ఆనం Vs నేదురుమల్లి.. వైసీపీలో మరో లొల్లి

రఘురామ కృష్ణంరాజు తర్వాత వైసీపీని మరింత ఇబ్బంది పెడుతున్న వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి అనుకున్నారంతా. ఆయనదే గొడవ అని లైట్ తీసుకున్నారు. అదిప్పుడు వైసీపీలో వర్గపోరుగా మారింది. ఆనంను వ్యతిరేకిస్తూ వెంకటగిరిలో నేదురుమల్లి…

రఘురామ కృష్ణంరాజు తర్వాత వైసీపీని మరింత ఇబ్బంది పెడుతున్న వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి అనుకున్నారంతా. ఆయనదే గొడవ అని లైట్ తీసుకున్నారు. అదిప్పుడు వైసీపీలో వర్గపోరుగా మారింది. ఆనంను వ్యతిరేకిస్తూ వెంకటగిరిలో నేదురుమల్లి వర్గం రెచ్చిపోతోంది. 

మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆనంను ఆడుకున్నారు. మా నాన్న పేరెందుకెత్తావంటూ ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు రాపూరు నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని అడిగారు. బాలాజీ జిల్లాకు ఆ మూడు మండలాల ప్రజలు వ్యతిరేకం కాదని అంటున్నారు రామ్ కుమార్ రెడ్డి.

గొడవ ఎందుకు..?

ఇటీవల జిల్లాల విభజన సహేతుకంగా లేదంటూ కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చి, నిరాహార దీక్షలు మొదలు పెట్టిన ఆనం రామనారాయణ రెడ్డి.. పరోక్షంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. 

గతంలో ఓ పెద్దాయన తనను, తన కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బ తీసేందుకు రాపూరు నియోజకవర్గాన్ని విభజించారని, అప్పట్లో ఓసారి స్థానికులు ఇబ్బంది పడ్డారని, మళ్లీ ఇప్పుడు జిల్లాల విభజనతో ఇబ్బంది పడతారని అన్నారు ఆనం. జనార్దన్ రెడ్డి పేరెత్తకపోయినా ఆనం వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దానికి జనార్దన్ రెడ్డి కొడుకు రామ్ కుమార్ కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.

రామనారాయణ రెడ్డి టీడీపీలో ఓడిపోయి ఖాళీగా ఉన్న సందర్భంలో తన తండ్రి ఆయన్ను తీసుకెళ్లి, కాంగ్రెస్ టికెట్ ఇప్పించారని గతం గుర్తు చేశారు రామ్ కుమార్ రెడ్డి, తన తల్లి వెంకటగిరి ఎమ్మెల్యేగా పలుమార్లు గెలుపొందినా, 2019లో ఆ సీటులో ఆనం గెలుపుకి తాను కూడా కృషిచేశానన్నారు. జగన్ కి ఇచ్చినమాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు.

ఆనంను తిడుతూ.. అధిష్టానానికి దగ్గరవ్వాలని..

ప్రస్తుతం ఆనం తిరుగుబాటు జెండా ఎగరేశారు, ఆయన్ను మిగతా జిల్లా నాయకులెవరూ పట్టించుకోవట్లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ దీక్షలు ఎలా చేస్తావంటూ కౌంటర్ ఇవ్వలేదు. 

కానీ ఎప్పటినుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్న రామ్ కుమార్ రెడ్డి ఆనంకి కౌంటర్ ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు గుప్పించారు. అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలనుకుంటున్నారు. 2024 ఎన్నికలనాటికి వెంకటగిరి వైసీపీలో ఎవరికి అవకాశం ఉంటుందో చూడాలి.