ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి నుంచి 2024 ఎన్నికలకు సన్నద్ధమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మత్స్యకార అభ్యున్నతి సభలో జనసేనాని పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ ఉద్దేశపూర్వకంగా చేశారో లేదో తెలియదు కానీ, టీడీపీ, బీజేపీలకు మాత్రం మార్చి 14 టెన్షన్ పట్టుకుంది. రాజకీయాల్లో మైండ్ గేమ్ ఆడడం తనకొచ్చని సంకేతాలు ఇవ్వడానికే పవన్ ఆ మాటలు అన్నారా? అనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.
నర్సాపురం మత్స్యకార అభ్యున్నతి సభలో ప్రభుత్వంపై పవన్ విరుచుకుపడ్డారు. లేని సమస్యలు సృష్టించడంలో వైసీపీ నేతలు ఉద్ధండులని విమర్శించారు. జగన్ పాదయాత్ర చేసింది చికెన్ కొట్లు, మటన్ కొట్లు పెట్టుకోవడానికా అని ఆవేశంతో నిలదీశారు. అలాగే మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో మళ్లీ కలుద్దామన్నారు. రాష్ట్ర భవిష్యత్ ఎలా వుండాలి, ఎలా ఉండబోతోంది, ఎలా యుద్ధం చేయాలి? 2024 ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి అనే దానిపై చర్చిద్దాం అని పవన్‌కల్యాణ్ అన్నారు.
మార్చి 14న జరిగే సభలో భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రకటిస్తానని పవన్ తేల్చి చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనతో కలిసి ప్రత్యామ్నాయ కూటమిగా ఎన్నికల బరిలో దిగి, అధికారాన్ని దక్కించుకుంటామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మొదలుకుని, ఆ పార్టీ ముఖ్య నేతలు జీవీఎల్ నరసింహారావు తదితరులు చెబుతున్నారు. మరోవైపు జనసేన సపోర్టు లేకపోతే మరోసారి అధికారాన్ని కోల్పోవడం ఖాయమని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు.
అందుకే జనసేనతో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు బహిరంగంగా ప్రకటించడం. జనసేనపై తనది ఒన్‌సైడ్ లవ్ అంటూ చంద్రబాబు పొత్తు గురించి సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. ఇటు మిత్రపక్షమైన బీజేపీ, అటు పొత్తు కోసం తహతహలాడుతున్న టీడీపీకి మార్చి 14న జరగనున్న ఆవిర్భావ సభలో పవన్‌కల్యాణ్ స్పష్టమైన సమాధానం ఇస్తారని జనసేన నాయకులు చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా జనసేన ఆవిర్భావ సభ జరిగే నాటికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు కూడా రానున్నాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ఫలితం మార్చి 14న జనసేన ఆవిర్భావ సభపై తీవ్ర ప్రభావం వుంటుందని జనసేన నేతలు అంటున్నారు. అక్కడ బీజేపీకి సానుకూల ఫలితం వస్తే ఒకలా, వ్యతిరేకంగా వస్తే మరోలా పవన్ నిర్ణయం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అందుకే ఆ రోజు అన్ని విషయాలు మాట్లాడుకుందామని పవన్ చెప్పడం వెనుక అసలు కారణంగా చెబుతున్నారు. ఈ కారణాల రీత్యా మార్చి 14న జనసేన సభపై టీడీపీ, బీజేపీలకు టెన్షన్ పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు చెప్పడం.