ఏపీ డీజీపీగా రాజేంద్రనాథ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి కేవలం ఒక్క రోజు మాత్రమే గడిచింది. ఇంకా ఆయన సీట్లో సరిగ్గా కూచొని కుదురుకోకుండానే … వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజకీయం మొదలెట్టాడు. తనకేదో తీవ్ర అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని వేడుకోలు స్టార్ట్ చేశాడు.
నూతన డీజీపీకి రఘురామ లేఖ వెనుక దురుద్దేశం ఏంటో అందరికీ తెలిసిందే. ఏదో విధంగా నూతన డీజీపీ కూడా సవాంగ్ మాదిరిగానే ప్రభుత్వానికి ఒత్తాసు పలికే పోలీస్ బాస్‌గా, జగన్ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం వల్లే అంటూ బురద అంటించేందుకు మొదటి రోజు నుంచే ప్రయత్నించడాన్ని గమనించొచ్చు.
ఏపీ డీజీపీకి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. విచారణ పేరుతో తనపై పోలీసులు దాడి చేయడంపై త్వరగా దర్యాఫ్తు జరపాలని ఆ లేఖలో రఘురామ కోరారు. తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు పాల్పడ్డారని, దాడి చేసిన ఐదుగురిలో సీబీసీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. దాడిపై లోక్‌సభ స్పీకర్ అప్పటి డీజీపీ సవాంగ్‌ను నివేదిక కోరినా.. ఇంత వరకు స్పందించలేదని లేఖలో ప్రస్తావించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మళ్లీ విశ్వాసం కలిగిం చేలా.. నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని రఘురామ డిమాండ్ చేయడం గమనార్హం.
తాను మాత్రం ప్రజాప్రతినిధులపై గౌరవం కలిగేలా ఎప్పటికీ ప్రయత్నించరు. ఇతరులు మాత్రం సమాజానికి, ఇతర వ్యవస్థలకు జవాబుదారీగా ఉండాలని ఆయన కోరుకుంటారు. తన విషయానికి వచ్చే సరికి అలాంటివేవీ వర్తించవన్నట్టు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తుంటారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతకూ తనను కొట్టే వరకూ ఏ పరిస్థితులు దారి తీశాయో లేఖలో ప్రస్తావించి వుంటే జనానికి తెలిసి వుండేది. ఎప్పుడూ జగన్ ప్రత్యర్థుల ప్రయోజనాల కోసం పని చేయడమో తప్ప, తనను అత్యున్నత చట్టసభకు పంపిన ప్రజల బాగోగులను మాత్రం ఆయన ఎప్పటికీ పట్టించుకోరా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.