజు కూతురుతో రొమాన్సులో పడ్డాడు. మణి ప్రభావంతో అతను మధ్యమధ్యలో మాయమవుతూండడంతో ఆమె యితను కలలో వ్యక్తిగా భావిస్తోంది. పున్నమినాటికి హీరో పువ్వు దొంగిలించి, అడ్డువచ్చిన వారితో యుద్ధం చేసి పువ్వుతో సహా మాయమయ్యాడు. యక్షరాజుకి కోపం వచ్చింది. కూతుర్ని తిట్టి చెరలో పెట్టాడు.
పువ్వుతో సహా హీరో వెనక్కి వచ్చేసరికి మణి అదృశ్యమైంది. ఇక శక్తులన్నీ పోయి మామూలువాడి లాగానే పువ్వు పట్టుకుని తన రాజ్యం వెళుతున్నాడు. మధ్యలో ఓ తమాషా జరిగింది. నీళ్లు తాగబోతూ ఆ పువ్వు ఓ రాయిమీద పెట్టేసరికి అది అతని సవతి అన్నగా మారింది. అన్నలు ముగ్గురూ ఓ పిచ్చిపని చేసి మునిచే శపించబడ్డారు. ఈ పువ్వు వలన మనుష్యులయ్యారు. తనకు పునర్జన్మ నిచ్చినా హీరోపై అసూయతో వాళ్లు అతన్ని ఓ నూతిలో పడేసి పువ్వు పట్టుకుని పారిపోయారు. హీరో బతికి బయటకు వచ్చాడు కానీ శోకంలో మునిగిపోయాడు.
తెలుగులో హీరో పువ్వు చులాగ్గా కాజేశాడు కానీ తమిళ ఒరిజినల్లో చాలా కథే నడపాల్సి వచ్చింది. ఆ బకావలి రాజ్యం ప్రమీలా రాజ్యం వంటిది. అక్కడ ఆడవాళ్లదే పైచేయి. మగవాళ్లందరూ బానిసలే. పాటలు పాడడం చట్టవిరుద్ధం. కానీ హీరో పాటలు పాడాడు. దానితో ఖైదు చేసి విచారణ జరిపారు. పువ్వు కోసమే చెప్పేశాడు హీరో. అయితే మా వాళ్లు అడిగే ప్రశ్నల పోటీకి సిద్ధమవ్వాలి. దానిలో నెగ్గితే పులితో యుద్ధం చేయాలి. ఓడిపోతే పులికి ఆహారంగా వేస్తాం అంది న్యాయాధికారిణి. సై అన్నాడు హీరో. అనడమే కాదు యుక్తియుక్తంగా సమాధానాలు చెప్పి అందర్నీ మెప్పించాడు, నెగ్గాడు. అతని మేధస్సు, సౌందర్యం చూసి రాణి బకావలి (పాత్రధారిణి జి వరలక్ష్మి) చలించింది. తను ప్రేమించింది కాబట్టి పులిబారినుండి ఎలాగైనా రక్షించుకోవాలనే తపనతో బకావలి చట్టాలు మారుస్తానంది. ఆమె సహచరులు ఒప్పుకోలేదు. కానీ పులితో యుద్ధంలో హీరో జయించాడు. బకావలి పువ్వునే కాదు, ఆమెనూ సొంతం చేసుకున్నాడు. ఆమె యితని వెంట వస్తానంది.
పువ్వును పోగొట్టుకుని విలపిస్తున్న తెలుగు హీరోకి ఓ గుహ ఎదురైంది. తిరిగే చక్రం మీద నిలబడి ఎగిరే పక్షిని కొట్టి ఓ దేవకన్య శాపం తీర్చాడు. ఆమె సహాయంతో యక్షలోకానికి మళ్లీ వెళ్లాడు. అక్కడికి వెళ్లేసరికి తెలిసింది, తను పువ్వు పట్టుకుపోవడం వలన కొలను భస్మమైందని, బకావలిని చెరలో బంధించారని. ఇతను యక్షరాజు వద్దకు వెళ్లి తన తప్పు ఒప్పుకుని కొలనుకోసం దేవుణ్ని ప్రార్థించాడు. తన కళ్లను బలి యిచ్చాడు. కొలను మళ్లీ కళకళలాడింది. ఇతనికి కళ్లూ వచ్చాయి. యక్షుడు సంతోషించి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. అయితే పువ్వేదీ? హీరో అనుచరుడు బాలకృష్ణ హీరో ఎంతకీ రాకపోవడంతో యోగి వేషంలో దేశం తిరుగుతున్నాడు. హీరో అన్నలు అటు వస్తే వాళ్ల చేతిలో పువ్వు చూసి విషయం గ్రహించాడు. వాళ్లను ఏమార్చి పువ్వు కాజేసి చీపురు కట్ట పెట్టి పంపాడు. వాళ్లు అది పట్టుకుని రాజ్యానికి వెళ్లి నిండు సభలో అభాసు పాలయ్యారు. అప్పుడు విలన్ తన పన్నాగం బయటపెట్టాడు. ‘ఇక మీకు కళ్లు రావు, రాజ్యానికి అనర్హులు’ అని సేనాపతి చేత చెప్పించి, తనే రాజు కావాలని అనిపించాడు. ఇన్నాళ్లూ మారువేషంలో వుండి తన కుతంత్రాన్ని కనిపెట్టిన మంత్రిని చంపించాడు. రాజుని, పెద్దరాణిని బంధించాడు. అక్కగారు అడ్డుకుంటే రాజమందిరంలోనే బందీ చేయించాడు.
తమిళ ఒరిజినల్లో హీరో పువ్వును, బకావలిని తీసుకుని వచ్చాడు. అక్కగారు చెల్లెళ్లిద్దరికి క్షమాపణ చెప్పుకుంది. ఇలా ముగ్గురు భార్యలతో మురుస్తున్న హీరో వద్దనుండి అనుకోకుండా ఆ సత్రానికి వచ్చిన అన్నలు పువ్వు దొంగిలించారు. హీరో నిద్ర లేచి గుఱ్ఱంపై వెంటాడాడు. వాళ్లు రాయి పెట్టి కొట్టి పారిపోయారు. హీరో వెంటాడుతూ రాజాస్థానం చేరాడు. ఆస్థానంలో హీరోతో బాటు అన్నలూ తామే తెచ్చామని క్లెయిమ్ చేశారు. అప్పుడు బకావలి రాణియే స్వయంగా వచ్చి పువ్వు మావగారి కళ్లపై పెట్టి కళ్లు తెప్పించడంతో నిజానిజాలు బయటకు వచ్చాయి. హీరో తల్లి చెరలోంచి బయటపడింది. కథ సుఖాంతమైంది.
తెలుగులో క్లయిమాక్స్ ఎలా వుంటుందంటే, యక్షరాజు హీరోకి తన తండ్రి ఖైదులో పడిన సంగతి చూపించి ఓ విమానం యిచ్చి పంపాడు. కూతురికి యక్షసిద్ధులు యిచ్చాడు. రాజనాల పట్టాభిషేకం చేసుకోబోతూండగా సరైన సమయంలో వాళ్లు వచ్చారు. హీరో విలన్లు ఫైట్ చేశారు. విలన్ చావు, రాజు పశ్చాత్తాపం. హీరోకి యిద్దరు హీరోయిన్లతో రాజు కావడం అన్నీ యథావిధిగా జరిగిపోయాయి. ఇలా ముగుస్తుంది తెలుగు కథ. ‘‘లేతమనసులు’’ గురించి రాసినప్పుడు ఒక పాఠకుడు ‘దానికి ఇంగ్లీషు మూలం వుందని మాకూ తెలుసు. దాని గురించి యింత సోది చెప్పాలా’ అని వ్యాఖ్యానించారు. మూలం వుందని తెలిసినా తెలుగుకి ఎలా ఎడాప్ట్ చేశారో తెలియకపోవచ్చు. ‘‘గులేకబకావళి’’ సినిమాకు మూలం ఐదేళ్ల క్రితమే తమిళంలో వచ్చింది అని ఎవరో చెప్పగానే ‘కాపీట్రా’ అని చప్పరించేస్తాం. ఏ మేరకు మార్చారో పట్టించుకోం. రీమేక్ వేరు, ఎడాప్టేషన్ వేరు. తెలుగు వాతావరణానికి ఎంత బాగా అన్వయించారు అనేది గమనించడమే ఆసక్తిదాయకం.
ఈ సినిమాయే చూడండి, ఎక్కడో అరేబియన్ నైట్స్ లాటి కథను పూర్తిగా హిందువైజ్ చేసి పార్వతిని, శివుణ్ని, యక్షలోకాలను తీసుకుని వచ్చి మన పెరట్లో పుట్టిన జానపదగాథలా తయారు చేశారు. తమిళంలో లేని విలన్ కారెక్టర్‌ను తెలుగులో పెట్టి చివర్లో పసందైన కత్తియుద్ధం పెట్టారు. తమిళసినిమాలోని రాజకుమారి ఎపిసోడ్‌ని కుదించి, ఆ స్థానంలో మరిన్ని మలుపులు పెట్టారు తెలుగులో. అస్తిపంజరంతో యుద్ధసన్నివేశాన్ని ఫోటోగ్రాఫర్ రవికాంత్ నగాయిచ్ చాలా గొప్పగా చిత్రీకరించారు. యోగానంద్ దర్శకత్వం వహించిన యీ సినిమాకు జోసెఫ్-కృష్ణమూర్తి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దరిమిలా ఎన్నో ప్రఖ్యాత గీతాలు రచించిన డాక్టర్ సి నారాయణరెడ్డిగారు యీ సినిమాతోనే చిత్రరంగానికి పరిచయమయ్యారు. తమిళసినిమాలోని ముగ్గురు హీరోయిన్లలో మూడో హీరోయిన్ ఐన జి వరలక్ష్మి సోదరి కూతురు రత్న తెలుగు వెర్షన్లో రెండవ హీరోయిన్గా వేయడం ఓ విశేషం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2022)