జగన్ కోసం కాదు.. రాష్ట్రం కోసం..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక. ఇది సీఎం జగన్ కు ఎంత మాత్రం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం కాదు. ఏడాదిన్నర క్రితమే భారీ మెజార్టీతో గెలిచిన సీటు అది. పైగా రాయలసీమ ప్రాంతం.…

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక. ఇది సీఎం జగన్ కు ఎంత మాత్రం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం కాదు. ఏడాదిన్నర క్రితమే భారీ మెజార్టీతో గెలిచిన సీటు అది. పైగా రాయలసీమ ప్రాంతం. జగన్ కు గెలుపు నల్లేర మీద నడక.  

పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎమ్మెల్యేలు, వైసీపీ శ్రేణులు ప్రత్యేకంగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ తిరుపతి ఉప ఎన్నిక గెలుపును జగన్ కోణంలో చూడకూడదు. 

రాష్ట్రం కోణంలో చూడాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఓటర్లు కూడా ఈ ఎన్నికను జగన్ దృష్టిలో చూడరని, రాష్ట్రాన్ని నాశనం చేసిన, చేయాలనుకుంటున్న పార్టీలకు మరోసారి గట్టి గుణపాఠం చెబుతారని విశ్లేషిస్తున్నారు.

ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్రాన్ని నిలువునా మోసం చేసింది బీజేపీ. ఐదేళ్లు కాదు, పదేళ్లు హోదా అంటూ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి, ఆ తర్వాత పూర్తిగా మాట మార్చేసింది. స్పెషల్ స్టేటస్ అనే అంశమే లేదంటూ కబుర్లు చెబుతోంది. 

మరోవైపు టీడీపీ హోదా విషయంలో ఏం చేసిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. హోదా కావాలంటూ ఓసారి, ప్యాకేజీనే ముద్దు అంటూ మరోసారి మాట మార్చి ఆంధ్రా-రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టింది.

ఇలాంటి టైమ్ లో తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ-బీజేపీకి చోటిస్తే.. ప్రత్యేక హోదా అవకాశాల్ని రాష్ట్ర ప్రజలే తగ్గించుకున్నట్టు అవుతుంది. గెలుపు కాదు కదా, కనీసం డిపాజిట్లు కూడా ఆ పార్టీలకు దక్కకుండా చేసినప్పుడే హోదాపై ఆంధ్రులు ఎంత గట్టిగా ఉన్నారో చెప్పినట్టవుతుంది.

అందుకే ఈ ఉప ఎన్నికను కేవలం జగన్ పాలనకు ప్రామణికంగా చూడకూడదు. ప్రత్యేక హోదాపై ఆంధ్రులు ఎంత కసితో ఉన్నారో, హోదాను ఎంత బలంగా కోరుకుంటున్నారో మరోసారి బీజేపీ-టీడీపీకి ఉమ్మడిగా తెలియజేసే గుణపాఠంలా ఉండాలి. 

అలాంటి గుణపాఠం చెప్పాలంటే తిరుపతి ఉప ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశామా అనుకునేలా ప్రతిపక్షాలకు ప్రజలు తీర్పునివ్వాలి. కలివిడిగా వచ్చినా, విడివిడిగా వచ్చినా.. పప్పులు ఉడకవనే విషయం ప్రతిపక్షాలకు తెలియాలి. 

తిరుపతి ఎన్నికల్లో అదే జరగబోతోంది. ప్రభుత్వ పాలనకు కొలమానం అని ఎగిరెగిరిపడుతూ.. అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించనందుకు ప్రజలు వేసే శిక్షే.. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం అవుతుంది. 

అటూ ఇటూ ఎటూ కాలేక!