ఆశ్చ‌ర్యం… కేసీఆర్ బృందానికి విల‌క్ష‌ణ న‌టుడి స్వాగ‌తం!

మ‌హారాష్ట్రలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లో ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రిణామం. బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఒక కూట‌మి ఏర్పాటులో తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఆయ‌న మ‌హారాష్ట్ర సీఎం…

మ‌హారాష్ట్రలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లో ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రిణామం. బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఒక కూట‌మి ఏర్పాటులో తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఆయ‌న మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్‌ఠాక్రేతో చ‌ర్చించేందుకు ముంబ‌య్ వెళ్లారు. ముంబ‌య్ విమానాశ్రయంలో అనూహ్య రీతిలో కేసీఆర్ బృందానికి విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ స్వాగ‌తం ప‌లక‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యప‌రిచింది.

విమానాశ్ర‌యంలో త‌న‌కు ఆప్యాయంగా స్వాగ‌తం ప‌లికిన ప్ర‌కాశ్‌రాజ్‌కు కేసీఆర్ త‌న వెంట వ‌చ్చిన ఎంపీలు సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్‌రెడ్డిల‌ను ప‌రిచ‌యం చేశారు. అనంత‌రం సీఎం కేసీఆర్ బృందం మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే అధికార నివాసానికి చేరుకుంది. లంచ్ అనంత‌రం ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో ప్ర‌కాశ్‌రాజ్ కూడా పాల్గొన‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  

మోదీ స‌ర్కార్‌పై ప్ర‌కాశ్‌రాజ్ ప‌లు సంద‌ర్భాల్లో నిప్పులు చెరిగారు. మోదీ పాల‌నా విధానాల‌ను ప్ర‌కాశ్‌రాజ్ ఎప్ప‌టిక‌ప్పుడు తూర్పార‌ప‌డుతుంటారు. ఒకానొక సంద‌ర్భంలో ఆగ్రాలో తాజ్‌మ‌హ‌ల్‌ను మోదీ స‌ర్కార్ ఎప్పుడు కూల‌గొడ‌తుందో ముందే చెబితే …త‌న పిల్ల‌ల‌తో వెళ్లి చూసి వ‌స్తాన‌ని చేసిన ట్వీట్ సంచ‌ల‌నం సృష్టించింది. కొంత‌కాలం క్రితం టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్‌రాజ్ ఒక ప్యాన‌ల్‌కు నాయ‌క‌త్వం వ‌హించారు.

గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా ప్ర‌కాశ్‌రాజ్ తెలుగేత‌రుడ‌నే చ‌ర్చ తెరపైకి వ‌చ్చి, వివాదాస్ప‌ద‌మైంది. మొత్తానికి ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్‌పై మంచు విష్ణు ప్యాన‌ల్ గెలుపొందిన సంగ‌తి తెలిసింది. నిజానికి మా ఎన్నిక‌ల్లో పోటీ చేసి ప్ర‌కాశ్‌రాజ్ త‌న స్థాయిని త‌గ్గించుకున్నారనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. బీజేపీపై వ్య‌తిరేక‌తే ఈ స‌మావేశంలో ప్ర‌కాశ్‌రాజ్ పాల్గొన‌డానికి కార‌ణ‌మైంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.