తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీకి ఊహించని షాక్ తగిలింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులోని నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ వేసిన పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈడీ వాదనతో ఏకీభవించని నాంపల్లి కోర్టు ఈడీ పరిధిలోని కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
కాగా పేపర్ లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న రేణుక, డాక్యానాయక్, రాజేశ్వర్ నాయక్, గోపాల్ నాయక్, షమీమ్ లను తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఈడీ వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో లక్షల రూపాయిలు చేతులు మారాయన్న ఆరోపణలతో ఈడీ ఎంటర్ అయింది. కోట్ల రూపాయలు హవాలా రూపంలో చేతులు మారినట్లు ఇప్పటికే ఈడీకి పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణను కుదిపేస్తుంది. అధికార, ప్రతిపక్షాలు లీక్ లపై మాటల దాడి చేసుకుంటున్నాయి. అటు విద్యార్థి సంఘాలు సైతం ధర్నాలు, దీక్షలతో ఉద్యమాలు చేయడంతో పేపర్ల లీక్ కేసులో వేగం పెంచిన సిట్. కస్టడీలో ఉన్న నిందితుల నుంచి కీలక సమాచారం రాబడుతుంది.