కుల నాయ‌కుడిగా మిగిలిన బాబు!

చంద్ర‌బాబునాయుడి అరెస్ట్‌పై చివ‌రికి సొంత సామాజిక వ‌ర్గం త‌ప్ప‌, మిగిలిన వ‌ర్గాల నుంచి స్పంద‌న క‌రువైంది. నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న చంద్ర‌బాబు ….ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేశారో, ఆయ‌న క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు…

చంద్ర‌బాబునాయుడి అరెస్ట్‌పై చివ‌రికి సొంత సామాజిక వ‌ర్గం త‌ప్ప‌, మిగిలిన వ‌ర్గాల నుంచి స్పంద‌న క‌రువైంది. నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న చంద్ర‌బాబు ….ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేశారో, ఆయ‌న క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు స్పందించే వాళ్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. చంద్ర‌బాబు అరెస్ట్‌తో త‌ల్ల‌డిల్లుతున్న‌ది కేవలం క‌మ్మ సామాజిక వ‌ర్గ‌మే.

అటు తెలంగాణ‌, ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌మ‌నిస్తే కేవ‌లం కమ్మ సంఘాల ఆధ్వ‌ర్యంలోనే నిర‌స‌న ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. బాబు అరెస్ట్‌కు నిర‌స‌న‌గా తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌, ఖ‌మ్మంలో ర్యాలీలు నిర్వ‌హించారు. తాజాగా అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గంలో క‌మ్మ సంఘం ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. బాబు కోసం మేము సైతం అంటూ రాయ‌దుర్గంలో ఎన్టీఆర్ విగ్ర‌హం నుంచి ల‌క్ష్మీబ‌జార్ మీదుగా నిర‌స‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. చంద్ర‌బాబును 30 రోజులుగా జైల్లో పెట్టారంటూ క‌మ్మ నేత‌లు వాపోయారు.  

చంద్ర‌బాబు క‌మ్మేత‌రుల‌ను కేవ‌లం త‌న రాజ‌కీయ ఉన్న‌తి కోస‌మే వాడుకున్నార‌నే విమ‌ర్శ బ‌లంగా వుంది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన‌ప్పుడు బీసీలు, ద‌ళితులు గ‌ట్టి మ‌ద్ద‌తుదారులుగా నిలిచారు. అందువల్లే నాడు కాంగ్రెస్ ఘోర ప‌రాజయాన్ని చ‌వి చూసింది. ఎన్టీఆర్ అనంత‌రం చంద్ర‌బాబు చేతిలోకి టీడీపీ వెళ్ల‌డంతో క‌మ్మ నేత‌ల పెత్త‌నం ఎక్కువైంద‌నే అభిప్రాయం వుంది.

క‌మ్మ పారిశ్రామిక‌వేత్త‌లు, అలాగే బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన మీడియాధిప‌తులు బాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని గ‌రిష్టంగా లబ్ధి పొంద‌డం గురించి క‌థ‌లుక‌థ‌లుగా చెబుతుంటారు. అదే చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా న‌ష్టం తీసుకొస్తోంది. నిజానికి టీడీపీని త‌మ పార్టీగా అంత‌కు ముందు బీసీలు భావించేవారు. ఇప్పుడు సీన్ మారింది. బీసీలు, మైనార్టీలు, ద‌ళితుల‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

పార్టీతో పాటు ప్ర‌భుత్వ ప‌ద‌వుల్లో వారికి భారీగా భాగ‌స్వామ్యం క‌ల్పించారు. అదే జ‌గ‌న్‌కు నేడు బ‌ల‌మైన ఓటు బ్యాంక్‌గా మారింది. చంద్ర‌బాబును క‌మ్మ కుల‌నాయ‌కుడిగా జ‌నానికి చూప‌డంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. ఇందుకు చంద్ర‌బాబు, ఆయ‌న అనుకూల మీడియా కూడా త‌న వంతు కృషి చేశారంటే అతిశ‌యోక్తి కాదు. నేడు బాబు కోసం సొంత కులం నేత‌లు రోడ్డెక్కారంటే ఎలా అర్థం చేసుకోవాలి?