ఏ విషయంలోనైనా తనను కాదని ఇతరులను ఎంచుకోవాలనేది టీడీపీ ఫిలాసఫీ. ఇందులో తండ్రి చంద్రబాబుతో పోల్చుకంటే తనయుడు లోకేశ్ మించిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతసేపూ ఇతరుల సంగతే తప్ప, తన భవిష్యత్ గురించి లోకేశ్‌కు ఆలోచన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా, మంత్రిగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా ఇంకా జ్ఞానోదయం కానట్టుంది. ఈయనకు మాత్రం ఏపీ పోలీసులను చూస్తే జాలితో కూడిన అసహ్యం కలుగుతోందట! ఈ మాట అనడానికి ఆయనకు మనసెలా వచ్చిందో లోకేశ్‌కే తెలియాలి. ప్రధాన ప్రత్యర్థి వైసీపీని ఎదుర్కోడానికి బదులు, అధికారులు, పోలీసులను హెచ్చరిస్తూ పబ్బం గడుపుకోవాలనే ధోరణి లోకేశ్ మాటల్లో కనిపిస్తోంది.
తమపై వైసీపీ దాడులు చేస్తున్నా, వారి అరాచకాలకు ఖాకీలు కొమ్ముకాస్తూనే ఉన్నారని ఆయన తాజా ఆరోపణ. ప్రభుత్వ తొత్తు లుగా మారి ప్రశ్నించే ప్రజలు – ప్రతిపక్ష టీడీపీపై దాడులకు తెగబడ్డారన్నారన్నారు. ఇన్ని చేసినా కొంతమంది పోలీసులు చివరికి వైసీపీ మూకల బాధితులవుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు కానిస్టేబుల్ బండిపై మద్యం, బిర్యానీ పెట్టుకుని పార్టీ చేసుకోవడం బరితెగింపునకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులకే రక్షణలేని రాష్ట్రంలో ప్రజల్ని కాపాడేదెవరు అంటూ లోకేశ్ ప్రశ్నించడం గమనార్హం.
టీడీపీ హయాంలో అందరికీ రక్షణ బాగా ఉన్నట్టు లోకేశ్ మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ దాడులు, నడిరోడ్డుపై ఎంపీ కేశినేని నాని, బోండా ఉమా ఐపీఎస్ అధికారికి బెదిరింపుల విషయాన్ని సమాజం మరిచిపోయి వుంటుందని లోకేశ్ భావిస్తున్నట్టున్నారు. అంతెందుకు, తమకు కమీషన్ పెంచాలని కోరేందుకు వచ్చిన నాయీ బ్రాహ్మణులకు తోక కట్ చేస్తానని నడిరోడ్డుపై ముఖ్యమంత్రి స్థాయిలో తన తండ్రి హెచ్చరించిన వైనాన్ని లోకేశ్ మరిచిపోవడం విడ్డూరంగా ఉంది.
ఇక ఇంటెలిజెన్స్ అధికారికగా ఏబీ వెంకటేశ్వరరావు అరాచకాల మాటేంటని ప్రత్యర్థులు నిలదీస్తున్నారు. అందుకే మంగళగిరిలో లోకేశ్ రాజకీయ జీవితానికి సమాధి కట్టారని, ఆయనపై జాలితో కూడిన అసహ్యం కలుగుతోందని ప్రత్యర్థులు దీటుగా సమాధానం ఇస్తున్నారు.