సోనూసూద్‌కు ఝ‌ల‌క్‌!

సోనూసూద్‌… బాలీవుడ్‌లో ప్ర‌ముఖ న‌టుడు. న‌టుడిగా కంటే మాన‌వ‌తావాదిగా, పేద‌ల‌కు సాయం అందించే ఆప‌ద్బాంధ‌వుడిగా దేశం మొత్తానికి క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితులు ప‌రిచ‌యం చేశాయి. ఇలాంటి మంచి మ‌న‌సున్న వ్య‌క్తి రాజ‌కీయాల్లోకి రావాల‌నే డిమాండ్లు…

సోనూసూద్‌… బాలీవుడ్‌లో ప్ర‌ముఖ న‌టుడు. న‌టుడిగా కంటే మాన‌వ‌తావాదిగా, పేద‌ల‌కు సాయం అందించే ఆప‌ద్బాంధ‌వుడిగా దేశం మొత్తానికి క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితులు ప‌రిచ‌యం చేశాయి. ఇలాంటి మంచి మ‌న‌సున్న వ్య‌క్తి రాజ‌కీయాల్లోకి రావాల‌నే డిమాండ్లు కూడా తెర‌పైకి వ‌చ్చాయి. సోనూసూద్ కాదు కానీ, ఆయ‌న సోద‌రి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో త‌ల‌ప‌డుతోంది. చెల్లి కోసం పోలింగ్ కేంద్రాల‌కు వెళ్లాల‌నుకున్న సోనూసూద్‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఝ‌ల‌క్ ఇచ్చింది.

ఇవాళ పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఆ రాష్ట్రంలోని మోగా అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం నుంచి సోనూసూద్ సోద‌రి మావికా సూద్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తోంది. ఈమెను సోనూసూద్ ప్రోత్స‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. నామినేష‌న్ రోజు సోద‌రి వెంట సోనూసూద్ ఉన్నారు. ఎన్నిక‌ల రోజు కీల‌కం కావ‌డంతో ఆయ‌న మోగా నియోజ‌క‌వ‌ర్గంలోని పోలింగ్ కేంద్రాల‌ను సంద‌ర్శించాల‌ని భావించారు.

పోలింగ్ కేంద్రాల‌ను సంద‌ర్శించేందుకు వెళుతున్న సోనూసూద్‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ప్ర‌త్య‌ర్థులు ఫిర్యాదు చేశారు. సోనూసూద్ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని శిరోమణి అకాలీ దళ్ అభ్యర్థి బర్జిందర్ సింగ్ మద్దతుదారుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న్ను పోలింగ్ కేంద్రాల‌ను సంద‌ర్శించేందుకు అనుమ‌తించి వ‌ద్ద‌ని అధికారుల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశించింది. ఆయ‌న కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తున్న ఫిర్యాదులో వాస్త‌వం లేద‌ని ఆయ‌న అన్నారు. తాను స్థానికుడినని, కేవ‌లం పోలింగ్ కేంద్రాల బయట కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బూత్‌ల వద్దకు మాత్రమే వెళ్లిన‌ట్టు చెప్పుకొచ్చారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని ట్వీట్‌లో ఆయ‌న‌ ఆరోపించారు. ఈ ట్వీట్‌ను మోగా ప్రజా సంబంధాల అధికారికి, పోలీసులకు ట్యాగ్ చేశారు.