మొన్నటికిమొన్న సర్కారువారి పాట ఫస్ట్ సింగిల్ లీక్ అయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య అనుకున్న టైమ్ కంటే 24 గంటల ముందే లిరికల్ వీడియోను విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు బాలకృష్ణ కొత్త సినిమా విషయంలో కూడా అదే జరిగింది. షూటింగ్ మొదలైన మొదటి రోజే ఓ వీడియో లీక్ అయింది. ఆ వీడియోతో బాలయ్య గెటప్ బయటకొచ్చేసింది. ఇవన్నీ మైత్రీ మూవీ మేకర్స్ లోనే జరగడం బాధాకరం.
సోషల్ మీడియాలో ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ సరికొత్త టార్గెట్ గా మారింది. మహేష్ అభిమానులు చేస్తున్న ట్రోలింగ్ కు అదనంగా ఇప్పుడు బాలయ్య అభిమానులు వచ్చి చేరారు. ఫస్ట్ లుక్ లో విడుదల చేయాల్సిన ఫొటోను, ఫస్డ్ డే షూటింగ్ లోనే లీక్ చేశారేంటంటూ 'మైత్రీ' నిర్మాతలపై విరుచుకుపడుతున్నారు నందమూరి అభిమానులు.
ఓవైపు ఈ ట్రోలింగ్ ఇలా నడుస్తుండగానే, వరుసగా రెండో రోజు కూడా బాలయ్య కొత్త సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి మరో వీడియో లీక్ అయి సంచలనం సృష్టించింది. ఈసారి బాలయ్య లుక్, అతడి గెటప్ మరింత స్పష్టంగా కనిపించింది. దీంతో అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ను ట్రోల్ చేస్తున్నారు.
బ్యానర్ పెట్టినప్పట్నుంచి ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు చేసింది మైత్రీ మూవీ మేకర్స్. మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఎప్పుడూ ఇలా లీకులు జరగలేదు. మరి ఇప్పుడే ఎందుకిలా లీకులు జరుగుతున్నాయి? ప్రచారం కోసం 'మైత్రీ'నే ఇలా చేస్తోందా లేక యూనిట్ లో ఇంటిదొంగ ఉన్నాడా? దీనిపై 'మైత్రీ' సీరియస్ గా ఆలోచించాల్సిన టైమ్ వచ్చేసింది.
ఎందుకంటే, బాలయ్య సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ లైనప్ ఆగిపోలేదు. నిన్న మహేష్ సినిమాకు జరిగింది, ఈరోజు బాలయ్య సినిమాకు జరిగింది. పవన్ కల్యాణ్, చిరంజీవి, ఎన్టీఆర్ తో కూడా సినిమాలు చేస్తోంది ఈ సంస్థ. ఆ హీరోల సినిమాలకు కూడా ఇలానే రిపీటైతే.. అందరితో సున్నం పెట్టించుకోవాల్సి వస్తుంది. బీ ఎలర్ట్ మైత్రీ.