జ‌ల స‌మ‌స్య‌లు పట్టవా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించిన అంశాల‌ పరిష్కారానికి కేంద్ర హోంశాఖ ఒక ఉపసంఘం నియమించింది. ఈనెల 17న ఆయా అంశాలపై చర్చించారు. చాలా ఆలస్యంగా అయినా కేంద్రం ఒక అడుగు వేయడం…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించిన అంశాల‌ పరిష్కారానికి కేంద్ర హోంశాఖ ఒక ఉపసంఘం నియమించింది. ఈనెల 17న ఆయా అంశాలపై చర్చించారు. చాలా ఆలస్యంగా అయినా కేంద్రం ఒక అడుగు వేయడం మంచి ప్రయత్నమే.

అజెండాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటు, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతల జిల్లాల ప్రత్యేక ప్యాకేజీ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పన్ను రాయితీ తదితర అంశాలను కూడా మొదట ప్రకటించారు. గంటల వ్యవధిలోనే ఉభయ రాష్ట్రాల మధ్య సంబంధం ఉన్న అంశాలను మాత్రమే ఈ సమావేశం అజెండాలో చేరుస్తున్నామని సవరించిన అజెండాను ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఐదు అంశాలు మాత్రమే  అజెండాలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే సంబంధించిన ఎన్నో రోజులుగా ప్రజా సంఘాలు పోరాడుతున్న అత్యంత కీలకమైన అజెండాలో చేరని పై నాలుగు అంశాలతో పాటు, విభజన చట్టంలో పేర్కొని అమలుకాని అంశాలపై మరో రోజైనా చర్చించి వాటి పరిష్కారం కోసం కేంద్రం బాధ్యత తీసుకోవాలి.

రెండు రాష్ట్రాలతో ముడిపడిన సమస్యలే ఈ సమావేశంలో ప్రధానం అంటున్నారు. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ముడిపడి ఉన్న కృష్ణానదీ జలాల సమస్యను కూడా ఈ సమావేశం పరిధిలోకి  తీసుకవచ్చి ఉండాలి. జలవిషయాలపై ప్రత్యేక సమావేశం కేంద్రం ఏర్పాటుకు సిద్ధం కావాలి.

విభజన ఉద్యమం పతాకస్థాయిలో నడుస్తున్న సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2013 నవంబర్ నెలలో బ్రిజేష్ ట్రిబ్యునల్ 65 శాతం నీటిలభ్యత ఆధారంగా కృష్ణాజలాలను లెక్కకట్టి  811 టీఎంసీల నికరజలాలు  +  49 టీఎంసీల అదనపు నికర జలాలు +  145 టీఎంసీల‌ వరదజలాలు కలిపి మొత్తం 1005 టీఎంసీలను కేటాయించింది.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో అదనపు నికర జలాలు, మిగులు జలాలను ప్రాజక్టుల వారీగా కేటాయించిన బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నీటిలో కొన్నింటిని మాత్రమే కేటాయించింది. అదనపు నికర జలాలు 49 టీఎంసీలలో జూరాల ప్రాజెక్టుకు 9 టీఎంసీలు, రాజోలిబండ కుడి కాలువకు కర్నూలు జిల్లా వైపు 4 టీఎంసీలు, నదీ ప్రవాహం కోసం 6 టీఎంసీలు మొత్తం 19 టీఎంసీ లు కేటాయించి మిగిలిన 30 టీఎంసీలను క్యారీ ఓవర్ కింద ఉంచింది. వరద జలాలలోని 145 టీఎంసీలలో  తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించి మిగిలిన 120 టీఎంసీలను క్యారీ ఓవర్ కింద ఉంచింది.

అంటే అదనపు నికరజలాలు, వరద జలాలు మొత్తం 150 టీఎంసీలు క్యారీ ఓవర్ కింద శ్రీశైలం, నాగార్జున సాగర్ లలో బ్రిజేష్ ట్రిబ్యునల్ రిజర్వు చేసింది. నీళ్లు తక్కువగా వచ్చే సంవత్సరాలుంటాయి కాబట్టి ఎక్కువగా నిల్వ ఉంచుకొనే నిమిత్తం క్యారీ ఓవర్ వాడుతారు. ఈ అంశం మొదటి బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో ప్రస్తావించారు. ప్రస్తుతం ఎక్కువ తక్కువలతో సంబంధం లేకుండా అన్ని జలాలను బ్రిజేష్ ట్రిబ్యునల్ పంచేసింది. నికరజలాలు లేని పక్షంలో ఈ క్యారీ ఓవర్ నీళ్ళనయినా 2013 కు ముందు బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ సమయంలో  కరువు పీడిత ప్రాంతాలకు కేటాయించమని అడిగి ఉండాలి. ఆ పని అప్పుడు జరగలేదు.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీజలాల కేటాయింపుల కోసం విభజన చట్టం ప్రకారం 2014 ఆగష్టున పై బ్రిజేష్ ట్రిబ్యునల్ కే కేంద్రం బాధ్యతలు అప్పచెప్పి రెండేళ్ళలో తుదితీర్పు నివ్వాలని కాలపరిమితిని కూడా నిర్ణయించింది. ఆ లోగా కేంద్రం ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ లో ఉభయ తెలుగు రాష్ట్రాలు తమకు ఇదివరకే కేటాయించిన 811 టీఎంసీల నికరజలాలలో 63/37 నిష్పత్తిలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్, 299 టీఎంసీలు తెలంగాణ వారు తాత్కాలికంగా వినియోగించుకొనేలా తాత్కాలికంగా ఒప్పందం జరిగింది. అదే ప్రస్తుతం కొనసాగుతుంది. భవిష్యత్తులో తుది తీర్పు ఆధారంగా నీటి కేటాయింపులు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014, భాగం-9, సెక్షన్ 85లో జల నిర్వహణ మండలి ఏర్పాటు, విధులను తెలుపుతుంది. అందులోని (8)ఇ..ప్రకారం, 11 వ షెడ్యూల్ లో కింద విధంగా ఉంది.

“ఈ కింద చెప్పిన, నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులు ఉనికిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(ఉమ్మడి) ప్రకటించిన పథకం ప్రకారం పూర్తిచేయాలి. వాటి నీటి కేటాయింపు ఏర్పాట్లు అదే విధంగా కొనసాగుతాయి. 1. హంద్రీనీవా 2. తెలుగుగంగ 3. గాలేరునగరి 4. వెలిగొండ 5. కల్వకుర్తి 6.నెట్టెంపాడు.”

వీటిలో మొదటి నాలుగు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినవి కాగా మిగతావి తెలంగాణకు సంబంధించినవి. ఉభయ రాష్ట్రాలలోని పై కరువు పీడిత ప్రాంతాల ప్రాజక్టులను పూర్తి చేసి, నీరివ్వాలని స్పష్టంగా విభజన చట్టంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం భాగం-9, సెక్షన్ 89  ప్రకారం కొత్త ట్రిబ్యునల్…

ఎ. అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం 1956 కింద ఏర్పాటైన ట్రిబ్యునల్, ప్రాజెక్టుల వారిగా నీటిజలాలాను కేటయించకపోతే, ప్రాజెక్టు వారీ కేటాయింపులు జరపడం.

బి. తక్కువ నీటి ప్రవాహం సందర్భాలలో ప్రాజెక్టుల వారీగా నీటిని విడుదల చేయడానికి ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్మించడం… అని ఉంది. 89 సెక్షన్ ప్రకారం పై రెండు అంశాలను మాత్రమే ప్రస్తుతం బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ చేస్తుంది.

విభజన చట్టంలో పేర్కొన్న సెక్షన్ 85 (8-ఇ), ప్రకారం 11 వ షెడ్యూల్ లోని కరువు ప్రాంతాల 6 ప్రాజెక్టుల నిర్మాణం, నీటి కేటాయింపుల విషయం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల కేటాయింపులకై  విచారణ చేస్తున్న బ్రిజేష్ ట్రిబ్యునల్ పరిధిలోకి రావటం లేదు.  89 వ సెక్షన్‌లో ట్రిబ్యునల్ విచారణ చేపట్టవలసిన చోట లేకుండా, 85 వ సెక్షన్ (8- ఇ) 11 వ షెడ్యూల్ లో కరువు పీడిత ప్రాజెక్టులను ఉంచారు. ఇది కావాలనే జరిగిందా? సాంకేతికంగా పొరపాటు వల్ల జరిగిందో ఆలోచించాలి. సెక్షన్ 89 ప్రకారం ట్రిబ్యునల్ ద్వారా కరువు ప్రాంత ప్రాజెక్టులు నీటి వాటాలు పొందకుండా, సెక్షన్ 85 లోని జల నిర్వహణ మండలి ద్వారా నీళ్లను పొందడానికి అవకాశం ఉండదు.

విభజన చట్టంలోని కరువు పీడిత ప్రాంతాల 6 ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని చెబుతున్నా, ఇవ్వడానికి బ్రిజేష్ ట్రిబ్యునల్ నీళ్ళు లేవని చెబుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు ఇదివరకు పేర్కొన్న 150 టీఎంసీల క్యారీ ఓవర్ నీళ్ళు మాత్రమే పంచేందుకు అవకాశం ఉంది. లేదా ఇప్పటికే కేటాయింపులు చేసిన ప్రాజెక్టులకు నికరజలాలను తగ్గించి వీటికి సర్దుబాటు చేయాలి. కరువు పీడిత ప్రాంత 6 ప్రాజెక్టులకు 159 టీఎంసీలు అవసరం అవుతాయి. కనీసం క్యారీ ఓవర్‌లో ఉన్న 150 టీఎంసీలతో వీటికి సర్దుబాటు చేయడానికి అవకాశం ఉంది.

ప్రస్తుతం విచారణ చేస్తున్న బ్రిజేష్ ట్రిబ్యునల్ క్యారీ ఓవర్ లేదా ఇతర జలాలను కేటాయింపు చేయాలంటే విభజన చట్టం సెక్షన్ 85 (8-ఇ) 11 వ షెడ్యూల్ లోని కరువుపీడిత ప్రాంతాల 6  ప్రాజక్టులను, సెక్షన్ 89 లోకి చేర్చి ట్రిబ్యునల్ విచారణ పరిధిలోకి తీసుక రావాలి. ఈ పని సాగకుండా ఒక్క చుక్క నీటిని కూడా భవిష్యత్తులో ఉభయ రాష్ట్రాలలోని కరువు పీడిత ప్రాంత ప్రాజెక్టులు పొందలేవు.

కేంద్ర ప్రభుత్వం తక్షణం పార్లమెంటు సాక్షిగా ఆమోదించించిన విభజన చట్టంలోని వెనుకబడిన కరవు పీడిత ప్రాంతాల ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు తోడ్పడాలి. ఈ విషయమై ఉపసంఘం ఏర్పాటు చేసి అవసరమైన కార్యాచరణ చేపట్టాలి. అవసతమైతే కరవు ప్రాంత ప్రాజెక్టుల కోసం విభజన చట్టం సవరణ కూడా చేయాలి. బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు మార్గదర్శనం చేయాలి.

దశాబ్దాలుగా  తెలంగాణా, రాయలసీమ ప్రజా సంఘాలు ఈ కీలక అంశాలు ప్రస్తావిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాల చెవికెక్కడం లేదు. సాధికారికంగా ఉన్న అవకాశాల ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం పరిశీలించకుండా కొత్త పేర్లతో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు పోటా పోటీగా చేసినా ట్రిబ్యునల్ లో నీటి కేటాయింపులు లేకపోతే వచ్చే ప్రయోజనం ఏమీలేదు. క్యారీఓవర్ నీళ్ళను కరవు పీడిత ప్రాంతాలకు ఇస్తే దిగువ ప్రాంతాల నుంచి వచ్చే వ్యతిరేకత మూటగట్టుకోవడం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తూ ఉండచ్చు.

అసలు క్యారీ ఓవర్ నీళ్ళు పంచడానికే లేదు. అది ప్రాజెక్టు డిజైన్ లోనే భాగమని అనే వాళ్లు ఉన్నారు. క్యారీ ఓవర్ నీళ్లు ప్రాజెక్టు లో భాగమైనపుడు కరవుపీడిత ప్రాంతాలు రాష్ట్రంలో భాగం కాదా? తాగడానికి నీళ్ళు లేక మలమల మాడిపోతుంటే రెండు పంటలకు ముందు జాగ్రత్తగా నీళ్ళు నిల్వ చేసుకోవడం ఏ రకంగా ప్రజాస్వామిక సూత్రమవుతుంది.

క్యారీ ఓవర్ నీళ్ళు వాడకుండా, మొదట నుంచి వాడుకొనే వారికే మొదటి హక్కు, పరీవాహక ప్రాంత ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం వంటి భూస్వామ్య, అశాస్త్రీయ వాదనలతో కరవు ప్రాంతాలకు నీటి చుక్క అందకుండా చేయడం ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సాగుతుంది. ఈ గుత్తాధిపత్య అన్యాయాన్ని వ్యతిరేకించకుండా కరవు ప్రాంతాలకు నీళ్ళు కేటాయించాలని ఉబుసుపోక కబుర్లు చెప్పడం ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది.

కళ్ళ ముందు నిల్వ ఉండే క్యారీ ఓవర్ నీళ్ళైనా దక్కనపుడు కరవుపీడిత ప్రాంతాలకు ఇంక దిక్కెక్కడ? కాసిన్ని నీళ్ళనైనా పొంది కన్నీళ్లను ఆపుకోలేని తరతరాల మొండి బతుకులు చిగురించేదెప్పుడు? ఈ సరైన సమయంలో కరవు ప్రాంతాలు మేల్కొని నీటిహక్కులు సాధించుకోక పోతే భావితరాలకు కన్నీళ్ళే మిగులుతాయి.

డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత, 99639 17187