అందుకే… తెలంగాణ యువ‌కులకు పెళ్లిళ్లు కాలేదు!

తెలంగాణ యువ‌కులు పెళ్లిళ్లు చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఏంటో మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత ఈట‌ల రాజేంద‌ర్ చెప్పారు. దీనికి ప‌రోక్షంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆరే కార‌ణ‌మ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బీజేపీకి ప్ర‌త్యామ్నాయ కూట‌మి…

తెలంగాణ యువ‌కులు పెళ్లిళ్లు చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఏంటో మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత ఈట‌ల రాజేంద‌ర్ చెప్పారు. దీనికి ప‌రోక్షంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆరే కార‌ణ‌మ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బీజేపీకి ప్ర‌త్యామ్నాయ కూట‌మి ఏర్పాటుకు సీరియ‌స్‌గా కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్న నేప‌థ్యంలో, తెలంగాణ బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

ఇవాళ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. ప్ర‌జాగ్ర‌హం త‌ప్పించుకోవ‌డానికే సీఎం కేసీఆర్ ముంబై ప‌ర్య‌ట‌న చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. అస‌లు జాతీయ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూట‌మి సాధ్యం కాద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. 

కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా జాతీయ స్థాయిలో ప్ర‌త్యామ్నాయ కూట‌మి ఏర్పాటు చేస్తామ‌ని ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ, కేసీఆర్ త‌దిత‌రులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఈట‌ల పై విధంగా అన్నారు. ముఖ్యంగా తెలంగాణ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్లు లేకపోవడం తెలంగాణ యువకులకు పెళ్ళిళ్లు కావటంలేదని ఈట‌ల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.  

ఉద్యోగ నియామకాలపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తూర్పార‌ప‌ట్టారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సైను మేడారం జాత‌ర‌లో అవ‌మానించార‌న్నారు. సంస్కార హీన‌మైన సంప్ర‌దాయానికి సీఎం తెర‌తీశార‌ని ఈట‌ల విమ‌ర్శించారు. 

ప్ర‌జాస్వామ్యంలో దాడులు తాత్కాలిక‌మైన విజ‌యాల్ని మాత్ర‌మే ఇస్తాయ‌ని మంత్రి కేటీఆర్ తెలుసుకోవాల‌న్నారు. బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు కొన‌సాగుతాయ‌ని కేటీఆర్ చిల్ల‌ర వ్యాఖ్య‌లు చేశార‌న్నారు.