కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గురించి ఏపీసీసీ ప్రెసిడెంట్ సాకే శైలజానాధ్ విశాఖ టూర్ లో మీడియా ముందు బాగానే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని కూడా పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ని బలోపేతం చేస్తున్నామని పీసీసీ చీఫ్ చెప్పుకున్నారు.
ఇప్పటి దాకా సభ్యత్వ నమోదు కార్యక్రమాలను పేపర్ మీద చేశామని, ఇపుడు డిజిటల్ ఫార్మేట్ లో కూడా దాన్ని చేపడుతున్నామని అన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఏపీ భవిష్యత్తు బాగా ఉంటుందని శైలజానాధ్ చెప్పడమే ఇక్కడ విశేషం.
ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నా, విశాఖకు రైల్వే జోన్ కావాలన్నా కాంగ్రెస్ కే ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన పేర్కొంటున్నారు. దేశంలో బీజేపీ పాలనా, ఏపీలో వైసీపీ దారుణమైన పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ ని మాత్రమే గెలిపించాలని ఆయన కోరడం గమనార్హం.
రాహుల్ గాంధీ ప్రధాని కావడంతోనే ఏపీలో సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని పీసీసీ చీఫ్ అంటున్నారు. మరి యూపీయే సర్కార్ రెండు సార్లు కేంద్రంలో ఏర్పడడానికి కారణం అయిన ఏపీని అడ్డగోలు విభజనతో ఎలా కాంగ్రెస్ గొంతు కోసింది అన్నది జనాలకు ఎరుకే కదా స్వామీ అన్న సెటైర్లు అయితే పడుతున్నాయిగా.
ఇక ఉమ్మడి ఏపీ విభజన ఎంత దారుణంగా ఏలాంటి నిబంధనలు పాటించకుండా పార్లమెంట్ తలుపులు మూసి లైట్లు ఆర్పి చేశారో ఈ మధ్యనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కళ్లకు కట్టినట్లుగా ఇంకోసారి జనాలకు చెప్పారు కదా. ఇక ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేయని తప్పూ కాంగ్రెస్ దే కదా.
ఆ విధంగా చెప్పుకుంటే పదేళ్ల తమ ఏలుబడిలో రైల్వే జోన్ విశాఖకు ఎందుకు ఇవ్వలేదూ అనే ప్రశ్నా వస్తుంది. కానీ ఇవేమీ కాదు, కాంగ్రెస్ ని గెలిపిస్తేనే ఏపీకి ఫ్యూచర్ అని అనడం అంటే మరి ఆలోచించాల్సిందే. మొత్తానికి బీజేపీతో జగన్ చెలిమి చేస్తున్నారు అని చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు చంద్రబాబుని మాత్రం ఒక్క మాట అనకపోవడం విచిత్రమే కదా. అంటే ఏపీలో కాంగ్రెస్ దాని రాజకీయ అవసరాలూ, ఆప్షన్లు అలా దాచుకుంటోందనే కదా.