ఇటీవల కాలంలో పలు కేసుల్లో ఈడీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో నిందితుల విచారణకు సంబంధించి ఈడీకి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ వేసిన పిటిషన్ను విచారించిన నాంపల్లి కోర్టు… జురిడిక్షన్ కారణంగా డిస్మిస్ చేసింది. దీంతో ఈడీకి నిరాశ తప్పలేదు.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ఇప్పటికే కొందరు నిందితులను ఈడీ విచారించింది. పేపర్ల కొనుగోలులో ఎంత మొత్తం చేతులు మారింది? ఆ డబ్బు ఎలా వచ్చింది? దీని వెనుక బడా నేతలెవరైనా ఉన్నారా? తదితర అంశాలపై ఈడీ లోతుగా విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలను ఇరికించేందుకే ఈడీ విచారణ చేపట్టిందనే ఆరోపణలు కూడా లేకపోలేదు.
ఈ లీకేజీ వ్యవహారంపై ఇప్పటికే కేసీఆర్ సర్కార్ వేసిన సిట్ దర్యాప్తు చేస్తోంది. గత 24 గంటల్లో కూడా నలుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఒకవైపు సిట్ దర్యాప్తు చేస్తుండగా, మరోవైపు ఈడీ తానున్నానంటూ విచారణలో అడుగు పెట్టింది. నిందితులను కస్టడీలోకి ఇవ్వాలన్న పిటిషన్ను కొట్టి వేయడంతో తదుపరి చర్యలేంటనేది తేలాల్చి వుంది. చివరికి ఈ వ్యవహారం ఏ మలుపు తిరగనుందో చూడాలి.
ఈ మధ్య టెన్త్ పబ్లిక్ పరీక్షల ప్రశ్న పత్రాలు కూడా లీక్ కావడం రాజకీయ దుమారానికి దారి తీసింది. దీని వెనుక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నాడంటూ కేసీఆర్ సర్కార్ అరెస్ట్ కూడా చేసింది. అలాగే ఈటల రాజేందర్ తదితర బీజేపీ ముఖ్య నేతల్ని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ పోరు చివరికి విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.