పవన్ కల్యాణ్ కాలుజారారు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి వైరల్ వీడియో ఇదే. ఏ మొబైల్ చూసినా, ఏ టీవీలో చూసినా, వాట్సాప్-ట్విట్టర్ తెరిచినా ఇదే వీడియో. దీనికి కారణం పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఒకడు చేసిన తింగరి పని.
నర్సాపురం బహిరంగ సభకు వెళుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఈతకోట రాగానే ఆయన అభిమానులకు అభివాదం చేసేందుకు తన కారు టాపు ఎక్కారు. తన చుట్టూ ఉన్న ప్రజలకు చేయి ఊపుతూ అభివాదం చేస్తున్నారు.
అంతే, అంతలోనే ఒక్కసారిగా పవన్ అభిమాని ఒకడు కారుపైకి వచ్చాడు. పవన్ ను వెనక నుంచి వచ్చి కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే కారు టాపుపై నిల్చున్న పవన్ కల్యాణ్, ఊహించని ఈ ఘటనకు బిత్తరపోయారు. కాలుజారి కారుపై పడ్డారు. కారు చుట్టూ నిల్చున్న బౌన్సర్లు పవన్ ను పట్టుకోవడంతో ఆయన రోడ్డుపై పడలేదు. లేదంటే పవన్ కు గాయాలై ఉండేవి.
పవన్ కల్యాణ్ అభిమానులు ఆయనకు ఎంత ప్లస్సో, అంతే మైనస్ అనే విషయం ఇవాళ్టి ఘటనతో మరోసారి రుజువైంది. అభిమానులు నాయకుడికి బలం కావాలి, బలహీనత కాకూడదు. కానీ పవన్ అభిమానులు ఎప్పుడూ ఆయనకు బలహీనతగానే తయారయ్యారు. 2019 ఎన్నికల్లో “సీఎం పవన్,, ముఖ్యమంత్రి పవన్” అంటూ నినాదాలు చేసి ఆయన పొలిటికల్ కెరీర్ నాశనం చేశారు.
అభిమానుల నినాదాలతో ఒక దశలో పవన్ కూడా తాను ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయమనే భ్రమల్లోకి వెళ్లిపోయారు. కట్ చేస్తే, పోటీ చేసిన రెండు చోట్లా ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత తనను సీఎం అంటూ పిలవొద్దని స్వయంగా పవన్ కల్యాణ్ అభిమానుల్ని బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది.
ఇలా ఎప్పటికప్పుడు జనసేనానిని, అతడి అభిమానులు ముప్పుతిప్పలు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడిలా వెనక నుంచి వచ్చి హత్తుకునే ప్రయత్నం చేసిన ఓ అభిమాని వల్ల, పవన్ మరోసారి ప్రమాదం బారిన పడ్డారు. ఆయన నడుము విరిగినంత పనైంది. కాకపోతే ఇలాంటివి ఎన్నో చూసిన అనుభవం కలిగిన పవన్.. ఏమాత్రం తడబడకుండా తిరిగి కారు టాపుపై లేచి నిల్చొని తన యాత్రను కొనసాగించారు.