క‌ర్ణాట‌క‌.. సీమ స‌రిహ‌ద్దుల్లో కాంగ్రెస్ హ‌వా!

క‌ర్ణాట‌క-ఏపీ బోర్డ‌ర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ సునాయ‌స విజ‌యాల‌ను సాధిస్తూ ఉంటుంది. ప్ర‌త్యేకించి రాయ‌ల‌సీమ‌తో స‌రిహ‌ద్దును పంచుకునే క‌ర్ణాట‌క ప్రాంతాల్లో కాంగ్రెస్ ఉనికి ఎప్పుడూ చెక్కు చెద‌ర‌దు. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి ఆమ‌డ…

క‌ర్ణాట‌క-ఏపీ బోర్డ‌ర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ సునాయ‌స విజ‌యాల‌ను సాధిస్తూ ఉంటుంది. ప్ర‌త్యేకించి రాయ‌ల‌సీమ‌తో స‌రిహ‌ద్దును పంచుకునే క‌ర్ణాట‌క ప్రాంతాల్లో కాంగ్రెస్ ఉనికి ఎప్పుడూ చెక్కు చెద‌ర‌దు. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి ఆమ‌డ దూరంలో నిలిచిన సంద‌ర్భాల్లో కూడా సీమ‌తో స‌రిహ‌ద్దును పంచుకునే క‌ర్ణాట‌క జిల్లాల్లో కాంగ్రెస్ హ‌వా ఉంటుంది!

బాగేప‌ల్లి, చిక్ బ‌ళాపూర్, గౌరీబిద‌నూరు, శిడ్ల‌గ‌ట్ట .. ఇలాంటి స‌రిహ‌ద్దుల్లోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు వీటిని ఆనుకుని క‌ర్ణాట‌క వైపు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా కాంగ్రెస్ దే హ‌వా ఉంటుంది. బంగార్ పేట్, దేవ‌న‌హ‌ళ్లి, కోలారు, హోస‌కోట‌, దొడ్డ‌బ‌ళాపూర్.. ఇలా సీమ వైపు నుంచి క‌ర్ణాట‌క‌లోకి వెళ్లాకా.. 40, యాభై కిలోమీట‌ర్ల దూరంలో వ‌చ్చే నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా కాంగ్రెస్ సిట్టింగులున్నారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో కూడా ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు మంచి అవ‌కాశాలున్నాయి. బెంగ‌ళూరు నార్త్ లో కూడా కాంగ్రెస్ దే హ‌వా ఉంటుంది. య‌ల‌హంక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని మిన‌హాయిస్తే మిగ‌తా చోట్ల బీజేపీ ది వెనుకంజే.

ఇక రాయ‌ల‌సీమ‌తోనే క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దును పంచుకునే మ‌రో ప్రాంతం తుమ‌కూరు. చిక్ బ‌ళాపూర్, కోలారు వైపు తెలుగు డ్యామినేష‌న్ ఉంటుంది క‌ర్ణాట‌క‌లో కూడా. అదే తుమ‌కూరు తో స‌రిహ‌ద్దును పంచుకునే తెలుగు ప్రాంతం మ‌డ‌క శిర వైపు క‌న్న‌డ ప్ర‌భావం ఎక్కువ‌! తెలుగు ప్రాంతం అయిన మ‌డ‌క‌శిర‌లో చాలా మంది క‌న్న‌డ మాట్లాడ‌తారు. క‌న్న‌డ ప్రాంతం అయిన కోలారు, దేవ‌న‌హ‌ళ్లి, దొడ్డ‌బ‌ళాపూర్, చిక్ బ‌ళాపూర్ అంతా తెలుగుమ‌యం! 

హిందూపురం వైపు నుంచి క‌ర్ణాట‌క‌లోకి ఎంట‌రైతే అదంతా తుమ‌కూరు జిల్లా. అక్క‌డ కూడా బీజేపీ లేదు! అయితే కాంగ్రెస్ లేక‌పోతే జేడీఎస్ ల ప్ర‌భావం తుమ‌కూరు జిల్లా అంతా. ప్ర‌ధాన‌వైరం అంతా ఈ రెండు పార్టీల మ‌ధ్య‌నే. తుమ‌కూరుతో మొద‌లుపెడితే.. పాత మైసూరు రాష్ట్రంలో జేడీఎస్ హ‌వా ఎక్కువ‌. మండ్య‌, మైసూరు ప్రాంతంతో పాలు స‌కలేష్ పుర వ‌ర‌కూ జేడీఎస్ రాజ్యం అది. ఇక్క‌డ బీజేపీ ఒక్క‌టంటే ఒక్క సీటు నెగ్గలేదు గ‌త ఎన్నిక‌ల్లో కూడా! జేడీఎస్ కు వ‌చ్చే సీట్ల‌లో 90 శాతం పాత మైసూరు రాష్ట్రం ప‌రిధిలోనే ఉంటాయి. ఆ పార్టీ బ‌లం ఈ ప‌రిధిలో కూడా త‌గ్గిపోతూ ఉన్నా.. ఇప్ప‌టికీ ప‌ట్టు అయితే నిల‌బెట్టుకుంటూ ఉంది. 

బీజేపీకి అనుకూల ప్రాంతం కోస్ట‌ల్ క‌ర్ణాట‌క‌. మంగ‌ళూరు, ఉడుపి బెల్ట్ భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఆట‌ప‌ట్టుగా నిలుస్తోంది. మ‌త‌ప‌రంగా సెన్సిటివ్ ఏరియా కావ‌డం ఇక్క‌డ బీజేపీకి మ‌రింత సానుకూల అంశంగా కావొచ్చు. ఈ ప్రాంతం అంతా బీజేపీ స్వీప్ చేసింది గ‌త ఎన్నిక‌ల్లో కూడా! ఈ సారి కూడా బీజేపీ ఆశ‌ల‌న్నీ అటువైపే ఉన్నాయి.విద్యాల‌యాల్లోకి హిజాబ్ నిషేధం అప్పుడు కూడా విద్యాల‌యాల్లో త‌మ నినాదాలు రేగింది మంగ‌ళూరు ప్రాంతంలోనే. మంగ‌ళూరు ఊర‌వ‌త‌ల నుంచినే కేర‌ళ ప్రారంభం అవుతుంది. క‌ర్ణాట‌క‌లోని ఈ స‌రిహ‌ద్దు ప్రాంతం అంతా బీజేపీ మ‌యం.

హైద‌రాబాద్ క‌ర్ణాట‌క‌లో ప్ర‌ధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల‌దే అయినా.. జేడీఎస్ కూడా ఇక్క‌డ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం కూడా సాధించి ఉనికిని నిలుపుకుంటోంది. జేడీఎస్ కు 90 సీట్లు పాత మైసూరు ప్రాంతం నుంచి అయితే, ప‌ది శాతం సీట్లు హైద‌రాబాద్ క‌ర్ణాట‌క‌లో ద‌క్కుతూ ఉంటాయి. బొంబాయ్ క‌ర్ణాట‌క‌లో కూడా గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఉనికిని చాటుకుంది. మ‌హారాష్ట్ర‌తో స‌రిహ‌ద్దును పంచుకునే నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ, వాటిని ఆనుకుని ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా కాంగ్రెస్ ఉనికి గ‌త ఎన్నిక‌ల్లోనూ ఉంది. ఈ సారి కూడా ఆ పార్టీ ఆశ‌లు ఆ ప్రాంతంపై బాగా ఉన్నాయి.

క‌ర్ణాట‌క‌లో ప్రాంతాల వారీగా రాజ‌కీయంగా ఈ స్ప‌ష్ట‌మైన విభ‌జ‌న ఉంది. ఒక్కో పార్టీ ఆధిప‌త్యం ఒక్కో చోటే ప్ర‌ధానంగా కేంద్రీకృతం అయి ఉంది. ఏపీ, తెలంగాణ, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు జిల్లాల్లో కాంగ్రెస్, పాత మైసూరు రాష్ట్రంలో జేడీఎస్, కోస్ట‌ల్ క‌ర్ణాట‌క నుంచి లోప‌లి వైపుకు బీజేపీ .. ఇక్క‌డే ఈ పార్టీ ల సీట్లు కేంద్ర‌కృతం అయి ఉన్నాయి. కోస్ట‌ల్ బెల్ట్ తో స‌హా, ధార్వాడ్- మ‌ధ్య‌క‌ర్ణాట‌క‌ వ‌ర‌కూ బీజేపీని కాంగ్రెస్ ఓడించ‌డం మీదే ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మార్పు ఆధార‌ప‌డి ఉండ‌వ‌చ్చు. ఏ పార్టీకి ప‌ట్టున్న చోట ఆ పార్టీ నెగ్గితే.. హంగ్ త‌ర‌హా ఫ‌లిత‌మే పున‌రావృతం కావొచ్చు. ఎమ్మెల్యేల జంపింగుల మీద ప్ర‌భుత్వ ఏర్పాటు ఆధార‌ప‌డ‌వ‌చ్చు!