బాబు ఫొటో కోసం చేశారు… జగన్ నిజంగా చేశారు

2019 ఎన్నికల ఏడాదిలో హడావిడిగా నెల్లూరులోని ఓ టిడ్కో ఇంటిలో చంద్రబాబు, లబ్ధిదారులతో కలసి గృహప్రవేశం చేశారు. కట్ చేస్తే.. మరుసటి రోజు నుంచి ఆ ఇంటికి తాళం. మౌలిక వసతులు లేకుండా అక్కడ…

2019 ఎన్నికల ఏడాదిలో హడావిడిగా నెల్లూరులోని ఓ టిడ్కో ఇంటిలో చంద్రబాబు, లబ్ధిదారులతో కలసి గృహప్రవేశం చేశారు. కట్ చేస్తే.. మరుసటి రోజు నుంచి ఆ ఇంటికి తాళం. మౌలిక వసతులు లేకుండా అక్కడ ఎవరుంటారు, పైగా మిగిలిన ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. రేపు మాపో అయిపోతుందనుకున్న ఆ లబ్ధిదారులు ఇన్నాళ్లయినా ఇంకా ఆ ఇంటికి వెళ్లలేదంటే పరిస్థితి అర్థం చేసుకోండి. నిధుల్ని స్వాహా చేసి, నిర్మాణాలను సగంలో ఆపేసి బాబు దిగిపోయారు. ఆ భారాన్ని జగన్ ఇప్పుడు మోస్తున్నారు.

గత ప్రభుత్వం దించుకున్న భారాన్ని మోయడమే కాదు, తాను పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు జగన్ ప్రతి పేదవాడికీ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. జగనన్న కాలనీల పేరుతో ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా, ఇల్లు కట్టేందుకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేస్తున్నారు.

అలా మొదలైన జగనన్న కాలనీల్లో తొలి ఇల్లు ఇప్పుడు పూర్తయింది. గృహప్రవేశం కూడా అయింది. అయితే ఇది బాబులాగా ఫొటో ఫోజు కాదు, నిజంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా కోసంగిపురం సమీపంలో వెంగల సూర్యనారాయణ, మాధవి దంపతులు తమకు ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారు. శనివారం గృహప్రవేశం చేశారు.

తేడా ఏంటి..?

బాబు కట్టించి గృహప్రవేశం చేసిన ఇల్లు.. ఇప్పటికీ ఇంకా నివాసయోగ్యం కాలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థలం కేటాయించి, కట్టించి ఇచ్చిన ఇంటిలో ఇప్పుడో కుటుంబం కాపురముంటోంది. ఎవరిది గ్రాఫిక్స్, ఎవరిది రియాలిటీ. 

ఎవరిది భ్రమ.. ఎవరిది వాస్తవం? అమరావతిని సైతం ఇలా గ్రాఫిక్స్ లోనే చూపించారు చంద్రబాబు, మూడు రాజధానులతో పాలనా వికేంద్రీకరణ చేసి చూపాలనుకున్న జగన్ కి మాత్రం కోర్టులో కేసులు వేసి అడ్డుపుల్లలు వేస్తున్నాయి ప్రతిపక్షాలు.

జగనన్న ఇళ్లే శ్రీరామ రక్ష..

2024 ఎన్నికలనాటికి జగనన్న ఇళ్లే వైసీపీకి శ్రీరామరక్ష అంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అవన్నీ ఓ కొలిక్కి వస్తే, జగనన్న కాలనీల్లో ఓట్లన్నీ గుంపగుత్తగా ఫ్యాన్ గుర్తుపై మాత్రమే పడతాయి. ఇవి కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా 88 మున్సిపాల్టీల్లో 2.62 లక్షల ఇళ్లు.. టిడ్కో సాయంతో నిర్మించారు. వీటిని చంద్రబాబు మధ్యలోనే వదిలేసినా, జగన్ పూర్తి చేస్తున్నారు. ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించి ఇస్తున్నారు. వారందరికీ కూడా జగన్ దేవుడిలా కనిపిస్తున్నారు.

మొత్తమ్మీద ఏపీలో పేదల గృహనిర్మాణం అనే అధ్యాయంలో నాడు ఇందిరమ్మ ఇళ్లతో వైఎస్ఆర్ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటే.. నేడు జగన్.. ఏకంగా కాలనీలకు కాలనీలే నిర్మించి ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.