మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసుల కేసులు, అరెస్ట్‌లకు సంబంధించి ప్రత్యర్థి పార్టీల నుంచి తీవ్ర విమర్శలను గౌతమ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
పోలీసుల చర్యలను తప్పు పడుతూ గౌతమ్ సవాంగ్‌కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక దఫాలు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా గౌతమ్ సవాంగ్‌ను డీజీపీగా తప్పించడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. కనీసం పోస్టింగ్ కూడా ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇంత కాలం గౌతమ్ సవాంగ్‌ను వాడుకున్న జగన్, అవసరం తీరాక పక్కన పడేశారని ప్రత్యర్థులు విమర్శించడం గమనార్హం. ఈ నేపథ్యంలో గౌతమ్ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇంకా మరో ఏడాది పాటు పదవీ కాలం ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ఆ పోస్టులో నియమించడం కుదరకపోవడంతో మళ్లీ చిక్కుముడి పడింది.
దీంతో డీమ్డ్ టు బి రిడైర్డ్ అనే నిబంధనను ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంది. గౌతమ్ తన పదవికి రాజీనామా, వెంటనే మరో పదవిలో కొలువు దీరడం చకాచకా జరిగిపోయాయి. గౌతమ్ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తూ పంపిన ఫైల్‌ను గవర్నర్ ఓకే చేసి పంపారు. దీంతో ఆయన్ను నియమిస్తూ సీఎస్ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చారు. గౌతమ్ సవాంగ్‌పై వచ్చిన విమర్శలు తుస్సుమన్నాయి.