జగజ్జననీ చిట్‌ఫండ్ కేసులో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్‌తో పాటు ఆమె మామ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు బెయిల్ మంజూరైంది. జగజ్జననీ చిట్‌ఫండ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా చందాదారుల సొమ్మును ఇతర అవసరాలకు మళ్లించారనేది అభియోగం. దీంతో డిపాజిటర్ల చట్టం కింద జగజ్జననీ చిట్‌ఫండ్ ఎండీ ఆదిరెడ్డి అప్పారావు, డైరెక్టర్ శ్రీనివాస్‌పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. అనంతరం వాళ్లిద్దరిని అరెస్ట్ చేసింది.
ఇది రాజకీయ దుమారానికి దారి తీసింది. కక్షపూరితంగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త, మామలను అరెస్ట్ చేశారని చంద్రబాబుతో పాటు ఇతర నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. వీళ్లిద్దరి అరెస్ట్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మార్గదర్శి అక్రమాల్లో రామోజీరావు, ఆయన కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, వీళ్లను మాత్రం ఎలా అరెస్ట్ చేస్తారని ఉండవల్లి ప్రశ్నించారు.
రామోజీరావు ఉదంతాన్ని చూపి, బెయిల్ పొందొచ్చని ఉండవల్లి సూచించారు. ఈ నేపథ్యంలో ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ బెయిల్‌కు సంబంధించి హైకోర్టులో వాదనలు రెండు రోజుల క్రితం పూర్తయ్యాయి. తాజాగా తీర్పు వెలువడింది. చిట్‌ఫండ్ వ్యవహారంలో విచారణ జరుగుతోందని, బెయిల్ ఇవ్వొద్దని ఏపీ సీఐడీ తరపు న్యాయవాది వాదనల్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు.
పిటిషనర్ల తరపు వాదనలతో కోర్టు ఏకీభవించింది. డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించలేదని ఏ ఒక్క చందాదారుడు ఫిర్యాదు చేయలేదని, కావున డిపాజిటర్ల చట్టం కింద సీఐడీ కేసు నమోదు చేయడం చెల్లదని ఆదిరెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరికీ బెయిల్ మంజూరు కావడం విశేషం. దీంతో టీడీపీ సంబరాలు చేసుకుంటోంది.