పుట్టిన రోజు అంటే ప్రాణి ఉనికికి ప్రతీక. సహజంగా సినీ, రాజకీయ, పారిశ్రామిక సెలబ్రిటీలు పుట్టిన రోజులు జరుపుకోవడం చూస్తున్నాం. కానీ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతికి పుట్టిన రోజు ఒక తేదీ వుందనే విషయం తెలుసా? కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంత కొలువుదీరిన తిరుపతి ఈ నెల 24న 892వ పుట్టిన రోజు జరుపుకోనుంది. ఈ విషయాన్ని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఇవాళ ప్రకటించారు.
తిరుపతిలో నిర్వహించిన మీడియాలో సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. నరుడికైనా, నగరానికైనా జన్మదినం అనేది చాలా ముఖ్యమైందన్నారు. నరుడికైతే జీవితం, నగరం విషయానికి వస్తే చరిత్ర ఆ క్షణం నుంచి ప్రారంభమవుతాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రముఖ నగరాలు అవతరణ ఉత్సవాలు జరుపుకుంటున్నాయే తప్ప, ఖచ్చితమైన జన్మదినం ఎప్పుడో తెలియదన్నారు.
కానీ ప్రపంచ ప్రసిద్ధగాంచిన హిందువుల ఆధ్మాత్మిక నిలయమైన తిరుపతి నగరం విషయంలో మాత్రం ఆ సమస్య లేదన్నారు. తిరుపతి నగరానికి ఖచ్చితమైన జన్మదినం వుండడం ఒక ప్రత్యేక అంశంగా ఆయన చెప్పుకొచ్చారు. ఇది ఆశ్చర్యంతో పాటు అద్భతమైన విషయమని ఆయన అన్నారు.
1130వ సంవత్సరం, ఫిబ్రవరి 24న తిరుపతి అవతరించిందన్నారు. ఆ రోజు తిరుపతి తనకంటూ ఒక పేరును, రూపురేఖలను ఏర్పాటు చేసుకుందన్నారు. నాలుగుమాడ వీధుల నిర్మాణానికి మన తిరుపతి నోచుకుందన్నారు. ఈ విశిష్టతకు ప్రధాన సూత్రధారి భగవద్ రామానుజాచార్య అని ఆయన అన్నారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామి వారిని ప్రతిష్ఠించి, కైంకర్యాలను రూపొందించి శ్రీ రామనుజాచార్యులే అన్నారు. అది సౌమ్యనామ సంవత్సరం పాల్గుణ పౌర్ణమీ, ఉత్తరా నక్షత్ర సోమవారం 1130, ఫిబ్రవరి 24న తిరుపతి జన్మించిందన్నారు. అపుడే శ్రీ గోవిందరాజ స్వామి వారి నిత్య పూజ మంత్రపుష్పంలో ప్రతిరోజూ ఈ ప్రసక్తి నేటికి వినిపిస్తోందన్నారు.
అంతకు పూర్వం కపిలతీర్థం దగ్గర ఓ చిన్న గ్రామం ఉండేదన్నారు. దాన్ని కొత్తూరుగా పిలిచేవారని ఆయన తెలిపారు. తిరుశుకనూరు అయిన తిరుచానూరు వుండేదన్నారు. ఈ రెండింటి మధ్య భీకర కీకారణ్యం తప్ప, తిరుపతి అనేది లేదని ఎమ్మెల్యే తెలిపారు. సుదూరమైన ఏడుకొండల మీద శ్రీవారు నిలువునా నిలుచుని వుంటే తిరుచానూరు నుంచి పూజారులు నడుచుకుంటూ వెళ్లి కైంకర్యాలు జరిపి వచ్చే వారన్నారు. శ్రీ రామానుజాచార్యుల వారి రాకతోనే ఆ ఆలయాల్లో పూజా కైంకర్య విధానం అమల్లోకి వచ్చిందన్నారు.
మొదటి నుంచి అందరి మేలు కోరి, సమతా ధర్మాన్ని స్థాపించిన సత్యపూర్ణులు రామానుజాచార్యులన్నారు. మోక్ష సాధన కోసం గురువు అష్టాక్షరీ మంత్రం బోధిస్తే, దాన్ని ఆలయం ఎక్కి ఆనాడే అందరికీ సమతా, మమతా మూర్తి ఆయన అని భూమన కొనియాడారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పూజా, కైంకర్య నియమాలను స్థిరీకరించిన మహనీయుడు రామానుజాచార్యులే అని అన్నారు. ఇప్పటి వరకూ అన్ని కార్యక్రమాలు రామానుజాచార్యుల నియమానుసారమే జరుగుతున్నాయన్నారు.
అంతటి నిలువెత్తు వైష్ణవ సమతామూర్తి హస్త స్పర్శతో పులకించి ఆవిర్భవించిన ఆధ్యాత్మిక నగరం మన తిరుపతి అని ఆయన అన్నారు. తొలుత గోవిందరాజపురం పేరుతో పిలుచుకునే వారన్నారు. కాలక్రమంలో రామానుజపురం అయ్యిందన్నారు. ఆ తర్వాత 13వ శతాబ్దపు ప్రారంభం నుంచి తిరుపతిగా పిలుచుకుంటున్నట్టు ఎమ్మెల్యే భూమన వెల్లడించారు. ఈ విశిష్ట నగర పుట్టిన రోజును 24న నిర్వహించ తలపెట్టామని, జయప్రదం చేయాలని ఆయన కోరారు.