ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లో గ్యాంగ్ ధోరణి అత్యంత ప్రమాదకరంగా తయారైంది. రాజకీయాలెప్పుడూ స్థిరంగా వుండవు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఐదేళ్లకో, పదేళ్లకో అధికార మార్పిడి జరుగుతూ వుంటుంది. తాము తప్ప, మరొకరు అధికారంలో వుంటే ఓర్చుకోలేమంటూ కుదరదు. రాజకీయాల్లో సహనం ప్రధానం. అది లేని వారు త్వరగా పతనం అవుతారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో ఆదరణ పొందడానికి రకరకాల వ్యూహాలు రచిస్తుంటాయి.
అంతిమంగా ప్రజాదీవెన పొందిన పార్టీనే అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది. అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఆ పార్టీకి కొమ్ము కాసే ఎల్లో మీడియా డేంజర్ గేమ్‌కు శ్రీకారం చుట్టడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అసలు ఏపీలో పేదలే ఉండకూడదనే వారి ధోరణి డేంజర్ బెల్స్‌ను మోగిస్తోంది. ఏ రాజకీయ పార్టీ అయినా పేదరికాన్ని తరిమి కొట్టాలని కోరుకుంటుంటాయి. ఇది న్యాయమైంది కూడా. కానీ పేదలే ఉండకూడదనే రీతిలో రాజకీయాలు చేస్తే, అది సమాజ పతనానికి దారి తీస్తుంది.
రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలు ఉండకూడదని ఎల్లో గ్యాంగ్ అంటోంది. అలాగే “ఈనాడు” చెబుతున్న ప్రముఖ ఆర్థిక రంగ నిపుణుడు డాక్టర్ జీవీరావు అభిప్రాయం కూడా పేదలకు ఏమీ చేయకూడదని అనడం విచారకరం. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అప్పులు తెచ్చి ఉచిత పథకాలకు పంచి పెడుతోందని ఆయన వాపోయారు. అనుత్పాదక ఖర్చు చేస్తోందని ఆయన విమర్శించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిగా ఆర్థిక రంగ నిపుణుడు ఆందోళన వెల్లడించడం ఎల్లో గ్యాంగ్ అభిప్రాయాల్ని ప్రతిబింబిస్తోంది.
ఏ ప్రభుత్వమైనా అప్పులు తెచ్చి, దోచుకుంటోందని అంటే అర్థం చేసుకోవచ్చు. సంక్షేమ పథకాల పేరుతో పేదలకు లబ్ధి చేకూర్చడాన్ని బహుశా వ్యతిరేకించడం దేశంలోనే ఏపీ ప్రతిపక్షానికి, ఆ పార్టీని వెనకేసుకొచ్చే మీడియా, మేధావులకు మాత్రమే చెల్లుబాటు అవుతున్నాయి. ప్రజల వద్ద డబ్బు వుంటే అది మార్కెట్‌లో సర్క్యులేట్ అవుతుందన్న కనీస స్పృహ కూడా లేకపోవడం దేనికి నిదర్శనం? ఓర్వలేనితనం తప్ప, మరేదైనా కారణం వుందా? పేదలంతా మళ్లీ జగన్‌కు గట్టి మద్దతుగా నిలిచి, అధికారం కట్టబెడతారనే భయమే ఎల్లో గ్యాంగ్‌ని పిచ్చివాళ్లను చేస్తోందన్న విమర్శ బలంగా ఉంది.
తాజాగా రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి మరో 268 ఎకరాలు కేటాయించడం నేరంగా ఎల్లో గ్యాంగ్ రాద్ధాంతం చేస్తోంది. ఎక్కడైనా పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వకపోతే ఆందోళనలు చేసిన, చేస్తున్న ప్రతిపక్ష పార్టీలను చూస్తుంటాం. అదేంటోగానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దానికి పూర్తి రివర్స్‌లో సాగుతోంది. ఇప్పటికే రాజధానిలో పేదల ఇళ్ల పట్టాల కోసం 1134 ఎకరాలు కేటాయించడపై న్యాయపోరాటం చేస్తున్నారు.
రాజధాని లాంటి ఖరీదైన ప్రాంతంలో అలగా జనం వుంటే, తమ భూములకు రేట్లు ఎలా పెరుగుతాయని వారు బహిరంగంగానే అక్కసు వెళ్లగక్కుతున్నారు. పేదరికం లేని సమాజం కోసం కాకుండా, పేదలే లేని వ్యవస్థ కోసం ఎల్లో గ్యాంగ్ పోరాటం చేస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇదే వారి వైఖరైతే, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కేవలం ధనికులకు మాత్రమే దన్నుగా నిలుస్తుంది.
మిగిలిన వారిని అంటరానివారిగా చూడడానికి ఎల్లో గ్యాంగ్ ఏ మాత్రం వెనుకాడదు. ఏం చేయాలనేది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమవుతోంది.